Search This Blog

Sunday, October 20, 2013

"యువరాజ"కీయం

"స్వామీ!"

"ఏమీ!"

"యువరాజా వారు తమ దర్శనం కోరుతున్నారు"

"అని నీవు సందేశం తీసుకు వచ్చావా మూర్ఖ శిష్యా? పొమ్ము.. తక్షణమే తోడ్కొని రమ్ము"
(వీడి దుంప తెగ! వచ్చిన వాడిని వెంట తీసుకురాకుండా మళ్ళీ నాకు కబురొకటి. వాడి మూడ్ ఎలా ఉందో, వెయిట్ చేయించినందుకు నా గతి ఏమిటో, హతవిధీ!)

"భక్తులారా! ఈ రోజుకిక సత్సంగం సమాప్తం. స్వామీజీ వారి కాంత సేవకు సారీ ఏకాంత సేవకు వేళ ఐనది"

" బాబా అల్లకల్లోల స్వామీజీకి జై..
బాబా అల్లకల్లోల స్వామీజీకి జై.."

" హా! వీళ్ళ పిలుపు మండిపోనూ! అల్లకల్లోల ఏమిట్రా మూర్ఖ శిష్యా?"

"క్షమించాలి స్వామీ! అలక్ లాల్ స్వామీ అనే అంటున్నారు స్వామీ! మీకలా వినిపిస్తున్నట్టోంది" 

" స్వామీ! యువరాజా వారు వేంచేస్తున్నారు"

" స్వామీ మీరు లేచి వెళ్ళి స్వాగతం పలకడం ఏమిటి స్వామీ?"

" నోరు ముయ్యరా అర్భకా! యువరాజు వింటాడు" 

" చిత్తం స్వామీ!"

" మా ఆశ్రమం పావనం అయ్యింది యువరాజా! కబురు చేస్తే మేమే..."

" ప్రణామములు స్వామీజీ"

" సకల సంపదా ప్రాప్తిరస్తు" 

" యువరాజా వారెందుకో చింతిత మనస్కులై ఉన్నట్టున్నారు!"

" చింత కాకుంటే మరేముంటుంది స్వామీ? రాజమాత ఆరోగ్యమా అంతంత మాత్రంగా ఉంటోంది. నలభై దాటిపోయినా నేనింకా యువరాజులాగే ఉన్నాను.యువరాజు, యువరాజు అని అనడమే గానీ నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది స్వామీ"

(హమ్మయ్యా! బయట నిలబెట్టినందుకు నేను స్వామిని కాకుండా పోతానేమో అనుకున్నాను. ముందరి కాళ్ళకు బంధం వేయడం మంచిదైంది.ఐనా పెళ్ళి ఒక్కటే చేస్కోలేదు కానీ నువ్వేమన్నా తక్కువ ఎంజాయ్ చేస్తున్నావా నాయనా?)
" అదేమిటి నాయనా! ఇప్పుడు నీ మనశ్శాంతికి వచ్చిన ఆపదేమిటి?"

" ఏం చెప్పమనటారు? ఐనా మీకు తెలియనివి ఏమున్నాయి చెప్పండి? ఆలోచించకో, చించో రాజమాత ముందు అన్నీ చేసేస్తుంది.తర్వాత నన్ను చంపుతుంది. మొన్నటికి మొన్న అవినీతి పరులైనా, రౌడీలైనా, దగాకోరులైనా, ఖూనీకోరులైనా ప్రతీ అడ్డమైనవాడికీ రాజ సభలో చోటు ఉంటుంది అని చట్టం తీసుకొచ్చి నా నెత్తికి చుట్టారు. ఇక నా జోక్యం తప్పలేదు.ఇది మొన్న జరిగిందే., అంతకుముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు, ఎన్ని సర్దిపుచ్చలేదు చెప్పండి. ఐనా నేనెన్ని హీరో వేషాలేసినా  జనాల దృష్టిలో మన విలనిజం పోవట్లేదు లెండి...అది వేరే విషయం. సరే ఈ రాజ తంత్రాలన్నీ ఒక ఎత్తు. అరే నేనెప్పటి నుంచో పెళ్ళి చేయండి మొర్రో అని మొత్తుకుంటుంటే నన్ను కానట్టే ఉంటుంది మా అమ్మ. అసలు ఆవిడ ఉద్దేశ్యం ఏమిటో చెప్తే నేను ఇంక ఆ సంగతి ఏమీ అడక్కుండా వేరే దారులేమన్నాచూస్కుంటా కద స్వామీ! ఆ మాత్రం సెన్స్ కూడా లేదా?"

( ఇండైరెక్టుగా ఇప్పుడేమీ లేవని చెప్తున్నావా నాయనా నాకు? పిట్ట కథలు ఇంకెన్ని వినాల్సి వస్తుందో కానీయ్!)
" అవును నాయనా! అవును" 

" అంతేనా స్వామీ! ఇప్పుడు ఈవిడ సృష్టించిన సమస్యలు చూస్తే ఉండగా ఉండగా నా గతి ఏమఒతుందా అని భయంగా ఉంది స్వామీ! రాజ్యంలో ఎక్కడ చూసినా మా మీద కినుక వహించని ప్రజలు లేరంటే నమ్మండి. అసలు మా అమ్మ సిద్ధాంతం చెప్పమంటారా? విభజించి పాలించమంటుంది, మనకి ఎదురు చెప్పని వాళ్ళే అధికార పీఠంలో ఉండాలంటుంది, మన మీద ఎంత బురద ఉన్నా దున్నపోతులా దులిపేసుకోవాలంటుంది. పక్కోడు ఎంత మేధావైనా ఆడ్ని తొక్కేసి, నొక్కేసి అది మనం ఉపయోగించుకోవాలంటుంది. అసలు ఇదంతా మా రాజ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అంటుంది. ఇదంతా తప్పని నేను అనడం లేదు స్వామీ! కానీ..."

"(వార్నీ! ఇదంతా తప్పు కాదా? మరెందుకు నాయనా ఈ గోడు)"  

" కానీ.. ఇదంతా చేయడానికి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది కదా!మీరే చెప్పండి స్వామీ! వాళ్ళేమన్నా వెర్రోళ్ళా? జనాల దగ్గర ఊరికే విలన్లు ఐపోవడానికి?"

( ఇంతకీ ఈయన గారి అంతరార్ధం ఏమిటి చెప్మా?)
అవును నాయనా! నిజమే కానీ మీ అంతరార్ధం ఏమిటో..."

" అదే స్వామీ చెప్తున్నాను. ఖజానా చూస్తే అంతంత మాత్రంగా ఉంది.మేం దోచుకున్నది ఖర్చు పెడదామంటే, ఆ తర్వాత్తర్వాత అడుక్కు తినడానికి కూడా పనికిరాకుండా పోతాం. అందుకని..."

(వారి పిడుగా! నన్నే ఇరికిస్తున్నావూ.. నీ దుంప తెగ!)
"ఆ.. అందుకని..ఏమిటో చెప్పండి యువరాజా?"

" ఆ.. ఏముంది స్వామీ! ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకి వచ్చే విరాళాల కన్నా, స్వామీజీలకు వచ్చే కలెక్షన్లే ఎక్కువ.."

( అందుకని నాకే ఎసరు పెడతావురా కుంకా!)

" అలా అని మీ సంపద కొల్లగొట్టాలని మా అభిమతం కాదు స్వామీ!"

(మరేమిటిట?)

" పార్టీకి విరాళాలు బాగానే వస్తున్నాయి.. కాదనటం లేదు.కానీ ఎవడన్నా విరాళం ఇస్తే ఊరికే ఇవ్వడు కదా!  నీకది- నాకది పద్ధతి ఇక్కడ.."

( ఒకడిది ఒకడు నాక్కునే పరిస్థితి అని చెప్పరాదూ శుంఠా!)

" మరి మన ప్రజలనే వారు అలా కాదే..వాళ్ళలో మన పరపతి పోకుండా ఉండాలంటే వాళ్ళని కూడా కొనుక్కోవాల్సిందే కదా స్వామీ? "

" వాళ్ళేమన్నా వస్తువులా నాయనా కొనుక్కోవడానికి?"  

" మీరు అలా లాజిక్ తీసారనుకోండి, మేము కూడా తీయాల్సి వస్తుంది. ఈ విభూదిలోనూ, తాయెత్తు లోనూ యెంత మహిమ ఉందో మీకూ తెలుసు, మాకూ తెలుసు.."

(అలా వచ్చావా నాయనా? ఇక నువ్ చెప్పేది వినడం తప్ప నేనేం చేయగలనులే)
" అసలు ముందు నీ మనసులో ఉన్న విషయం చెప్పు నాయనా!"

" అదే స్వామీ! ఎలా మొదలు పెడదామా అని... ఇప్పుడూ.. ఈ విరాళాలూ, కుంభకోణాలూ, దోచుకోవాడాలూ, దాదాగిరీలూ అన్నీ పాత పద్ధతులు ఐపోయాయి స్వామీ! నాకెందుకో మన రాజ్య చరిత్రని ఒకసారి తవ్వి తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన్ వచ్చింది స్వామీ!"

( ఏమంటున్నాడబ్బా! నాకంతా అయోమయంగా ఉందేమిటీ? ఇందులో ఏం తిరకాసు పెడుతున్నాడు వీడి దుంపతెగ! మొత్తానికి నన్ను ఇరికించడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు..థూ..నా బతుకు)
" తమరి ఆలోచనలోని అంతరార్ధం నాకు బోధపడలేదు నాయనా!"

" ఇందులో బోధపడ్డానికేముంది స్వామీ! చరిత్రని తవ్వి తీయడమంటే నిధి, నిక్షేపాలని పట్టడం అని.." 


( ఓరి నీ బతుకు బందెల దొడ్డిలో కట్టెయ్యా!ఇదేం ముదనష్ఠపు ఐడియా రా? ఐడియా.. హూ.. నిజంగానే ఇది నా లైఫ్ నే మార్చేసేటట్టుంది. నీ యువరాజాగిరీతో నా స్వామిగిరీకే ఎసరు పెడితివి కదరో నీ... కంట్రోల్.. కంట్రోల్..)

" ఏమిటి స్వామీ! ఆలోచిస్తున్నారు?|"

" అదే నాయనా! ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అని?"

" మీరు ప్రయత్నం, ప్రచారం మొదలుపెట్టండి. దానిని అమలులోకి తెచ్చే బాధ్యత నాది. ఎలా సర్ది చెప్పాలో. ఎలా పక్క దారి పట్టించాలో అదంతా నేను చూసుకుంటా. మీరు మాత్రం మీ కర్తవ్యం నిర్వహించండి. మీ కర్తవ్య నిర్వహణలో తేడాలేమన్నా వస్తే...."

" అమ్మమ్మా! ఎంత మాట నాయనా? ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఈ పాటికి ఒక ప్రభంజనమే మొదలవుతుంది"

" అప్పుడే మీకు ఆలోచన వచ్చినట్టూంది కదూ స్వామీ?"

" రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేమిటి నాయనా"

" ఐతే మరి మాకిక సెలవా స్వామీ!"

" మంచిది నాయనా! త్వరలోనే నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా నాయనా!"

" ప్రణామములు స్వామీ!"

" పాపీ చిరాయువు!"

" స్వామీ!"

" ఆ.. అదే నాయనా! దీర్ఘాయుష్మాన్ భవ!"  


చరిత్ర ఇక ఇప్పుడు పుస్తకాల్లో మాత్రమే చూడాల్సి ఉంటుందేమో.. సారీ చదవాల్సి వస్తుందేమో.. దర్శనీయ స్థలాలు అనేవి కూడా ఇక దేశ పటంలో కనిపించవు. 
ఈ మాట ఎందుకంటున్నానో ఈ పాటికి మీకు అర్ధమైపోయే ఉంటుంది. ఇలా ఎవరికో కలలు, కాకరకాయలు వచ్చాయని వాటిని స్వయంగా ఆర్కియాలజీ వాళ్ళే దగ్గరుండి తవ్వించడం చూస్తుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన కల దేశానికింకేం ఉంటుంది.ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకొకచోట తవ్వేస్తారు. ఉన్నవే ఏవో కొన్ని మచ్చు తునకలు ఉంటే వాటికి కూడా ఏం దుర్గతి పడుతోందో?

ఉత్తరప్రదేశ్ లోని రాజా రావ్ రాం బక్స్ సింగ్ కోటలో జరుగుతున్న తవ్వకాలకి ఇది నా స్పందన.





 




Sunday, August 4, 2013

శుభాకాంక్షలు


పలుకరించే తావిలా
నవ్వే పువ్వులా
చిగురించే ఆశలకి
కనులు కన్న స్వప్నాలకి 
తొలి వేకువ నువ్వే నేస్తమా..!

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!!

Saturday, July 20, 2013

ఏమైందబ్బా మన బుర్రు పిట్ట??

 ఆ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మరి అలా పెట్టకపోతే ఎలా పెడతారండీ? ఎప్పుడో ఐదు నెలల క్రితం చూసాం టపా.. మళ్ళీ ఇప్పటి వరకు లేదు అంటే అలా అనకపోతే ఎలా అనమంటారు.. మీరే చెప్పండి.. నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటారు ఆ టపాల కోసం! మేమేం చూడట్లేదంటారా? ఎందుకండీ నమ్మే మాట చెప్పండి.. ఏమో బాబూ నేను ఐతే మనసులో మాట అస్సలు దాచుకోలేను;) అందుకే చెప్పేసాను.
ఏమటండీ అలా చూస్తున్నారు వింతగా? దేని గురించి ఈ గోల అంతా అంటారా? అక్కడికే వస్తున్నాను. ఓ ఖంగారు పడిపోతే ఎలా చెప్పండి.. 
అదే నండి క్రితం సంవత్సరం నా బ్లాగులో పిట్ట కొంచెం అని టైటిల్తో ఒక టపా వ్రాసాను గుర్తుందా? దానికి ఇది కొనసాగింపన్నమాట.అప్పుడే గిర్రున ఇంకో సంవత్సరం తిరిగిపోయింది. ఇంకా గుర్తు రాకపోతే,ఏం చేస్తాం ఆ లింక్ నొక్కి చూడండి.విషయం అర్ధమైపోయిందా ఐతే? అమ్మయ్యా.. అదన్నమాట సంగతి. 
ఈ రోజు ఆ పిట్ట పుట్టినరోజండీ.ఆ పిట్టా?? క్షమించాలి క్షమించాలి పిట్ట అని వ్రాసి వ్రాసి అదే అలవాటైపోయింది;) అదేనండీ మన రసజ్ఞ(నవరసజ్ఞభరితం బ్లాగు) పుట్టినరోజు.ఇంకెందుకాలశ్యం రండి రండి శుభాకాంక్షలు చెప్పేద్దాం.
మనఃపూర్వక పుట్టినరోజు "సుభా" కాంక్షలు రసజ్ఞ.
బంపర్ ఆఫర్ : మా బుర్రు పిట్ట ఆచూకి చెప్పిన వారికి ఒక మంచి బహుమతి.చెప్పని వారికి కూడా ఉంటుందండోయ్.కానీ బహుమతి ఇప్పుడప్పుడే చెప్పబడదు:)   


కొసమెరుపు: ఎక్కడ ఉన్నా ఏమైనా, ఎవరికి వారే వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా;) 
రసజ్ఞా శుభాకాంక్షలని చెప్పి ఇలా పిచ్చి వ్రాతలు వ్రాస్తావా అని ఏ కత్తో పట్టుకుని రాకు బాబోయ్.. నేను జంప్ ఇక్కడ నుంచి.. ఐనా నేను అందుకే వచ్చాను రామా హరి;)  


Sunday, April 7, 2013

స్వరాల వీణ మీటి..



పల్లవి:
స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా
 

చరణం :
ఏ చిలిపి ఊహో ఉప్పొంగి నాలో
వసంతమాడే వనాలలోన
వయారి ప్రాయం వరించినాక
మరులెన్నొ పూచే మనస్సులోన
ఈ సందె వేళ లోన
ఈ చిలిపి చిందులోన
చిన్నారి కోయిలమ్మ కుహుకుహూల పాట కానా

 

చరణం :
హరివిల్లి వంగీ నా సిగ్గు తుంచీ
నా లేత పెదవే ముద్దాడుతుంటే
నా చెంపపైనే చిటికేసిపోయే
వరాల పిలుపై చిగురంత చినుకే
ఆ ముద్దుగుమ్మ నేనై
ఆ సొగసు రెమ్మ నేనై
వర్ణాల వానలోన తడిసి తడిసి మురిసిపోనా

స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా

Sunday, March 3, 2013

మనసు పుటల్లో..,

    
     
 నా రేయి నీ కలలతో ఆరంభం అవుతుంది.. నా వేకువ నీ తలపుల రేఖలతో విచ్చుకుంటుంది. అందుకనో మరేమో గానీ నా ప్రతి రోజూ కొత్తగానే ఉంటోంది. రోజు మొదలు ఎన్ని రకాలుగా సతాయిస్తావో తెలుసా?!
     జనాల్లోకి వెళ్తాను, నువ్వు గుర్తొస్తావు. ఇక చూడు, నేనక్కడ ఒంటరిగా మిగిలిపోతాను. ఎక్కడికో దూరంగా వెళ్తూ ఉంటాను., నీ జ్ఞాపకాల పరిమళాలు ఆ గాలిలో కలిసి నాతో పాటూ సాగిపోతూ ఉంటాయి. ఎంత దూరంగా నే వెళ్తే అంత దగ్గరగా వస్తూ ఉంటావు. ఆ వెళ్ళే దారుల్లో విరిసే ప్రతి పువ్వూ నీ నవ్వే చిందిస్తూ ఉంటుంది. ఏ దిక్కున చూసినా నవ్వే నీ రూపమే కవ్విస్తూ ఉంటుంది.
కాసింత అలిసి, రెప్ప మూసుకుంటుందా., ఎదురుగా వస్తావు. ఇక చిలిపి ఊహ ఆగుతుందా? అలసట తీరే దారే నువ్వు కదా మరి. ఇక ఆ ఊహ అలుపే ఎరుగదు.
       వాకిలిలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతుంటానా? దారి కాచి మరీ నువ్వెక్కడ అని అడుగుతుంది ఆ వెన్నెల పిల్ల. నువ్వుంటేనే ఇంత వేడిగా ఉంది, ఇక తను కూడా తోడైతే అని అనుకుంటాను కానీ, చిన్నబుచ్చుకుంటుందని తనతో అనను. ఒక నవ్వు మాత్రం పెదవులపై నిలుస్తుంది. ఆ మాత్రానికే నీలాగే తను కూడా అలిగి కూర్చుంటుంది. దీనికి తోడు నేను నీతో పదే పదే పాడించుకునే ఆ పాట నా చెవుల్లో మ్రోగుతూ ఉంటుంది., మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే అంటూ...
       నిజం చెప్పొద్దూ! అలిగినప్పుడు నువ్వేం చేస్తావో., పైకి మాత్రం బుంగ మూతి పెట్టుకుని, ఇక నిన్ను తలవనే తలవను కల్లో కూడా అని అంటూనే, అలా అలా ఇంకా ఇంకా నా గురించిన ఆలోచనల్లో పడిపోతూ, నా ప్రేమలోనే మునకలేస్తూ ఉంటావు. నాకు తెలియనే తెలియదని అనుకుంటూ ఉంటావు. ఎంత పిచ్చిదానివో కదూ! ఐనా ఆ పిచ్చి అంటే నాకు బోలెడంత ఇష్టంలే.
      ఎప్పుడొస్తావో అనుకుంటూ, నీ రాక కోసం చూస్తూ చూస్తూ, నిన్ను చూసే వరకు, జాబిల్లి కోసం ఆకాశమల్లే అని మనసు పాడుకుంటూ ఉంటుందా, ఈ ఎదురు చూపుల బాధ నా ఒక్కడిదే కదా అనుకుంటూ చుట్టూ చూస్తే, నాతో పాటూ పూలు-గాలీ, చెట్టూ-పిట్టా. కొమ్మా-రెమ్మా అన్నీ ఆ దారి వైపే.
ఎప్పుడొస్తావో ఏమో, చిలిపితనం అంతా ఆ కళ్ళల్లో, కొంటెతనం అంతా ఆ పెదవుల్లో నింపేసి నవ్వుతూ చూస్తుంటే., ఇక ఉడుక్కోవడం నా వంతవుతుంది.
అప్పటి వరకూ నాకు తోడుగా ఉన్నవన్నీ నీ రాకతో నీ అల్లరికి తోడవుతాయి.
తిరిగి నన్ను బుజ్జగించడానికి చేసే నీ ప్రయత్నాలు చూసి ఈ సారి చిన్నబోవడం వాటి వంతు.
       "అలకలో అమ్మాయిలు అందంగా ఒదిగిపోతారని అందరి అభిప్రాయం.. కానీ అబ్బాయిలు అలిగితే ఇంతందంగా ఉండడం నువ్వెప్పుడైనా చూసావా" అని కిలకిలా నవ్వుతుంటే. ఏమని చెప్పను ఆ అందమైన అనుభూతిని. అసలు నేనలిగేదే ఈ ఒక్క నవ్వు కోసమే అని నీకు తెలుసా?
      నీ చిరు చిరు నవ్వుల్లోనే నా చిన్ని చిన్ని ఆనందాలు కలబోసి ఉంటాయని, నీ కాలి అందెల సవ్వడిలో నా గుండె లయలు దాగున్నాయని, నీ కాటుక కన్నుల చూపుల్లో నా రేపటి ఆశలు తొంగి చూస్తూ ఉంటాయని, చీకటిలో కూడా నీ నీడ నీకు కనిపిస్తూ ఉంటే, అది నీవు కాదు సుమా! నీలో కలిసిపోయిన నేనే అని తెలుసా? 
        ఎందుకింత ప్రేమని నువ్వడిగితే.,
తన పెదవులపైన మధువులన్నీ ఆ తుమ్మెద కోసమే అనే ఆ పూల కన్నియను ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
అణువణు
వునా తననే పెనవేసుకుని, తన హృదయంలోనే తలదాచుకునే పచ్చని తీవెలంటే ఆ తరువుకి ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
ఆ తీరాన్ని తాకాలని ఎగిసే అలల ఆరాటానికి ఎందుకంత తపన అంటే ఏమని చెప్పగలదు?
ఎన్నెన్నో హొయలు పోతూ, అంతెత్తునుంచి అమాంతం దూకే ఆ సెలయేరుని చేతులు చాచి అక్కున చేర్చుకునే ఆ పుడమి తల్లిని ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
      వీటి లాగే నా జవాబు కూడా మౌనమేనేమో.. ఒక్కటి మాత్రం నిజం. బహుశా! ఇదే జన్మ పదే పదే కావాలనుకుంటా., నీ ప్రేమలో నన్ను చూసుకోవడం కోసం..! 
      ఏమిటి అలా చూస్తున్నావు చిత్రంగా? ఏం వెతుకుతున్నావ్ అసలు? నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? " అబ్బా! ఇది ఉత్తరమా? మొదలూ లేదు, చివరా లేదు.. అసలు ఒక పలకరింపు లేదు, ఏం లేదు.. ఇది నాకు వ్రాసిందేనా? పేద్ద వ్రాసాడులే" అని మూతి మూడు వంకర్లు తిప్పక్కర్లేదు. నీకు నేనేంటో తెలుసు, నాకు నువ్వేంటో తెలిసినప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? చేరాల్సిన వాళ్ళకి చేరింది కదా! ఏమంటావు?
     ఇంకా ఎంతో వ్రాయాలని ఉన్నా, నీకు చెప్పినవే, తెలిసినవే మళ్ళీ మళ్ళీ వ్రాస్తూ నిన్ను విసిగించాలని ఉన్నా, నీ బుంగ మూతి చూసి జాలి వేసి ఈ సారికి ఇలా వదిలేస్తున్నా.. జవాబు  వ్రాస్తావుగా?!

      నిన్ను చేరే రోజు కోసం ఎదురుచూస్తూ.. నీ జ్ఞాపకాల అలలపై తేలియాడుతూ.. 
                                                                                     ప్రేమతో.,
                                                                                     నీ నేను.
 ( మొదలు లేదేమో కానీ చివర ఉంది.. చూసావా ;) )
   

Sunday, January 13, 2013

శుభాకాంక్షలు



 ఆకాశంలో హరివిల్లుని వంచి
వర్ణాలన్నీ నేలకి దించి
పూలలోని తేనెలతో రంగరించి
తుమ్మెద రెక్కలతో చిలకరిస్తా..,
అవి రంగులు మాత్రమే కాదు నేస్తం
మనసులోని చీకట్లను పారదోలే
వెలుగుల రేఖలు.,
ఆశల అలలు,
సరిగమల సరాగాలు.,
చిరునవ్వుల సంబరాలు.,
కేరింతల సంక్రాంతులు..!


ఈ సంక్రాంతి అందరికీ సంతోషాల సన్నాయి సరాగాలు కావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ., బ్లాగు మిత్రులకు, పెద్దలకు, అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
.