Search This Blog

Thursday, August 4, 2011

ఫ్రెండ్ షిప్ డే

 అందరికీ  ఫ్రెండ్ షిప్ డే 'శుభా'కాంక్షలండీ

మొదటిసారి...

మొదటిసారి నీ దర్శనం
నిదురలేపెను నాలో పరవశం
మొదటిసారి నీ దరహాసం
మది వనికి మధుమాసం
మొదటిసారి నీ పలకరింపు
పన్నీరుల చిలకరింపు
మొదటిసారి నీ స్పర్శ
నాలో రేగిన ఊహలకు పరామర్శ..,
పుడమికి పండగ
తొలకరి వాన తనను ముద్దాడితే.,
ప్రకృతికి పరవశం
వసంతం తన ఒడి చేరితే.,
మరి నాకు సంబరం
తొలినాటి ఆ భావాలు పలకరిస్తుంటే,,!!

నీ లాలనలో...

బుగ్గలపై అద్దిన ముద్దుల కెంపులు
కన్నులలో విరిసిన వెన్నెల వెలుగులు.,
హత్తుకున్న ఆ వెచ్చని కౌగిళ్ళు
మనసున పూసిన మల్లెల పూలు.,
నీ ప్రతి స్పర్శ లోని ఏవో మైమరపులు
నా తనువున కురిసెను పులకింతల జల్లులు.,
నీపై నా మరులు.,
ఎన్నటికీ వాడని వరాల విరులు...
నాలో నీ మమతలు
నిదురించని యెదకు లాలి పాటలు ..!  

యవ్వనం...

చిగురించిన యవ్వనంలో
సొబగులద్దిన వర్ణాలెన్నో...
కనులు కన్న సంగతులన్నీ.,
మనసు వింటోందిపుడు నిశ్శబ్ధంగా...
జ్ణాపకాల మంచు తెరలలో.,
స్నేహాల సుమాలు, వలపుల వ్యథలు
విరబూసిన దరహాసాలు, కన్నీటి కలలు
ముసురుకున్న మబ్బులలో సైతం
వీడిపోని నీడలు !!!

నీ చెలిమి లో

రేపు మళ్ళీ ఈ రోజు లాగే ఉండొచ్చు.,
మనలో ఎవరెవరు ఎక్కడ ఉంటారో.,
ఎపుడో దాచిన పువ్వుకు
పుస్తకం చిరునామా ఐనట్టు.,
నీ చెలిమి లోని ఎడబాటుకు కూడా
బహుశా ఏదో చిరునామా ఉండే ఉంటుంది...
ఇక జీవితంలో నిన్ను కలవనీ, కలవకపోనీ
కానీ గడిపిన ప్రతిక్షణం గురుతే ఉంటుంది...
అందుకే ఇది సృష్టి లోనే మధురం
కరిగిపోని, చెరిగిపోని ఈ స్నేహం..!!