Search This Blog

Sunday, March 3, 2013

మనసు పుటల్లో..,

    
     
 నా రేయి నీ కలలతో ఆరంభం అవుతుంది.. నా వేకువ నీ తలపుల రేఖలతో విచ్చుకుంటుంది. అందుకనో మరేమో గానీ నా ప్రతి రోజూ కొత్తగానే ఉంటోంది. రోజు మొదలు ఎన్ని రకాలుగా సతాయిస్తావో తెలుసా?!
     జనాల్లోకి వెళ్తాను, నువ్వు గుర్తొస్తావు. ఇక చూడు, నేనక్కడ ఒంటరిగా మిగిలిపోతాను. ఎక్కడికో దూరంగా వెళ్తూ ఉంటాను., నీ జ్ఞాపకాల పరిమళాలు ఆ గాలిలో కలిసి నాతో పాటూ సాగిపోతూ ఉంటాయి. ఎంత దూరంగా నే వెళ్తే అంత దగ్గరగా వస్తూ ఉంటావు. ఆ వెళ్ళే దారుల్లో విరిసే ప్రతి పువ్వూ నీ నవ్వే చిందిస్తూ ఉంటుంది. ఏ దిక్కున చూసినా నవ్వే నీ రూపమే కవ్విస్తూ ఉంటుంది.
కాసింత అలిసి, రెప్ప మూసుకుంటుందా., ఎదురుగా వస్తావు. ఇక చిలిపి ఊహ ఆగుతుందా? అలసట తీరే దారే నువ్వు కదా మరి. ఇక ఆ ఊహ అలుపే ఎరుగదు.
       వాకిలిలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతుంటానా? దారి కాచి మరీ నువ్వెక్కడ అని అడుగుతుంది ఆ వెన్నెల పిల్ల. నువ్వుంటేనే ఇంత వేడిగా ఉంది, ఇక తను కూడా తోడైతే అని అనుకుంటాను కానీ, చిన్నబుచ్చుకుంటుందని తనతో అనను. ఒక నవ్వు మాత్రం పెదవులపై నిలుస్తుంది. ఆ మాత్రానికే నీలాగే తను కూడా అలిగి కూర్చుంటుంది. దీనికి తోడు నేను నీతో పదే పదే పాడించుకునే ఆ పాట నా చెవుల్లో మ్రోగుతూ ఉంటుంది., మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే అంటూ...
       నిజం చెప్పొద్దూ! అలిగినప్పుడు నువ్వేం చేస్తావో., పైకి మాత్రం బుంగ మూతి పెట్టుకుని, ఇక నిన్ను తలవనే తలవను కల్లో కూడా అని అంటూనే, అలా అలా ఇంకా ఇంకా నా గురించిన ఆలోచనల్లో పడిపోతూ, నా ప్రేమలోనే మునకలేస్తూ ఉంటావు. నాకు తెలియనే తెలియదని అనుకుంటూ ఉంటావు. ఎంత పిచ్చిదానివో కదూ! ఐనా ఆ పిచ్చి అంటే నాకు బోలెడంత ఇష్టంలే.
      ఎప్పుడొస్తావో అనుకుంటూ, నీ రాక కోసం చూస్తూ చూస్తూ, నిన్ను చూసే వరకు, జాబిల్లి కోసం ఆకాశమల్లే అని మనసు పాడుకుంటూ ఉంటుందా, ఈ ఎదురు చూపుల బాధ నా ఒక్కడిదే కదా అనుకుంటూ చుట్టూ చూస్తే, నాతో పాటూ పూలు-గాలీ, చెట్టూ-పిట్టా. కొమ్మా-రెమ్మా అన్నీ ఆ దారి వైపే.
ఎప్పుడొస్తావో ఏమో, చిలిపితనం అంతా ఆ కళ్ళల్లో, కొంటెతనం అంతా ఆ పెదవుల్లో నింపేసి నవ్వుతూ చూస్తుంటే., ఇక ఉడుక్కోవడం నా వంతవుతుంది.
అప్పటి వరకూ నాకు తోడుగా ఉన్నవన్నీ నీ రాకతో నీ అల్లరికి తోడవుతాయి.
తిరిగి నన్ను బుజ్జగించడానికి చేసే నీ ప్రయత్నాలు చూసి ఈ సారి చిన్నబోవడం వాటి వంతు.
       "అలకలో అమ్మాయిలు అందంగా ఒదిగిపోతారని అందరి అభిప్రాయం.. కానీ అబ్బాయిలు అలిగితే ఇంతందంగా ఉండడం నువ్వెప్పుడైనా చూసావా" అని కిలకిలా నవ్వుతుంటే. ఏమని చెప్పను ఆ అందమైన అనుభూతిని. అసలు నేనలిగేదే ఈ ఒక్క నవ్వు కోసమే అని నీకు తెలుసా?
      నీ చిరు చిరు నవ్వుల్లోనే నా చిన్ని చిన్ని ఆనందాలు కలబోసి ఉంటాయని, నీ కాలి అందెల సవ్వడిలో నా గుండె లయలు దాగున్నాయని, నీ కాటుక కన్నుల చూపుల్లో నా రేపటి ఆశలు తొంగి చూస్తూ ఉంటాయని, చీకటిలో కూడా నీ నీడ నీకు కనిపిస్తూ ఉంటే, అది నీవు కాదు సుమా! నీలో కలిసిపోయిన నేనే అని తెలుసా? 
        ఎందుకింత ప్రేమని నువ్వడిగితే.,
తన పెదవులపైన మధువులన్నీ ఆ తుమ్మెద కోసమే అనే ఆ పూల కన్నియను ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
అణువణు
వునా తననే పెనవేసుకుని, తన హృదయంలోనే తలదాచుకునే పచ్చని తీవెలంటే ఆ తరువుకి ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
ఆ తీరాన్ని తాకాలని ఎగిసే అలల ఆరాటానికి ఎందుకంత తపన అంటే ఏమని చెప్పగలదు?
ఎన్నెన్నో హొయలు పోతూ, అంతెత్తునుంచి అమాంతం దూకే ఆ సెలయేరుని చేతులు చాచి అక్కున చేర్చుకునే ఆ పుడమి తల్లిని ఎందుకింత ప్రేమంటే ఏమని చెప్పగలదు?
      వీటి లాగే నా జవాబు కూడా మౌనమేనేమో.. ఒక్కటి మాత్రం నిజం. బహుశా! ఇదే జన్మ పదే పదే కావాలనుకుంటా., నీ ప్రేమలో నన్ను చూసుకోవడం కోసం..! 
      ఏమిటి అలా చూస్తున్నావు చిత్రంగా? ఏం వెతుకుతున్నావ్ అసలు? నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? " అబ్బా! ఇది ఉత్తరమా? మొదలూ లేదు, చివరా లేదు.. అసలు ఒక పలకరింపు లేదు, ఏం లేదు.. ఇది నాకు వ్రాసిందేనా? పేద్ద వ్రాసాడులే" అని మూతి మూడు వంకర్లు తిప్పక్కర్లేదు. నీకు నేనేంటో తెలుసు, నాకు నువ్వేంటో తెలిసినప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? చేరాల్సిన వాళ్ళకి చేరింది కదా! ఏమంటావు?
     ఇంకా ఎంతో వ్రాయాలని ఉన్నా, నీకు చెప్పినవే, తెలిసినవే మళ్ళీ మళ్ళీ వ్రాస్తూ నిన్ను విసిగించాలని ఉన్నా, నీ బుంగ మూతి చూసి జాలి వేసి ఈ సారికి ఇలా వదిలేస్తున్నా.. జవాబు  వ్రాస్తావుగా?!

      నిన్ను చేరే రోజు కోసం ఎదురుచూస్తూ.. నీ జ్ఞాపకాల అలలపై తేలియాడుతూ.. 
                                                                                     ప్రేమతో.,
                                                                                     నీ నేను.
 ( మొదలు లేదేమో కానీ చివర ఉంది.. చూసావా ;) )