Search This Blog

Monday, October 31, 2011

కదిలే కాలంతో...

                                                నడిచే పాదాలకో గమ్యం లేదు
                                 చీకటి దారులకీ అంతం లేదు
                                 ఉరికే ఊహలకు అదుపు లేదు
                                  ఎదురుచూపులకు అలుపు రాదు
                                  కాలం కదులుతూనే ఉంది
                                  కదిలే కాలంతో కలలు కూడా .,
                                  ఊపిరిలో ఆశను నింపుకుని
                                   నేలపై వెలుగును పరుస్తున్నా .,
                                  ఆ వెలుగులలోనే పయనించాలని
                                       కాలం నేనై కదిలిపోతూ ...! 
 

Tuesday, October 25, 2011

శుభాకాంక్షలు...

 కాకరపువ్వొత్తుల కరచాలనాలు
మతాబుల ముచ్చట్లు
తారాజువ్వల సంబరాలు
చిచ్చుబుడ్డి చిరునవ్వులు
కలిసి తేవాలి ప్రతి ముంగిలిలో
వెల లేని ఆనందాలు ! !


అందరికీ దీపావళి శుభాకాంక్షలు...

Monday, October 24, 2011

ప్రకృతినై..

 పువ్వులలోని తేనెలను
తుమ్మెదనై దోచుకుంటా
లేలేత సోయగాల తీవెలకు మల్లే
పచ్చని కొమ్మలని పెనవేసుకుంటా
తారలలోని మెరుపులను
చెంపలపై అద్దుకుంటా
నీలాల నింగిలోని మబ్బులలో చేరి
జల్లులుగా మారి పుడమిని ముద్దాడుతా
విహంగమై వినువీధుల కెగిరి
విహారాలు చుట్టొస్తా
హరివిల్లుని నేలకి వంచి
ఆకాశానికి నిచ్చెనలు వేస్తా
సృష్టిలోని అందాలన్నీ కన్నులలో నింపుకుని
ప్రకృతినై చివురిస్తూనే ఉంటా
ప్రతి వనికీ పరిమళాలు ఇస్తా
ప్రతి మదికీ వసంతాన్ని తెస్తా ! !

Friday, October 21, 2011

శివోహం

కైలాసం చాలా ప్రశాంతంగా ఉంది. ధవళ కాంతులతో మెరిసిపోతోంది. ఎక్కడ చూసినా శోభాయమానమే. పరమేశ్వరుడు దీక్షలో ఉన్నాడు.

"స్వామీ..స్వామీ.." నంది పరుగెత్తుకుంటూ వచ్చాడు.

"ఏమిటి నందీ అలా పరుగెత్తుకొస్తన్నావు ? ఏమైంది ? " హడావిడికి కళ్ళు తెరిచి కంగారుగా అడిగాడు పరమేశ్వరుడు.

"స్వామీ... అదీ.. అదీ.." ఆయాసం ముంచుకొచ్చి తర్వాత మాట్లాడలేకపోతున్నాడు నంది.

పరిస్థితిని గమనించి శంకరుడు " ముందు కాస్తంత అలా కూర్చొవయ్య. కాస్తంత స్తిమితపడు. అలా కూర్చో" అని రాయి చూపించాడు (కైలాసంలో కుర్చీలు ఉంటాయంటారా ?).

నంది కాస్త స్థిమితపడి తర్వాత మొదలుపెట్టాడు.

"స్వామీ ! మిమ్మల్ని ఆది దంపతులు, ఆదర్శ దంపతులు అని తెగ పూజిస్తారు కదా స్వామీ ?" అని అడిగాడు నంది.

" అందులో ఏమి సందేహం వృషభా?" కించిత్ గర్వంతో అన్నాడు శివుడు.

"మరి మీరేంటి స్వామీ యెప్పుడు చూసినా గొడవలే ? " అన్నాడు నంది చిరాగ్గా మొహం పెట్టి.

ఆ మాటకి కొంచెం కలవరపడ్డాడు పరమేశుడు. " అదేమిటి నాయనా అలా అనేసావు? గొడవలేమిటి? ఇప్పుడేమైంది ?"

"ఇంకా ఏమైందని నెమ్మదిగా అడుగుతారేంటి స్వామీ? అవతల కొంపలు అంటుకుపోతుంటేనూ" కంగారుగా అన్నాడు నంది.

"నువ్వెందుకు నాయనా అంత కంగారు పదతావు? ఫైర్ ఇంజిన్ వాళ్ళకి మన బంటు చేత కబురు పంపించకపోయావా? వాళ్ళే వచ్చి చూసుకొనేవారు. ఐనా మనకి కాదు కదా నాయనా ముప్పు." తాపీగా అన్నాడు శివుడు.

ఆ మాటకి మండుకొచ్చింది నందికి. ఐనా తమాయించుకొని " మరదే.. ఎక్కడో తగలబడితే మీ దగ్గరికి ఎందుకొస్తాను స్వామీ? ఆ అంటుకున్న కొంపలు మన కైలాసంలోనే మహాప్రభూ? " అన్నాడు.

చిద్విలాసం చేసాడు శంభుడు.

"నాయనా నందీ ఏం మాట్లాడుతున్నావు? మనకి కొంపలు ఎక్కడివి? ఇలా కొండలూ,కోనలూ తప్ప. నువ్వేదో పొరబడుతున్నావు. అసలు మా ముగ్గురికీ, అదేనయ్యా బ్రహ్మకీ, విష్ణుకీ, నాకూ కొంపలే లేవు. ఇలాంటి ప్రోబ్లంస్ వస్తాయనే ప్లాన్ ప్రకారం ప్లేస్ లు ఎంచుకున్నాం. నేను కైలాసం, బ్రహ్మ గాలి లేని చోట, విష్ణువు నీళ్ళలోను" అని శివుడు చెబుతుంటే మధ్యలో నంది గుబుక్కున అందుకుని " నారాయణుడు నీళ్ళలో కాదండి పాలలో" అన్నాడు.

ఆ వెంటనే శివుడు " ఆ ఏదో ఒకటి లేవోయ్. రెండూ ద్రవములే కదా ! సరేలే కాని నువ్వు ఏ బాంబ్ బ్లాస్టింగో చూసుంటావు. మన కైలాసం పక్కనే కదా. అందుకని పొరపాటు పడుతున్నావు." చాలా ప్రశాంత వదనంతో అన్నాడు శివుడు.

ఈ సారి నందికి అరికాలి మంట నెత్తికెక్కింది. మనసులో అనుకుంటున్నాడు కోపంగా "నీళ్ళున్న చోటల్లా (అదే ద్రవం ఉన్న చోటల్లా) నాటు సారా పోసేస్తే తిక్క అణిగిపోద్ది" అని అనుకుంటున్నవాడల్లా ఈ సారి పైకే అనేసాడు. " ఏంటి ఇందాకట్నుంచీ అసలు విషయమేంటో చెప్పనివ్వకుండా మీరే మాట్లాడేస్తున్నారు? అంటే నేను చెప్పేది వినరా? మరందుకే విషయం తెలుసుకోకుండా ఏదొ ఒకటి అనేస్తారు.. దెబ్బతో గొడవలొచ్చేస్తాయి మీ ఇద్దరికీను. ఊరికే వస్తాయేంటి? ఇంక అక్కడ్నుంచి ఆ అమ్మ అటు, తమరు ఇటు,ఇంకో అవతారం . ఎందుకొచ్చిన తంటాలంట ఇవన్నీను? ఏమిటో మంచోడివో తెలీదు,వెర్రొడివో తెలీదు. కుళ్ళుజోకులెస్తున్నావ్ తీరిగ్గా కూర్చుని, ఐనా నన్ననుకోవాలి ..." అని ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని నందిని మధ్యలోనే ఆపి శివుడు " సరేలేవయ్యా.. అంత కోపమేంటి? ఇంతకీ విషయం యెంటో చెప్పవయ్య బాబూ?" అన్నడు పరమేశుడు శాంతంగానే ( నంది అంత అన్నా కూడా). నందికే ఇంకా కోపం తగ్గలేదు. ఆ కోపం మీద " ఇందాక ఆ కాకి గాడొచ్చాడు" అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి.

" కాకిగాడెవరయ్యా ? " అడిగాడు పరమేశుడు అయోమయంగా.

"అబ్బా ! (బ్రహ్మనందం టైపులో) కాకిగాడంటే తెలీదంట. ఇంకెవడు..ఆడే..తంటాకోరు నారదుడు" అన్నాడు నారదుడి మీద ఉన్న కోపంతో..

"అయ్యయ్యో ! నెమ్మదయ్యా .. నెమ్మది.. గోడలకి చెవులుంటాయ్" అన్నాడు వెంటనె శివుడు పక్కలకు చూస్తూ.

" కొంప ఒకటి లేదు కానీ. గోడ ఎక్కడ నుంచి వచ్చింది స్వామీ మళ్ళీను..వెళ్ళు స్వామీ జోకులేసావు గానీ " అన్నాడు నంది, ఇది వరకు పీకిన క్లాసు గుర్తుకువచ్చి మండుకొస్తుంటే.

" సరే కానీ ఇప్పుడెందుకొచ్చాడయ్యా ! నారదుడు" అడిగాడు శివుడు.

"ఏం పనుంది ? తినేసి అరక్క తిరుగుతున్నాడు. పోని తిరిగేవాడు ఊర్కుని ఉంటాడా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక లింకు పెట్టేస్తాడు. ఇదిగో ఈ రోజు ఇక్కడ.. కుదురుగా కూర్చుని హంసలతో ఆడుకుంటున్నదాన్ని పలుకరించి బాగా ఎక్కించాడు. ఇంకేముంది? ఆ అమ్మ అపర కాళిలా ఐయింది. ఏ టైములో ఏమవుద్దో అని నేనిక్కడికి ముందే వచ్చి విషయం చెప్దామనుకుంటే తమరేమో తీరిగ్గా కుర్చుని జొకులేస్తున్నారు మరి. నేనేం చేయను, అనుభవించాలని ఆ బ్రహ్మ దేవుడు ఓ బరికేత్తుంటె తమరేం చేస్తారులే ఐనా.." అని ఇంక ఏదో అనబోయేంతలో కైలాసం ఒక్కసారిగా కంపించింది. పరమేశుడితో సహా అంతా తూలిపడబోయి తమాయించుకున్నారు.

నందికి విషయం అర్ధమయ్యి , " మహాప్రభో ! ఇక నేను వస్తాను. ఇక్కడ గాని అమ్మ నన్ను చూసిందంటే నేనేదో మీకు మోసేసానని అపార్ధం చేస్కుని నన్ను చూపుల్తో భస్మం చేసినా చేస్తుంది. దెబ్బకి నా సీన్ ఐపోద్ది. ఇంక ఆ తర్వాత మీకు కబుర్లు కూడా తెచ్చె వాళ్ళెవ్వళ్ళు ఉండరు. ఇంక మిమ్మల్ని ఆ దేవుడే సారీ మీరే రక్షించుకోవాలి." అని నంది పరుగందుకున్నాడు శివుడు ఆపుతున్నా ఆగకుండా.

ఇంక ఏం చేయాలో అర్ధం కాక ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చుని దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నారదుడు ఏం లింకు పెట్టాడు ? ఉమాదేవి ఎందుకు కోపంగా ఉంది? అని యెంత ఆలోచిస్తున్నా తట్టడం లేదు. మహా టెన్షన్ గా ఉంది మహాదేవుడికి. ఐనా రాని చిరునవ్వుని పెదవుల మీదికి తెచ్చుకున్నాడు. ఐనా ఆ మొహం చూస్తుంటే ఏడుపు మొహం లాగే కనిపిస్తుందనుకోండి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగం లాగా అనిపిస్తున్నాయి శంకరుడికి.

" నాథా ! " ముల్లోకాలు కంపించాయి ఆ పర్వతుడి పుత్రిక పార్వతీ దేవి పిలుపుకి. ఓ రెండు, మూడు సార్లు పిలిచిన తరువాత తెరుద్దామనుకున్న పరమేశుడి కళ్ళు ఆ ఒక్క పిలుపుకే తన ప్రమేయం లేకుండానే తెరుచుకున్నాయి. అక్కడ్నుంచి పడబోయాడు. కొండని గట్టిగా పట్టుకుని తమాయించుకుని కూర్చున్నాడు. ( అసలే టెన్షను..అందులోనూ ఆడవాళ్ళ వ్యవహారం ) . మంచు కొండల్లో కూడా చెమటలు విపరీతంగా పట్టేస్తున్నాయ్. ముందున్న దృశ్యం చూసేసరికి మరీను. " ఏమిటి దేవీ ? " అన్నాననుకున్నాడు కానీ అనలేదు . ఎక్కడా, గొంతులో నుండి మాటలు ఊడిపడట్లేందే..

"నాథా ! " వినిపించడం లేదా.. నేనిక్కడ పిలుస్తుంటే మీరేంటి ఆలోచిస్తున్నారు? " అడిగింది ఉమా దేవి రౌద్ర రసం ఉట్టిపడుతుండగా.

ఈశ్వరుడు మనసులో  " అవి పిలుపులా కాదు ఉరుములు" అని అనుకుంటుండగా

" మిమ్మల్నే మాట్లాడరేంటి? " రెట్టించింది దేవి.

ఈ సారి ఎట్లాగైతే ధైర్యం తెచ్చుకుని " ఏమిటి దేవీ ? " అన్నాడు నెమ్మదిగా.

"ఏం నోట్లో ఏం పెట్టుకున్నారు ? అంత నెమ్మదిగా వస్తోంది గొంతు ? " హేళనగా అంది పర్వత పుత్రి.

" అహ ! ఏం లేదు ఉమా !" తడబడిపోయాడు శివుడు. " సరే కాని రాజీ (రాజేశ్వరీ ని ముద్దుగా అలా అన్నాడన్నమాట ) అసలు విషయం ఏమిటీ? అలా ఉన్నావేం? ఏం జరిగింది? " ఇక మళ్ళీ మాటలు వస్తాయో , రావో అని త్వర త్వరగా ఒక్కసారే అడిగేసాడు ప్రశ్నలన్నీ..

మండుకొచ్చింది పార్వతికి.. " అసలు ఏమనుకుంటున్నారు మీరు? " అని అడిగింది మొహం చిరాగ్గా పెట్టి.

ఈశ్వరునికి అర్ధం కాలేదు , ఏమన్నా తప్పుగా మాట్లాడానేమో అనుకుని " ఏమిటి దేవీ? " అన్నాడు అయోమయంగా.

" ఒకసారి ఉమ, ఇంకోసారి రాజీ, ఒక్కోసారి మీనా ఇలా మీ ఇష్టం వచ్చినట్లు పిలుస్తారు, మాకు ఇష్టా-అయిష్టాలు ఉండవనా మీ ఉద్దేశ్యం. ఏం చక్కగా దేవదాసు పిలిచినట్లు పారూ అని పిలవచ్చుగా.." అంది కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా.

"ఖర్మ ! ఏమని పిలిచినా తంటానే కదా ఈ మగువలతో " అనుకుంటూ ఒక సందేహం వచ్చినవాడిలా " దేవీ" అన్నాదు.

"ఏమిటి" అంది విసురుగా చూస్తూ.

ఆ చూపుల్లోకి చూడలేక తల కిందకి దించుకొని " అహ! ఏం లేదు దేవీ.. ఈ దేవదాసు ఎవరా అని.." అన్నాడు నీళ్ళు నములుతూ..

"ఛీ..ఛీ.. మీ మగవారి బుద్ది పోనిచ్చుకున్నారు కాదు..ఎప్పుడూ మమ్మల్ని అనుమానించటం తప్ప ఇంకోటి రాదు. ఛీ..ఛీ.. వెధవ బుద్ధి " కయ్యిమంది పార్వతి.

"అహ ! అది కాదు పారూ" అని శివుడు ఏదో అంటుండగా మధ్యలో పార్వతి " మీ బుద్ధి ఎల ఉంటే నాకెందుకు గాని మనం తక్షణమే భూలోకం వెళ్ళాలి." అంది.

"భూలోకమా? " వణికిపోయాడు పరమేశుడు. ఆ మాట శరాఘాతంలా తగిలి విలవిల్లడిపోయాడు. అసలే ఏమి అడుగుతుందో అని భయపడిపోతున్న శివుడు కొయ్యబారిపోయాడు.

ఇదంతా పక్క నుంచి నక్కి నక్కి చూస్తున్న నంది చంకలు గుద్దుకుంటూ ఎగురుతున్నాడు. " భలే..భలే.. ఇందాకట్నుంచి ఓ జోకులు మీద జోకులు వేసేస్తున్నావ్ కదా ! ఇప్పుడు వెయ్యి.. హు.. భూలోకమంట.. వెళ్ళు, స్వర్గమో, నరకమో.. గోవిందా..గోవిందా.." అని అనుకుంటూ నవ్వలేక నవ్వలేక నవ్వుతున్నాడు.

" పా..పా..పా..పారూ ! భు..భు..భూలోకం ఎందుకు?" ఎలాగో మాటలు కూడదీస్కుని అడిగాడు పరమేశుడు. కుడితిలో పడ్డ ఎలుకలా ఐపోయిందే నా పరిస్థితీ అనుకుంటున్నాడు మనసులో.

"ఎందుకేమిటి ? నేను షాపింగ్ చేస్కోవాలి." అంది పార్వతి ధీమాగా.

" షాపింగా ! షాపింగేమిటి దే..పారూ (దేవి అనబోయి తమాయించుకొని ) అదేదో ఇక్కడే చేసుకోరాదూ.. పారూ ! బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. నువ్వేది కావాలన్నా ఇస్తాను. అంతేగానీ భూలోకం వెళ్దామని మాత్రం అనకు పారూ ప్లీజ్" బ్రతిమాలాడాడు శంకరుడు.

" హు.. ఇక్కడేముంది చేస్కోవడానికి బూడిద..చుట్టూ మంచు, అక్కడక్కడ నీళ్ళు, చెట్లు.. ఇంతే కదా ! అదేం కుదరదు. మనం భూలోకం వెళ్ళాల్సిందే. షాపింగు చెయ్యవలిసిందే." అంది ఖచ్చితంగా పార్వతి.

బుర్ర గోక్కున్నాడు ఈశుడు. " నారదా మంచి తంటానే తెచ్చావు కదయ్యా..ఇంతకి షాపింగుకి ఎందుకు చెప్మా. నేను అడగనే లేదు కదా" అని అనుకుని, "పారూ ! షాపింగు చేయవల్సిన అవసరం ఏమొచ్చిందోయ్" అడిగాడు నొసలు ముడిచి.

"ఎందుకేమిటి? " అంత ఎత్తున లేచింది ఆది శక్తి.

"అది కాదోయ్" నాకు తెలీదు కదా. అందుకని" అనునయంగా అడిగాడు

అప్పుడు కొంచెం శాంతబడి చెప్పింది పార్వతి " లక్ష్మి, సరస్వతి వాళ్ళ పతులను తీస్కొని భూలోకం వెళ్ళి అన్నీ వెరైటీ డిజైన్లలో ఉన్న నగలు,చీరలు అన్ని రకాలు కొనుక్కున్నారట. సరస్వతి ఐతె తన వీణ పాతదైపోయిందని గిటారు కొందట. అంతెందుకు బ్రహ్మ దేవుడు, నారాయణుడు కూడా తమవన్నీ ఆయుధములైతేనేమీ, నగలైతేనేమి అన్నీ కొత్తవి తీసుకున్నారట ". ఏడ్పు మొహం పెట్టుకుని చెప్తున్నదల్లా ఒక్కసారిగా కోపం తెచ్చుకుని " హూ !...మనమూ ఉన్నాము. నాకు ఈ నార చీరెలు తప్ప ఇంకోటి ఉండవు. మెడలోకి రోజుకో నగ పెట్టుకుందామంటే రెండు,మూడు కంటే ఎక్కువ లేవు. మీరెప్పుడూ ఆ తోలు తప్ప ఇంకొకటి చుట్టుకోరు. ఏదో పెద్ద అందమైన ఆభరణం వేసుకున్నట్టు మెడలో ఆ పామొకటి చిరాగ్గా.  ఛీ.. అసలు మీ ప్రక్కన కూర్చోవాలంటేనే రోత పుడుతోంది.." ( తన మానాన తను నిశ్శబ్దంగా ఉన్నవాడల్లా ఒక్కసారి తలెత్తి చుసాడు నాగరాజు. "మధ్యలో నన్నెందుకు తల్లీ ఆడిపోసుకుంటావు. ఇది మరీ బాగుంది " అనుకుంటున్నవాడల్లా పార్వతి తనని చూసేసరికి మళ్ళీ తల కిందకి వాల్చేసుకున్నాడు. ),

వినలేకపోతూన్నాడు  పరమేశుడు..ఎన్నడూ లేనిది ఇదేమిటి ఈ రోజు ? అయ్యో నారదా ఇదేం కొత్త లిటికేషనయ్యా? అనుకున్నాడు మనసులో. " పారూ ! నా మాట విను ప్లీజ్" మధ్యలో అందుకున్నాడు.

"ఇదుగో.. నన్ను భూలోకం తీసుకెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను" తర్జని చూపించి బెదిరించింది పార్వతి.

" ఛ.. అస్తమానూ అలా వెళ్ళిపోతుంటే వాళ్ళాకి లోకువ ఐపోతాం పారూ " అన్నాడు.

"ఐతే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటాను" అంది బిగ్గరగా ఏడుస్తూ.

ఒక్కసారిగా జాలేసింది ఈశుడికి. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తూ పక్కకి చూస్తే చిరునవ్వులు చిందిస్తున్నాడు  నంది చాటున దాక్కుని. ఇప్పుడు ఏమిటి ఉపాయం అన్నట్టు చూసాడు ఈశుడు. ఆయన మొహం చూసేసరికి నందికి నిజంగానే జాలేసింది. చటుక్కున ఏదో గుర్తుకొచ్చిన వాడిలా శివుడికి సైగ చేసాడు నంది. ఏమిటన్నట్టు చూసాడు శివుడు. తుపాకి పట్టుకున్నట్టు పట్టుకుని డిష్యుం.. డిష్యుం అని సైగ చేస్తున్నాడు నెమ్మదిగా నంది. చటుక్కున మెరుపు లాంటి ఆలోచన వచ్చింది శివుడికి. కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలా నెమ్మదిగా పార్వతి వైపు వచ్చి ,

"పారూ ! " అన్నాడు. పలకలేదు పార్వతి. ఏడుస్తోంది.

"అది కాదు పారూ ! నేను చెప్పేది కొంచెం శాంతం విను. ప్లీజ్" అన్నాడు.

ఏమిటి అన్నట్టు చూసింది పార్వతి. ఇప్పుడు ఆ చూపులు చాలా అమాయకంగా కనిపించాయి మహేశుడికి. ఇదే సమయం అనుకుని, " బ్రహ్మ భూలోకం ఎలా వెళ్తాడు? " అడిగాడు శివుడు మొదలుపెడుతూ.. అర్ధం కానట్టు చూసింది పార్వతి. ఈ ఆరంభం లోని మతలబు ఏమిటా అని ఇంకా  జాగ్రత్తగా చూస్తూ వింటున్నాడు నంది. ఇంకేం అందుకున్నాడు క్లాసు శివుడు. .

"పారూ ! ఇప్పుడు బ్రహ్మ భూలోకం వెళ్ళాలనుకో వెళ్తూ వెళ్తూ ఉన్న ఏ రాకెట్నో అంటిపెట్టుకుని వెళ్ళి, మళ్ళీ వస్తున్న ఇంకోదాన్ని పట్టుకుని తన లోకం వెళ్ళిపోతాడు. అదే నారాయణుడు వెళ్ళాలనుకో ఏ పడవో, ఓడో ఏదో ఒకటి ఉంటుంది. మనం వెళ్ళలంటే ఎలా వెళ్తాం చెప్పు. " అని అంటుండగా ఇంతలో పార్వతి,

"అంత ఖర్మ ఏంటి నాథా ? మనకి మాయలొచ్చుగా " అని ఇంకా ఏదో అనబోయేటంతలో తనకి ఆ ఛాన్సు ఇవ్వకుండా "అబ్బా ! పారూ నే చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత నువ్వేమైనా అడుగు. సరేనా" అని మళ్ళీ మొదలుపెట్టాడు.

" ఆ ! మనం భూలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. కొండలూ, కోనలు దాటుకుంటూ ఏ కాశ్మీర్ నుంచో, అమర్ నాథ్ నుంచో మొత్తం మీద ఎక్కడో ఒక ప్రదేశం నుంచి దాటుకుని వెళ్ళాలి. అవునా ? " అని ఆగాడు.

" ఊ " అంది పార్వతి అమాయకంగా అసలు ఏం చెప్తున్నాడో అర్ధం కాక.         

 "అసలే ఇప్పుడు మన మాయలు అంతంత మాత్రం. ఆ లోకంలో మానవులు చేసే మాయల ముందు మన మంత్రాలు,తంత్రాలు చిత్తయిపోతాయి. అలా వెళ్తున్న దారిలో ఏ టెర్రరిస్టో, మతోన్మాదో మనల్ని చూడకుండా ఉండడు." అని పార్వతి వైపు చూసాడు. టెర్రరిస్టు, మతోన్మాది అనగానే పార్వతికి నిజంగానే వణుకు పుట్టింది.

" దారిలో కొచ్చింది" అనుకున్నాడు శివుడు లోలోపల సంతోషిస్తూ.

" మనల్ని చూసి ఎవరో బోర్డరు దాటుతున్నారని జవాన్లు, మన అవతారాలు చూసి పాకిస్తాన్ వాళ్ళు ఒకేసారి కాల్చిపారేయడమో, బాంబులు వేసి పేల్చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఒక వేళ మన ఆత్మలు మనకి దక్కినా మన శరీరాలు మనకి దక్కవు. అప్పుడు మనం దేవుళ్ళుగా కాదు ప్రేతాత్మలుగా తిరగాలి. ఆలోచించు పారూ..ఆలోచించు. మనకా భూలోకంలో సేఫ్టీ లేదు పారూ  సేఫ్టీ లేదు. " అన్నాడు ఆయాసపడుతూ ఆవేశంగా.

పార్వతికి ఆలోచిస్తుంటే  ఇదంతా నిజమే అనిపిస్తోంది కానీ ఇంకా ఎందుకో అనుమానం తొలగట్లేదు.

గమనించిన శంకరుడు ఇంకేం డౌటు రాకుండా " పారూ! ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వెళ్ళు, రాయంచలు నీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకసారి అలా వనం అంతా తిరిగిరా. మనసు కొంచెం కుదుటపడుతుంది." అన్నాడు అనునయంగా.

"నాథా ! నా అజ్ఞానాన్ని మన్నించు." అని పార్వతి అక్కడి నుంచి కదిలింది. ఇన్ని చెబుతున్నాడు కాని ఈశుడికి ఆ సందేహం ఇంకా తీరనే లేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. దేవదాసు ఎవరా అని. అడిగేద్దామనుకున్నాడు కాని మళ్ళీ ఏం విపరీతం ముంచుకొస్తుందో అని నోరు మూసుకున్నాడు. ఇంతలో నంది హమ్మయ్యా ! గండం గడిచింది అనుకుంటూ వచ్చాడు.

నందిని చూసి శివుడు కౌగిలించుకున్నంత పని చేసాడు. "నువ్వా ఐడియా ఇవ్వకపోతే నేనేమైపోదునో వృషభా.." అన్నాడు ఈశుడు.

" ఆ నాదేముంది స్వామీ., ఏదో ఐడియా ఒకటే ఇచ్చాను. దానిని మీరు బాగా ప్లే చేసారుగా." అన్నాడు నంది.

ఇంక మహా దేవుడు ఉండబట్టలేక నందిని అడిగేసాడు దేవదాసు ఎవరూ అని.

" లేటెస్ట్ గా ఐతే షారుఖ్ ఖాన్" అన్నాడు నంది.

"అతనెవ్వండు" అడిగాడు వెంటనే శివుడు.

" దేవదాసు సినిమాలో హీరో" అన్నాడు నంది.

"సినిమాలో హీరోనా ! ఇంకా ఎవరో అనుకుంటున్నాను. ఐనా దేవదాసు  సినిమాయా?" అన్నాడు పరమేశుడు సంతోషంతో.

" ఆ.. సినీ 'మాయే' స్వామీ.." అన్నాడు నంది.

" ఐనా నందూ పార్వతి ఈ సినిమా ఎప్పుడు చూసింది? ఎక్కడ చూసింది? " అడిగాడు శివుడు.

" మొన్న కాకి గాడు సి.డి. తెచ్చిచ్చాడు అప్పుడు. ఇప్పుడే వస్తాను ప్రభూ" అని నంది వెళ్ళబోతుంటే           " ఎక్కడికి నాయనా ! " అడిగాడు ఈశుడు.

"ఏమీ లేదు మహాప్రభో మీరీ విషయం అడిగారని అమ్మగారి చెవిలో వేద్దామని " అన్నాడు సిన్సియర్ గా నంది, ఇది వరకు జరిగిన సీన్ గుర్తుకు వచ్చి..

అదే సీన్ గుర్తుకుతెచ్చుకొని శివ శంకరుడు " ఆ.!.." అని నోరు వెళ్ళబెట్టాడు.

                                

                                           * శుభం *

గమనిక: ఇది సరదాగా వ్రాసింది మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి కాదని నా మనవి.
  

Tuesday, October 18, 2011

నైపుణ్యం

ఈ విషయం మీద మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, 

అమ్మమ్మల కథల్లోనూ చాలా కథలే ఉన్నాయి. మనకందరికీ బాగా నచ్చిన ఒక కథ కుందేలు-తాబేలు పందెం కథ. ఆ కథ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఆ కథని మళ్ళీ క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత అసలు ఎందుకు ఇది రాస్తున్నాను అన్న సంగతి చెప్తాను.
కథ చూద్దాం., కుందేలుకి తన కంటే వేగంగా పరుగెత్తే వాళ్ళెవ్వరూ లేరని కొంచెం గర్వంగా ఉంటుంది. అది తన సత్తా చాటుకోవడానికి ఎవరూ దొరకలేదన్నట్టు తాబేలు దగ్గరకెళ్ళి , నాతో పరుగెత్తగలవా అని పందెం వేస్తుంది. తాబేలు ఆలోచిస్తుంది, నేను వేగంగా పరుగెత్తలేనని కుందేలుకు తెలుసు,ఇనా సరే నా దగ్గరికొచ్చి నన్ను ఆట పట్టిస్తోంది. తప్పనిసరిగా దీనికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని పందేనికి సరే అంటుంది. ఇక పందెం మొదలవుతుంది. కుందేలు కొంత దూరం పరుగెత్తి, వెనక్కి చూస్తే తాబేలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించదు. సరే ఎలాగూ నేనే గెలుస్తాను కదా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి కాస్తా గాఢ నిద్రలోకి మారిపోతుంది. ఈ లోపులో తాబేలు గమ్యం చేరుకుని పందెం గెలుస్తుంది. మెలకువ వచ్చి గమ్యం చేరుకున్న కుందేలుకి గర్వభంగం అవుతుంది. 





ఇదే తాబేలు తెలివితో ఇంకోలా కూడా చేసింది. ఇది కూడా అదే పందెం కథ కాని వేరేలా ఉంటుంది. పందెం వేసిన రోజు రాత్రి ఆ సంగతిని తాబేలు తన జాతి అంతటికీ చెప్తుంది. అప్పుడు అందులో ఒక వృద్ధ తాబేలు ఒక ఉపాయం చెప్తుంది. దానికి సరే అన్నాయి మిగతా తాబేళ్ళు.  మర్నాడు కుందేలు పందెం ప్రకారం పరుగు మొదలుపెడుతుంది. కానీ ఇక్కడ ఆ కథలోలా విశ్రాంతి తీసుకోదు. పరుగు పెడుతూనే ఉంటుంది. దాన్ని దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలు ఉంటుంది. మళ్ళీ దాటించేసాను అనుకునే లోపులో కుందేలు కంటే ముందు తాబేలే ఉంటుంది. ఇలానే కుందేలు గమ్యం చేరకముందే అక్కడ తాబేలు ఉండడంతో కుందేలు ఖంగుతింటుంది. ఇక్కడ కూడా కుందేలుకి గర్వభంగం అయ్యింది. కానీ ఇది ఎలా సాధ్యపడిందంటే ఆ రాత్రి వృద్ధ తాబేలు ఇచ్చిన ఉపాయం అది. దాని ప్రకారం ఆ రాత్రే అవి రెండు మీటర్ల దూరంలో ఒక్కొక్క తాబేలు చొప్పున గమ్యం వరకు ఉండి ఉపాయాన్ని అమలుపరిచాయి. 
ఇక ఈ కథలో మనకు తెలిసేదేమిటి అంటే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. అదే సమయంలో మనం ఏమిటో అన్నది కూడా తెలుసుకోవాలి. ఎవరి గొప్పతనం వారిదే. ఒకరు బుద్ధితో చేస్తే, ఇంకొకరు బలంతో చేస్తారు. ఇవేవీ లేకుంటే తమ తెలివి తక్కువతనంతో కూడా విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు.
        ఇక ఈ కథ మీకెందుకు చెప్పానో చెప్తాను. ఎందరో బ్లాగర్లు..అందరికీ వందనాలు. ఇది నా మనసులో మాట మాత్రమేనండీ. పంచుకోవాలని అనిపించి ఇలా వ్రాస్తున్నాను. ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచీ ఒక విషయంలో బలహీనత ఏర్పడింది. ఇక్కడ ఎంతో మంది రచయితలు, రచయిత్రులు. అందరి కలాల నుంచీ జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు. అవన్ని చూసి నేను వీళ్ళ దరికి చేరగలనా? వీళ్ళ గులాబీ రాతల గుబాళింపుల ముందు నేనొక గడ్డి పూవును కూడా కాదే అని ఒక రకమైన భావన.ఇది ఈర్ష్య మాత్రం కాదండీ. ఆరాధనా భావం మాత్రమే. 

ఇదే భావాన్ని నేను ఒక నేస్తంతో పంచుకున్నాను. అప్పుడు తను నన్ను ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పమనడం, నేను సరే అనడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, " గూడు కట్టే పిట్ట గొప్పదా లేక పుట్ట పెట్టే చీమ గొప్పదా ?"  అని.

 నాకు తను అలా ఎందుకు అడుగుతున్నారో మొదట అర్ధం కాలేదు. ఐనా సరే జవాబు చెప్పాను. "దేని నైపుణ్యం దానిదే. అందులో ఎవరు గొప్ప అంటే ఏం జవాబు చెప్పగలం? ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం కదా"  అన్నాను. 
 దానికి తను " సరే మరి తెలిసింది కదా? ఇంకా ఈ బాధెందుకు? ఇక్కడ ఎవరూ ఎవరికీ తక్కువ కారు. ఎవరూ ఎవరికీ సాటి రారు. అటువంటప్పుడు మనం ఇలాంటివన్ని మనసులో పెట్టుకోకూడదు. మనం చేసే పనిని చేస్కుంటూ పోవడమే, ఇంకొకరితో పోల్చుకోవడం అన్నది బుద్ధి లేని వాళ్ళు చేసే పని" అని చెప్పేసరికి నాలో ఉన్న బాధ అర్ధం లేనిదనిపించింది. ఇంత చక్కగా చెప్పి నాలో ఉన్న ఆ భావనని సరి చేసినందుకు ఆ నేస్తానికి, ఈ విషయం అందరితో పంచుకునేలా నన్ను ప్రోత్సహించిన మరో నేస్తానికి బ్లాగోన్ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్కుంటున్నాను.
అలాగే నాలాగే ఇలా ఎవరైనా ఇదే భావనతో ఉంటే ఆ భావన నుంచి బయటికి రమ్మంటున్నాను. నిర్భయంగా, నిర్మొహమాటంగా మన భావాలని ప్రకటించమంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక విషయం దాగి ఉంటుంది. ఆ విషయాన్ని నలుగురితో పంచుకోవడం ఒక ఆనందం. ఆ ఆనందాన్ని దూరం చేస్కోకూడదని నాకనిపిస్తోంది. మరి మీకు ???                        

Sunday, October 16, 2011

వెన్నెల వాన...

                                                                              
 సాయంకాలం అయ్యింది
ఎందుకో తనతో మాట్లాడాలనిపించింది
అలా మేడ మీదికి వెళ్ళాను.,
నాకు తెలుసు తను అక్కడే ఉంటాడని
నేను వెళ్ళింది తన కోసమే.,
కాని తను ఉన్నది నా కోసమో కాదో తెలియదు..
కాసేపు తననే చూస్తూ ఉన్నాను
ఏం మాట్లాడాలో తెలియక.,
తను కూడా నన్నే చూస్తున్నాడు ఓరగా
నేనే మాట్లాడుతానులే అని.,
ఇక నేను ఆగలేకపోయాను
నీ కోసం వచ్చానని తెలిసినా
నాతో మాట్లాడాలని అనిపించడం లేదా.,
ఇంకా అలానే చూస్తున్నాడు..
ఏం ఉలకవు పలకవు
అవునులే అన్ని చక్కని చుక్కలు
చుట్టూ ఉంటే నన్నెలా చుస్తావు
నాతో ఎలా మాట్లాడుతావు అన్నాను ఉడుక్కుంటూ.,
నా మొహం చూసి అప్పుడు నవ్వాడు సన్నగా..
ఆ నవ్వు కోటి కాంతులు వెదజల్లి
చిక్కని వెన్నెలై నా మీద కురుస్తుంటే
ఆ క్షణంలో నాకనిపించింది
నా చందమామ మళ్ళీ మళ్ళీ నవ్వాలని
ఆ వెన్నెల్లేనే తడిసిపోతూ ఉండాలని ! !

Friday, October 14, 2011

నేటి మనిషి...

కోయిల తీయగా పాడుతుంది అని నేనంటే
పాట ఏమిటి నీ మొహం మామూలు పిట్ట కూతే అంటాడు వాడు.,
వెన్నెల మల్లెపువ్వులా ఉంది అని నేనంటే
మల్లెపువ్వు ఏంటి చంద్రుని కాంతి అంటాడు వాడు.,
మేఘాల పల్లకీలోంచి వానజాణ
ఎంత వయ్యారాలు పోతూ దిగుతోందో చూడమంటే
అసలు మబ్బు జాడే కనిపించట్లేదంటే
వానజాణ అంటావేంటని విసుక్కుంటాడు.,
గలగల పారే సెలయేరుల మువ్వల సవ్వడులు
ఆ పై వీచే పిల్లగాలి పరిమళాలను ఆస్వాదించమంటే
కర్మాగారాల సైరను మోతలు,
మురికి నీటి దుర్వాసనలూనా అని రంకెలు వేస్తాడు.,
ఆ పచ్చదనం.. ప్రకృతికే అత్యంత అద్భుతం
ధవళ కాంతులు వెదజల్లే హిమ శిఖరాల సౌందర్యం తిలకించమంటే
ఇంకెక్కడి మంచు కొండలు ఓజోన్ పొర చిరిగి
అవి కరిగిపోతోంటే అని చిందులు తొక్కుతాడు.,
ప్రకృతి వికృతిగా మారిపోతోంటే
సౌందర్యం సౌందర్యం అని ఉర్రూతలేంటి అని చురకలు వేస్తాడు.,
విజ్ఞాన శాస్త్రం క్రొత్త పుంతలు తొక్కి
అసలు సౌందర్యం అన్న మాటకే అర్థాలు మారిపోతున్న ఈ కాలంలో
ఇంకా ఎందుకు పాత అందాన్నే పొగుడుతావ్
అని సూటిగా ప్రశ్నిస్తాడు నేటి ' ఆధునిక ' మానవుడు ! !  

Thursday, October 13, 2011

స్మృతి

మరణించినవారు స్వార్థపరులు
మనం వెక్కి వెక్కి ఏడుస్తున్నా
ఒక్కసారైనా ఊరడించరు
వాళ్ళంతే
నడవడానికి కూడా బద్దకమే
భుజాన మోయించుకుంటారు
పిల్లల్లా స్నానం చేయించుకుంటారు
ఎంత దర్పమో
మనకి తెలియని సత్యాలేవొ తెలిసినట్టు
మనం చూడని లోకాలేవో చూసినట్టూ
వెళ్ళేప్పుడు మాటవరసకైనా చెప్పరే
మహా మొండి ఘటాలు
హెచరిస్తున్నట్టో, మనల్ని నిందిస్తున్నట్టో
మొహం మాడ్చుకుని ఉంటారు
తమ మాటే నెగ్గాలన్నట్టు
బిర్ర బిగుసుకుపోతారు
తామే ప్రత్యేకమైనట్టు
కర్రల రథమెక్కి ఊరేగుతారు
మహా మతిమరుపు
ఏదీ గుర్తుంచుకోరు ఎవర్నీ గుర్తుంచుకోరు
మనం మాత్రం గుర్తుంచుకోవాలి ఏడాదికోసారైనా
 ఏంజెల్ గోంజాలేజ్ రచనకు స్వేఛ్ఛానుకరణ ఇది.. ఒకసారెప్పుడో చదివినప్పుడు నాకు బాగా నచ్చి పుస్తకంలో వ్రాసుకున్నాను. ఎందుకో ఈ రోజు ప్రొద్దున్న చూసాను అకస్మాత్తుగా. ఇలా బ్లాగింగ్ చేసాను. ఆయన 20 వ శతాబ్దపు సుప్రసిద్ధ స్పానిష్ కవి.


Wednesday, October 12, 2011

ఆశల తీవెలు...



ఏమిటి అలా చూస్తున్నావు ?
గజిబిజిగా అల్లిన తీగలనా..
.. కాదు.. నీ చుట్టూ అల్లుకున్న నా ఆశలు ! !

Tuesday, October 11, 2011

కన్నీరు...

సంతోషం - దుఃఖం
రెండింటి మధ్య దూరం
ఒక కన్నీటి చుక్క..,
దుఃఖాన్ని .. సంతోషాన్ని ..
ఆ చుక్కలో ఇముడ్చుకుని
చెంపపై నుండి వయ్యరంగా జారి
ముత్యమై మెరిసి
గుండెపై ఇంకిపోతుంది
ఎందుకు.. అంటే..
ఆ ముత్యాలన్నీ అక్కడే పదిలంగా దాచుకోమని
ఇక అంతకన్నా విలువైనవి లేనే లేవని..!

Monday, October 10, 2011

ఈ రోజు సూసైడ్ ప్రివెన్షన్ డే

సంవత్సరానికి ఉన్న 365 రోజులలో మానవ సంబంధాలకి, మానవీయ దృక్పథానికి, దీర్ఘ వ్యాధులకి, సమాజానికి సంకేతంగా ఏడాదిలో 92 రోజులు ప్రత్యేకంగా గుర్తించి, వాటిని ప్రపంచ వ్యాప్తంగా దేశ, జాతి, మత, వివక్షత లేకుండా పాటించాలని, అంతర్జాతీయ ముఖ్య దినాలుగా గుర్తించాలన్నారు.
మదర్స్ డే, ఫాదర్స్ డే, సీనియర్స్ డే, డాక్టర్స్ డే, కేన్సర్ డే దీర్ఘ వ్యాధులు- అనేక దినోత్సవాలతో పాటు సెప్టెంబరు పదో తేదీని ఆత్మహత్యల నివారణ దినం గా ప్రకటించారు ఇటీవలే. దీనితో స్పెషల్ డే లు 93 కి చేరుకున్నాయి.
అసలు ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి. స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువ సంఖ్యలో - ఏ వర్గం లో వారు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నరు వంటి ప్రశ్నలకి, పట్నాల్లో యువతులు, పల్లెటూళ్ళలో రైతులు, మధ్య తరగతిలో స్త్రీలు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
 ఈ మూడు వర్గాల్లో వ్యవసాయదారులు, సన్నకారు రైతులు, ఎక్కువమంది ఉన్నారుట. ఇప్పటికి 2 లక్షల 41 వేలమంది బడుగు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ? - రాజకీయాలు, ప్రభుత్వ శాఖలోని లంచగొండితనం, దళారీలు. ఇవే గాక పొగాకు, పత్తి, వేరు శెనగ వంటి వ్యాపార పంటలు పండిస్తే లాభాలు వస్తాయన్న ఆశ రైతుల్లో కల్పించి, అప్పులిచ్చి వాళ్ళని ముంచుతున్న మధ్యవర్తులు.
ఎరువులు, క్రిమి సంహారక మందులను ప్రభుత్వం సకాలంలో అందించలేకపోతోంది. వాటిని బ్లాకులో ఎక్కువ ధరకి అమ్ముకునే కంపెనీలు-వారి అనుయాయులు, ఇదంతా తమ వెనకే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపొవడంతో రైతులు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించే చర్యలు, పరిస్థితులు కల్పించాలి కాని. " సూసైడ్ ప్రివెన్షన్ డే " అని ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? --- మాలతీ చందూర్.          

Saturday, October 8, 2011

ఇది ఏమిటో నువ్వే చెప్పు...



ఇది చిత్రమేనా అని అనుకోకు
నాకు తెలుసు
రవి వర్మ చిత్రంలో సజీవత
పికాసో చిత్రంలో కళ్ళు చెదిరే అందాలు
దీనిలో కనిపించదు.,
ఇదీ ఒక కవితేనా అని అనుకోకు
శ్రీనాధుని శృంగార రసము,
కాళిదాసు గంభీర పదజాలము
నా కలమునకు రాదు.,
రవీంద్రుని భావుకత వెతికినా కనిపించదు.,
శ్రీ శ్రీ గుండెను రగిల్చే ఆవేశం
మచ్చుకు కుడా ఉండదు.,
తిలక్, కృష్ణశాస్త్రి కవితలోని
అందాలు, సౌకుమార్యాలు నాకు రానే రావు.,
ఏదో మనసులో కలిగే భావం
దీనికి ఏ పేరు పెడతావో నీ ఇష్టం..,
కనులు మూసుకుంటే కనిపించే చిత్రం
అది చిత్రమో కాదో నువ్వు చూస్తే కాని తెలియదు..,
నా కలలకు రూపం నా చిత్రం
నా మనసులోని భావం ఈ కవిత్వం ! ! !   

Thursday, October 6, 2011

జగన్మాతాయ నమః



జననీ శివ కామినీ
జయ శుభకారిణీ
విజయ రూపిణీ
అఖిల జగాలకు అమ్మవు నీవే

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలండీ !

Wednesday, October 5, 2011

మృగతృష్ణ

భావనలోంచి భాష పుడుతుందో లేక భాష లోంచి భావన జనియిస్తుందో తెలియదు కాని నా భావనలన్నిటికీ భాషవు మాత్రం నీవే. గుండె గొంతుకలోంచి తొంగి చూసే పలుకలేని భావాలకు రూపం నీవే. కంటి పాపలో నిదురించే స్వప్నం నీవే. నా ఆశలకు ఊపిరి నీవే. నా ఊహలలో ఊసులు నీతోనే. నా ఒంటరితనాలకు తోడువు నీవే. నా ఏకాంతాలలో ఆమని నీవే.

ఇలా నీకు చెప్పాలని చేసే యత్నంలో నా మౌనం నన్ను జయించింది. ఆ ఆత్రం ఆవేదనగా మారింది.
ఒడ్డుకి ఆవల ఉన్న నిన్ను చేరుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోగా, నిశీధిలో నిలబడి వెలుగులో నిన్ను చూస్తున్నాను. ఆ వెలుగును చేరుకోవడం మాత్రం నాకు చేత కావట్లేదు.
అనుకుంటాను ఎపుడైనా, చేయి అందిస్తావని. కానీ నాకు తెలుసు నేనేమిటో తెలియకుండా నా నీడని కూడా నువ్వు తాకవని. నీ కోసమే నేను ఉన్నానని ఎలా తెలుపను? నా ఈ చిన్ని ప్రపంచం నీ చుట్టూ అల్లుకుందని ఎలా చెప్పను?

నేనిలా నీ ఆలోచనల్లోనే ఉన్నాను. నీవు నా ఎదురుగా కదలాడుతూనే ఉన్నావు. కానీ కాలం కదలకుండా ఉంటుందా? ఇంతకీ కాలానికి కూడా నా మీద దయ లేదు అంతే. లేకుంటే నువ్వున్నా నేనిలా ఒంటరిగానే ఉండిపోతానా చెప్పు !

ఇప్పుడిక ఎప్పటికీ నీవు రావు. నేను నా హృదయం విప్పి చెప్పలేను. కాలం కౌగిలిలో శిలగా, జీవితమనే ఎడారిలో ఎండమావిగా ఇలాగే మిగిలిపోయాను.

Tuesday, October 4, 2011

యెద పుటల్లో ...


బుడి బుడి నడకల బుజ్జాయినై
అమ్మ పెదవులపై దరహాసమై
నాన్న గుండెలపై చిన్నారినై
అమ్మమ్మ కథలకు రాకుమారినై
తాతయ్య మీసాలకు తుంటరినై
ఆడిన ఆటలకు, పాడిన పాటలకు
అదుపులు లేక, అలుపులు లేక
చెలరేగిన ఆ చిన్నతనంలో
చిరుప్రాయపు ఆ కొంటెతనం
మరపురాని జ్ఞాపకాల తరంగం
యెద పుటలపై ఓ తీయని సంతకం ! !
                          

గీతాంజలి..ఒక్కొక్క పాట ఒక్కో పూదోట.

నేను పాడడానికి వచ్చిన పాట
ఈనాటికీ పాడకుండానే మిగిలిపోయింది
నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తూ
వదులు చేస్తూ నా రోజుల్ని గడిపేసాను
తాళం సరిగా సాగలేదు
పదాల కూర్పు కుదరలేదు
నా హృదయంలో కాంక్షా బాధ మాత్రమే మిగిలిపోయింది
 పువ్వు విచ్చుకోలేదు
గాలి మాత్రం నిట్టూర్చుతోంది పక్కన
అతని ముఖాన్ని చూడలేదు నేను
అతని కంఠమూ వినలేదు
నా ఇంటి ముందు నుండి నడిచే
అతని మెత్తని పాద ధ్వనిని మాత్రమే వినగలిగాను
నేలపై అతనికి ఆశనం పరచడంలోనే
దినమంతా గడిచిపోయింది
ఇంకా దీపం వెలిగించలేదు
అతన్ని ఇంట్లోకి ఎలా అహ్వానించను?
అతన్ని కలుసుకోగలననే ఆశతో బ్రతుకుతున్నాను
కానీ ఆ కలయిక ప్రాప్తించింది కాదు...   ----ఠాగోర్ గీతాంజలికి చలం అనువాదం


                                                        

Monday, October 3, 2011

నీ ధ్యాసే...

                

               కురిసిన వెన్నెల్లో
                    విరిసిన మల్లెల్లో
                    తలపుల నావల్లో
                    చూసే చూపుల్లో
            అనుక్షణమూ నీ ధ్యాసే ప్రియా ! ! 


                                              

                                          

Saturday, October 1, 2011

నీ పాటకై...


                            నీ తీయని రాగాల తేనెలకి చవులూరి.,
                            ఎటో పోతోన్న మనసుని మళ్ళించాను దారి.,
                            అందుకే వినిపించు నేస్తం నీ రాగం ఇంకోసారి..!