Search This Blog

Tuesday, October 18, 2011

నైపుణ్యం

ఈ విషయం మీద మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, 

అమ్మమ్మల కథల్లోనూ చాలా కథలే ఉన్నాయి. మనకందరికీ బాగా నచ్చిన ఒక కథ కుందేలు-తాబేలు పందెం కథ. ఆ కథ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఆ కథని మళ్ళీ క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత అసలు ఎందుకు ఇది రాస్తున్నాను అన్న సంగతి చెప్తాను.
కథ చూద్దాం., కుందేలుకి తన కంటే వేగంగా పరుగెత్తే వాళ్ళెవ్వరూ లేరని కొంచెం గర్వంగా ఉంటుంది. అది తన సత్తా చాటుకోవడానికి ఎవరూ దొరకలేదన్నట్టు తాబేలు దగ్గరకెళ్ళి , నాతో పరుగెత్తగలవా అని పందెం వేస్తుంది. తాబేలు ఆలోచిస్తుంది, నేను వేగంగా పరుగెత్తలేనని కుందేలుకు తెలుసు,ఇనా సరే నా దగ్గరికొచ్చి నన్ను ఆట పట్టిస్తోంది. తప్పనిసరిగా దీనికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని పందేనికి సరే అంటుంది. ఇక పందెం మొదలవుతుంది. కుందేలు కొంత దూరం పరుగెత్తి, వెనక్కి చూస్తే తాబేలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించదు. సరే ఎలాగూ నేనే గెలుస్తాను కదా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి కాస్తా గాఢ నిద్రలోకి మారిపోతుంది. ఈ లోపులో తాబేలు గమ్యం చేరుకుని పందెం గెలుస్తుంది. మెలకువ వచ్చి గమ్యం చేరుకున్న కుందేలుకి గర్వభంగం అవుతుంది. 

ఇదే తాబేలు తెలివితో ఇంకోలా కూడా చేసింది. ఇది కూడా అదే పందెం కథ కాని వేరేలా ఉంటుంది. పందెం వేసిన రోజు రాత్రి ఆ సంగతిని తాబేలు తన జాతి అంతటికీ చెప్తుంది. అప్పుడు అందులో ఒక వృద్ధ తాబేలు ఒక ఉపాయం చెప్తుంది. దానికి సరే అన్నాయి మిగతా తాబేళ్ళు.  మర్నాడు కుందేలు పందెం ప్రకారం పరుగు మొదలుపెడుతుంది. కానీ ఇక్కడ ఆ కథలోలా విశ్రాంతి తీసుకోదు. పరుగు పెడుతూనే ఉంటుంది. దాన్ని దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలు ఉంటుంది. మళ్ళీ దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలే ఉంటుంది. ఇలానే కుందేలు గమ్యం చేరకముందే అక్కడ తాబేలు ఉండడంతో కుందేలు ఖంగుతింటుంది. ఇక్కడ కూడా కుందేలుకి గర్వభంగం అయ్యింది. కానీ ఇది ఎలా సాధ్యపడిందంటే ఆ రాత్రి వృద్ధ తాబేలు ఇచ్చిన ఉపాయం అది. దాని ప్రకారం ఆ రాత్రే అవి రెండు మీటర్ల దూరంలో ఒక్కొక్క తాబేలు చొప్పున గమ్యం వరకు ఉండి ఉపాయాన్ని అమలుపరిచాయి. 
ఇక ఈ కథలో మనకు తెలిసేదేమిటి అంటే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. అదే సమయంలో మనం ఏమిటో అన్నది కూడా తెలుసుకోవాలి. ఎవరి గొప్పతనం వారిదే. ఒకరు బుద్ధితో చేస్తే, ఇంకొకరు బలంతో చేస్తారు. ఇవేవీ లేకుంటే తమ తెలివి తక్కువతనంతో కూడా విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు.
        ఇక ఈ కథ మీకెందుకు చెప్పానో చెప్తాను. ఎందరో బ్లాగర్లు..అందరికీ వందనాలు. ఇది నా మనసులో మాట మాత్రమేనండీ. పంచుకోవాలని అనిపించి ఇలా వ్రాస్తున్నాను. ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచీ ఒక విషయంలో బలహీనత ఏర్పడింది. ఇక్కడ ఎంతో మంది రచయితలు, రచయిత్రులు. అందరి కలాల నుంచీ జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు. అవన్ని చూసి నేను వీళ్ళ దరికి చేరగలనా? వీళ్ళ గులాబీ రాతల గుబాళింపుల ముందు నేనొక గడ్డి పూవును కూడా కాదే అని ఒక రకమైన భావన.ఇది ఈర్ష్య మాత్రం కాదండీ. ఆరాధనా భావం మాత్రమే. 

ఇదే భావాన్ని నేను ఒక నేస్తంతో పంచుకున్నాను. అప్పుడు తను నన్ను ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పమనడం, నేను సరే అనడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, " గూడు కట్టే పిట్ట గొప్పదా లేక పుట్ట పెట్టే చీమ గొప్పదా ?"  అని.

