Search This Blog

Wednesday, February 22, 2012

కురవని మేఘం..



ఏ దారిలో మేఘం నీవో
నా దారికి వచ్చావు
నా మనసున స్నేహం నింపి
కనులకు చినుకులు చేర్చావు

చేతలకు అందలేదు
మాటలకూ అందలేదు
చూపులకు తోస్తున్నావు
చేరాలని రెక్కలు నే కట్టినా
అంత దూరం రాలేకున్నా

నే తప్పులు చేస్తే
మెరుపులతో బెదిరించు
ఉరుములతో దాడిచేయించు
నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు
చినుకులైనా కురిపించు
మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!


ఈ కవితను నా నేస్తం వ్రాసాడు ఇంకో నేస్తం కోసం..నాకు చాలా నచ్చి ఇక్కడ ప్రచురించుకుంటున్నాను.

మౌనం ఒక్కోసారి ఎంత నరకమో కదా..అదీ ఆత్మీయులనుకున్నవారు పలకరించకపోతే ఇంక ఆ బాధ కన్నా విపరీతమైనది సృష్టిలో లేనే లేదు.నా వరకు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది.

నిశ్శబ్ధం ఆవరించిన నల్లని మేఘం.. నిజమే అది కురవాలి..కురవాలంటే చల్ల గాలి తోడవ్వాలి..ఆ గాలి తోడు లేకుంటే ఆ మేఘం ఎందుకు?

స్నేహమూ అంతే.. మనసుకు వేరొక మనసే సాంత్వన అందించాలి.లేకుంటే మనసు మనుగడేది? ఒంటరిగా కుమిలిపోవడం తప్ప.అప్పటివరకు కురవని మేఘంలా స్తబ్ధుగా ఉన్న మనసు ఒక చిన్న ఆత్మీయ స్పర్శతో పులకించి కురిసిపోతుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మనసుకు మనసు చేదోడుగా ఉంటే ఆ స్నేహంలో తీయదనం చెప్పేదేముంది! ఇలాంటి ఒక స్నేహం ఉంటే జీవితమే మధురం కదూ..మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలమీ స్నేహం.అందుకే కొన్ని సార్లు రక్తబంధం కన్నా స్నేహబంధం గొప్పది అంటారు పెద్దలు.ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే కదండీ.ఐనా నేను చెప్పేదేముందీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఈ స్నేహమాధుర్యం..

Sunday, February 19, 2012

మందుబాబులు




ఈనాడు వైద్యుడు నేలబారు నుంచి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఆపరేషన్ మొదలుపెట్టేముందు, డాక్టరు ఏ మతానికి చెందినవాడైనా ఆ మత దైవాన్ని ప్రార్థించి మరీ ఆపరేషన్ కత్తి చేపడతాడు. 
అంతటి నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో తమ వృత్తికి అంకితమయ్యే డాక్టర్లు కొందరు ఈనాడు తాగి ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నారంటే మనం ఎక్కడికెళుతున్నాము? వైద్యవృత్తి దైవికము కాదు మందువికము అన్న స్థితికి పడిపోతున్నాము. 


వైద్యుడు రోగి ప్రాణాలు కాపాడతాడు. న్యాయవాది తనని నమ్మి వచ్చిన క్లయింటు ఆస్తిపాస్తులను న్యాయబద్ధంగా కాపాడతాడు. ఈ రెండు వృత్తులూ ప్రాణాలనూ, ఆస్తులనూ కాపాడే వృత్తులు.వైద్యుడు వృత్తి చేపట్టేముందు రోగి ప్రాణాలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం,ఆశయం, శాయశక్తులా అందుకు పోరాడతానని శపథం చేస్తాడు. అలాగే న్యాయవాది న్యాయదేవత ముందు తాను స్వపరబేధం, ధన లోభం లేకుండా, ఆఖరి క్షణం వరకూ న్యాయ పరిరక్షణ కోసం పోరాడతానని శపథం చేస్తాడు. ఐతే ఇవి కొందరి విషయంలో హిపోక్రటిక్ శపథాలవుతున్నాయి.  


అటువంటి దైవిక శపథాలు చేసిన వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తిధర్మం, వృత్తిపట్ల గల శ్రద్ధాభక్తులు మర్చిపోయి, తాగి ఆపరేషన్ చేయ్యాలనుకోవటం, రోగి జీవితంతో ఆటలాడుకోవడమే. అలానే న్యాయవాది తాగిన మైకంలో కోర్టు ఆవరణలోకి వచ్చి అశ్లీలాలతో ఎదుటి న్యాయవాదిని దూషించి,కోర్టు ఆవరణలోనే మిగతా వాళ్ళని తిట్టడం అనాగరికం, అమానుషం. చదువుకుని నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే ఈ ఇద్దరూ పవిత్రమైన  తమ బాధ్యతని మర్చిపోయి, తాగిన మైకంలో వృత్తిని సాగిద్దాం అని అనుకున్నప్పుడు, కఠిన శిక్షలు అనుభవించక తప్పదు. వారిద్దరికీ జరిగిన అవమానం మిగతావారికి ఒక గుణపాఠం కావాలి.-----------మాలతీ చందూర్

సౌజన్యం: స్వాతి పత్రిక.


Saturday, February 4, 2012

నీ ఎడబాటులో...




అంత తేలిక కాదేమో
ఈ ప్రేమని మట్టిలో కలిపేయడం.,

ఈ గుండెకి ఒక తీయని గాయం చేసావు
జీవితంలో ఇక కోలుకోలేనంతగా.,
ఇదిగో ఇప్పుడు చూడు
ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ప్రేమతో చిరునవ్వు చిందిస్తావని 
ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను...

ఎంత వింత!!
నువ్వలా చూస్తుంటే 
నా మనసులో మాట నీ కళ్ళలో కనిపిస్తోంది.,

నీ జ్ఞాపకమే 
నాకు రేయి పగలు తోడుగా ఉంటోంది.,

ఇపుడింక నిన్ను మర్చిపోవడం సాధ్యమేనా
నువ్వు తోడు లేకుండా నేనీ లోకాన మనగలనా!

ఎందుకీ దోబూచులాట
బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!