నా రేయి నీ కలలతో ఆరంభం అవుతుంది.. నా వేకువ నీ తలపుల రేఖలతో విచ్చుకుంటుంది. అందుకనో మరేమో గానీ నా ప్రతి రోజూ కొత్తగానే ఉంటోంది. రోజు మొదలు ఎన్ని రకాలుగా సతాయిస్తావో తెలుసా?!
జనాల్లోకి వెళ్తాను, నువ్వు గుర్తొస్తావు. ఇక చూడు, నేనక్కడ ఒంటరిగా మిగిలిపోతాను. ఎక్కడికో దూరంగా వెళ్తూ ఉంటాను., నీ జ్ఞాపకాల పరిమళాలు ఆ గాలిలో కలిసి నాతో పాటూ సాగిపోతూ ఉంటాయి. ఎంత దూరంగా నే వెళ్తే అంత దగ్గరగా వస్తూ ఉంటావు. ఆ వెళ్ళే దారుల్లో విరిసే ప్రతి పువ్వూ నీ నవ్వే చిందిస్తూ ఉంటుంది. ఏ దిక్కున చూసినా నవ్వే నీ రూపమే కవ్విస్తూ ఉంటుంది.
కాసింత అలిసి, రెప్ప మూసుకుంటుందా., ఎదురుగా వస్తావు. ఇక చిలిపి ఊహ ఆగుతుందా? అలసట తీరే దారే నువ్వు కదా మరి. ఇక ఆ ఊహ అలుపే ఎరుగదు.
వాకిలిలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతుంటానా? దారి కాచి మరీ నువ్వెక్కడ అని అడుగుతుంది ఆ వెన్నెల పిల్ల. నువ్వుంటేనే ఇంత వేడిగా ఉంది, ఇక తను కూడా తోడైతే అని అనుకుంటాను కానీ, చిన్నబుచ్చుకుంటుందని తనతో అనను. ఒక నవ్వు మాత్రం పెదవులపై నిలుస్తుంది. ఆ మాత్రానికే నీలాగే తను కూడా అలిగి కూర్చుంటుంది. దీనికి తోడు నేను నీతో పదే పదే పాడించుకునే ఆ పాట నా చెవుల్లో మ్రోగుతూ ఉంటుంది., మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే అంటూ...
నిజం చెప్పొద్దూ! అలిగినప్పుడు నువ్వేం చేస్తావో., పైకి మాత్రం బుంగ మూతి పెట్టుకుని, ఇక నిన్ను తలవనే తలవను కల్లో కూడా అని అంటూనే, అలా అలా ఇంకా ఇంకా నా గురించిన ఆలోచనల్లో పడిపోతూ, నా ప్రేమలోనే మునకలేస్తూ ఉంటావు. నాకు తెలియనే తెలియదని అనుకుంటూ ఉంటావు. ఎంత పిచ్చిదానివో కదూ! ఐనా ఆ పిచ్చి అంటే నాకు బోలెడంత ఇష్టంలే.
ఎప్పుడొస్తావో అనుకుంటూ, నీ రాక కోసం చూస్తూ చూస్తూ, నిన్ను చూసే వరకు, జాబిల్లి కోసం ఆకాశమల్లే అని మనసు పాడుకుంటూ ఉంటుందా, ఈ ఎదురు చూపుల బాధ నా ఒక్కడిదే కదా అనుకుంటూ చుట్టూ చూస్తే, నాతో పాటూ పూలు-గాలీ, చెట్టూ-పిట్టా. కొమ్మా-రెమ్మా అన్నీ ఆ దారి వైపే.
ఎప్పుడొస్తావో ఏమో, చిలిపితనం అంతా ఆ కళ్ళల్లో, కొంటెతనం అంతా ఆ పెదవుల్లో నింపేసి నవ్వుతూ చూస్తుంటే., ఇక ఉడుక్కోవడం నా వంతవుతుంది.
అప్పటి వరకూ నాకు తోడుగా ఉన్నవన్నీ నీ రాకతో నీ అల్లరికి తోడవుతాయి.
తిరిగి నన్ను బుజ్జగించడానికి చేసే నీ ప్రయత్నాలు చూసి ఈ సారి చిన్నబోవడం వాటి వంతు.
"అలకలో అమ్మాయిలు అందంగా ఒదిగిపోతారని అందరి అభిప్రాయం.. కానీ అబ్బాయిలు అలిగితే ఇంతందంగా ఉండడం నువ్వెప్పుడైనా చూసావా" అని కిలకిలా నవ్వుతుంటే. ఏమని చెప్పను ఆ అందమైన అనుభూతిని. అసలు నేనలిగేదే ఈ ఒక్క నవ్వు కోసమే అని నీకు తెలుసా?
నీ చిరు చిరు నవ్వుల్లోనే నా చిన్ని చిన్ని ఆనందాలు కలబోసి ఉంటాయని, నీ కాలి అందెల సవ్వడిలో నా గుండె లయలు దాగున్నాయని, నీ కాటుక కన్నుల చూపుల్లో నా రేపటి ఆశలు తొంగి చూస్తూ ఉంటాయని, చీకటిలో కూడా నీ నీడ నీకు కనిపిస్తూ ఉంటే, అది నీవు కాదు సుమా! నీలో కలిసిపోయిన నేనే అని తెలుసా?
ఎందుకింత ప్రేమని నువ్వడిగితే.,
తన పెదవులపైన మధువులన్నీ ఆ తుమ్మెద కోసమే అనే ఆ పూల కన్నియను ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
అణువణువునా తననే పెనవేసుకుని, తన హృదయంలోనే తలదాచుకునే పచ్చని తీవెలంటే ఆ తరువుకి ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
ఆ తీరాన్ని తాకాలని ఎగిసే అలల ఆరాటానికి ఎందుకంత తపన అంటే ఏమని చెప్పగలదు?
ఎన్నెన్నో హొయలు పోతూ, అంతెత్తునుంచి అమాంతం దూకే ఆ సెలయేరుని చేతులు చాచి అక్కున చేర్చుకునే ఆ పుడమి తల్లిని ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
వీటి లాగే నా జవాబు కూడా మౌనమేనేమో.. ఒక్కటి మాత్రం నిజం. బహుశా! ఇదే జన్మ పదే పదే కావాలనుకుంటా., నీ ప్రేమలో నన్ను చూసుకోవడం కోసం..!
ఏమిటి అలా చూస్తున్నావు చిత్రంగా? ఏం వెతుకుతున్నావ్ అసలు? నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? " అబ్బా! ఇది ఉత్తరమా? మొదలూ లేదు, చివరా లేదు.. అసలు ఒక పలకరింపు లేదు, ఏం లేదు.. ఇది నాకు వ్రాసిందేనా? పేద్ద వ్రాసాడులే" అని మూతి మూడు వంకర్లు తిప్పక్కర్లేదు. నీకు నేనేంటో తెలుసు, నాకు నువ్వేంటో తెలిసినప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? చేరాల్సిన వాళ్ళకి చేరింది కదా! ఏమంటావు?
ఇంకా ఎంతో వ్రాయాలని ఉన్నా, నీకు చెప్పినవే, తెలిసినవే మళ్ళీ మళ్ళీ వ్రాస్తూ నిన్ను విసిగించాలని ఉన్నా, నీ బుంగ మూతి చూసి జాలి వేసి ఈ సారికి ఇలా వదిలేస్తున్నా.. జవాబు వ్రాస్తావుగా?!
నిన్ను చేరే రోజు కోసం ఎదురుచూస్తూ.. నీ జ్ఞాపకాల అలలపై తేలియాడుతూ..
ప్రేమతో.,
నీ నేను.
( మొదలు లేదేమో కానీ చివర ఉంది.. చూసావా ;) )
bale vrashare bagundi
ReplyDeleteమీ ఉత్తరం భలే ఉందండి. మొదలు కూడా ఆ చివరలోనే ఉందిగా:)
ReplyDeleteమనసు పుటలు బాగున్నాయి
ReplyDeleteవీటి లాగే నా జవాబు కూడా మౌనమేనేమో.. ఒక్కటి మాత్రం నిజం. బహుశా! ఇదే జన్మ పదే పదే కావాలనుకుంటా., నీ ప్రేమలో నన్ను చూసుకోవడం కోసం..! <<< wt a nice naration,heart touching subha
ReplyDeleteVery nice !!
ReplyDelete@ ♛ ప్రిన్స్ ♛
ReplyDeleteప్రిన్స్ మీ స్పందనకి ధన్యవాదాలండీ..
@ జయ
జయ గారూ భలే చెప్పారండీ :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.
@ Padmarpita
ధన్యవాదాలు పద్మ గారూ..
@ శశి కళ
మీకంతలా నచ్చినందుకు బోలెడు థాంకులు శశి గారూ..
@ వనజవనమాలి
వనజ గారూ ధన్యవాదాలండీ..
అసలు ప్రేమ అభిమానం ఎందుకు పుడతాయో! పుడమికి గంగను అక్కున చేర్చుకునే ప్రేమ ఎందుకు పుట్టిందో!! చెప్పలేం!!! అదంతే విష్ణు మాయ.
ReplyDeleteమనసున మల్లెల మాలలూగెనే...అంటూ మనసు పుటల్లో దాగిన భావాల్ని ప్రేమలేఖలో పెడుతూ, చక్కని బొమ్మతో చాలా రోజులకి మీ రాక.
ReplyDeleteబొమ్మలో సింపుల్ గా గీతల్లోనే చాలా భావాలు చూపించారు.
అసలు మొదలూ, చివరా లేనిదే నిజమైన ప్రేమలేఖ!
...నిన్ను చేరే రోజు కోసం ఎదురుచూస్తూ..నీ జ్ఞాపకాల అలలపై తేలియాడుతూ...ఇలా ముగింపు లేదంటూనే చాలా అందమైన ముగింపు ఇచ్చారు.
అవునూ మా తదుపరి ప్రేమావరి పోస్ట్ హెడింగ్ మీకు గాని లీక్ అవలేదు కదా ;)
మనసే పాడినది
ReplyDeleteమరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది :-)
బాగుందమ్మాయ్ గారు :)
@ kastephale
ReplyDeleteతాత గారూ అంతే అంటారా? అంతా విష్ణు మాయ:)
@ చిన్ని ఆశ
పండు గారూ మా చెల్లి అంటూనే ఉంది సుమండీ.. మీరిలా అంటారని. నేనేం లీక్ చేయలేదు కానీ ఇప్పుడు మీరే లీక్ చేసేసారు చూసారా.. ఇప్పుడు నాకు తెలిసిపోయిందిగా టైటిల్ ఏమిటో :)
@ యమ్.ఎల్.ఏ
ధన్యవాదాలు అబ్బాయ్ గారూ.. ఎం.ఎల్.ఏ నా? మీ ప్రొఫైల్ పేరు బాగుందండీ.. ఇంతకీ ఏ నియోజకవర్గానికో అని చూస్తే ఎక్కడా దొరకలేదు :)
అమ్మో, నేను ఎ నియోజకవర్గానికి MLA నో, ఎ పార్టీ తరపున ఎన్నికయ్యానో చెపితే నన్ను మీ బ్లాగ్ వరల్డ్ లో ఉండనిస్తారా? నాకు స్వేచ్చ కావాలి. అందుకే నే చెప్ప. మీ బ్లాగ్, మీ పాటల సాహిత్యం, మీ గాత్రం బాగుంది. సరే, సరే అమ్మీ, టైం అయ్యింది, ఈవాళ అసెంబ్లీ లో బల్ల మీదకు ఎక్కి గోల చేయమని పార్టీ ఆదేశించింది, మల్ల వచ్చి కలుస్తా.
ReplyDeletechaala bagundi andi
ReplyDeleteTeja gaaruu thank you so much
Deleteబావుంది సుభ గారు . ఈ మధ్య అసలు మీ బ్లాగ్ చూడటం లేదు . అందుకే మిమ్మల్ని విష్ చేయలేకపొయాను. బాగున్నారా?
ReplyDeleteవనజ గారూ నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నాకు కూడా ఈ మధ్య బ్లాగులు వైపు వచ్చేటంత ఖాళీ ఉండటం లేదు. గుర్తు పెట్టుకుని మరీ వచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
Deleteandamaina bhaavaalato chaala bagundi andi
ReplyDelete