 నాకు తను అలా ఎందుకు అడుగుతున్నారో మొదట అర్ధం కాలేదు. ఐనా సరే జవాబు చెప్పాను. "దేని నైపుణ్యం దానిదే. అందులో ఎవరు గొప్ప అంటే ఏం జవాబు చెప్పగలం? ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం కదా"  అన్నాను. 
 దానికి తను " సరే మరి తెలిసింది కదా? ఇంకా ఈ బాధెందుకు? ఇక్కడ ఎవరూ ఎవరికీ తక్కువ కారు. ఎవరూ ఎవరికీ సాటి రారు. అటువంటప్పుడు మనం ఇలాంటివన్ని మనసులో పెట్టుకోకూడదు. మనం చేసే పనిని చేస్కుంటూ పోవడమే, ఇంకొకరితో పోల్చుకోవడం అన్నది బుద్ధి లేని వాళ్ళు చేసే పని" అని చెప్పేసరికి నాలో ఉన్న బాధ అర్ధం లేనిదనిపించింది. ఇంత చక్కగా చెప్పి నాలో ఉన్న ఆ భావనని సరి చేసినందుకు ఆ నేస్తానికి, ఈ విషయం అందరితో పంచుకునేలా నన్ను ప్రోత్సహించిన మరో నేస్తానికి బ్లాగోన్ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్కుంటున్నాను.
అలాగే నాలాగే ఇలా ఎవరైనా ఇదే భావనతో ఉంటే ఆ భావన నుంచి బయటికి రమ్మంటున్నాను. నిర్భయంగా, నిర్మొహమాటంగా మన భావాలని ప్రకటించమంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక విషయం దాగి ఉంటుంది. ఆ విషయాన్ని నలుగురితో పంచుకోవడం ఒక ఆనందం. ఆ ఆనందాన్ని దూరం చేస్కోకూడదని నాకనిపిస్తోంది. మరి మీకు ???                        

8 comments:

 1. చాలా చక్కగా వ్రాశారండీ! నిజమే ఈ భావన అందరికీ కలిగేదే! నేను బ్లాగు మొదలు పెట్టిన రోజు ఇదే మాట నా నేస్తంతో అన్నాను. ఎంతో మంది చక్కగా చాకచక్యంగా రాసేస్తున్నారు అసలు నేను రాసేదానిని చూసి నవ్వారు కదా అని! అప్పటికి నేను కాశ్మీరం గురించి మాత్రమే వ్రాసాను. దానికి వచ్చిన సమాధానం నీకు నచ్చినది, తోచినది నీ పద్ధతిలో నువ్వు రాయి, భావ వ్యక్తీకరణ ఏదయితే ఉందో అది ఎలా అయినా చేయచ్చు! కొత్త ప్రయోగాలు చేసినంతమాత్రాన నష్టమేమీ లేదు అయితే గుర్తింపు లేదా అనుభవం వస్తాయి అని! కనుక ప్రయోగాలు చేయాలి చేస్తూనే ఉండాలి! పుర్రెకో బుద్ధి ఎవరి బుద్ధి ఎవరికి నచ్చుతుందో చెప్పటం కష్టం! కనుక ఆలోచించకుండా మున్ముందుకి దూసుకుపోవాలని కోరుకుంటూ......

  ReplyDelete
 2. mee kadha anusarana enthagano bagundhi... idhi kachithanga andharini prabavitham chesthundhi... nannu chesindhi.... dhanyavadhaalu...:) :)

  ReplyDelete
 3. చాలా బాగా వ్రాశారు శుభా..కథ చెప్పిన రీతి, బొమ్మలు, పేజి ఫాంట్ అన్నీ బావున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా కొత్త బ్లాగర్లకు గొప్ప సహరాన్నందించే సందేశం. ఆశల తీరం వెంబడి, అనుభవాల దారుల్లో, అనుభూతులు ప్రోగు చేసుకుంటూ..మున్ము౦దుకు సాగిపొండి.

  ReplyDelete
 4. రసజ్ఞ గారూ చాలా థ్యాంక్స్ అండీ మీ అనుభవాన్ని కూడా ఇక్కడ పంచుకున్నందుకు. నిజమే ప్రయోగాలు చేస్తె వస్తే గుర్తింపు లేకుంటే అనుభవం వస్తాయి.. బాగా చెప్పారు. మరోసారి ధన్యవాదాలు మీకు .

  ReplyDelete
 5. కల్యాణ్ గారు మిమ్మల్ని ఈ టపా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. చాలా సంతోషం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  ReplyDelete
 6. జ్యోతిర్మయి గారు చాలా థ్యాంక్స్ అండీ... ఈ పోస్ట్ కొత్త బ్లాగర్లకు సహకారం అందిస్తుంది అంటే అంతకన్నా కావల్సింది ఏముంటుందండీ? మున్ముందుకు సాగిపొమ్మనే మీ ప్రోత్సాహం మరువలేనిది. ధన్యవాదాలు.

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !