Search This Blog

Thursday, January 5, 2012

అడగాలని ఉన్నా అడగలేను..!



తను అనుకుని ఉండదు నువ్విలా చేస్తావని..
నువ్వు లేకున్నా
బ్రతకడం నేర్చుకుంది ఎలాగో జీవఛ్ఛవంలా.,
నాకు బాధంటే ఏమిటో తెలియకుండా చేసింది
తను మాత్రం తీరని వేదనను అనుభవించింది
నాకు తనని అడగడం రాదు.,ఎందుకంటే..
బాధను భరిస్తూనే నాకు జన్మనిచ్చింది
గుండెలోని ఉప్పెనను గుప్పెటలో అదిమిపట్టి
పెదవుల్లో మాత్రం చెరగని చిరునవ్వు నింపుకుని
నాకు పూలబాట పరచిన జీవితాన్నిచ్చింది.,
ఊహ తెలియకముందు నాకు తెలియదు
తెలిసిన తర్వాత తెలిసింది నువ్వంటే ఏమిటో
లోకులు కాకులై అరుస్తుంటే.,
అదే సమయంలో నువ్వంటే
పెరిగిన ఏహ్యభావం చిగురులు తొడగటం మొదలుపెట్టింది..
నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం 
నేర్పించని తన వల్ల అది మొగ్గ వరకు కూడా ఎదగలేదు.,
నాకు నిన్ను అలా పిలవాలని ఎప్పుడూ అనిపించలేదు
ఏ మూలో ఇంకా నాలో ఆ చివురుల తాలూకు 
ఆనవాలు మిగిలిపోయుంటుంది..
నాకు జన్మనివ్వడంలో నీ ప్రాధాన్యత ఎంతో ఉంది
అందుకే ఆ ఛాయలు అప్పుడప్పుడూ నాలో 
నీకు గౌరవం ఇవ్వడంలో ప్రస్ఫుటమౌతుంటుంది..
నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వదిలిపెట్టి
నీ దారి నువ్వు చూసుకున్నప్పుడే 
అర్ధం అయింది నాకు, నీకు "నాన్న" అంటే అర్ధం తెలియదని 
నిన్ను అడగాలనే ఉంటుంది నాకు ఎందుకిలా చేసావు అని
కాని అది వ్యర్ధం అని తెలిసి
తిరిగి అమ్మలోనే నాన్నను నింపుకుంటున్నా..! 



ఏ తోడూ లేకున్నా,ఎవరి సహకారం లేకున్నా, లోకులు కాకులై పొడుస్తున్నా లెక్క చేయక తమ రెక్కల కష్టంతో తమ పిల్లల్ని పెంచి, పోషించి వాళ్ళని ఒక మంచి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే ఎంతో మంది  తల్లులకు ఇలా వందనాలు అర్పించుకుంటున్నాను...