Search This Blog

Sunday, November 18, 2012

మనసే పాడినది...



                                                                                                                                                            

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది


నీలాకాశపు పందిరి కింద
చక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ


ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై
విచ్చిన పువ్వుల నవ్వులు నాకై
విరిసే వయసుల మధుమాసంలో
వలపుల జల్లులు కురిసే వేళ

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది

 


నా పాటల్ని ఇష్టపడుతున్న, ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకు మరియు పెద్దలకు చిన్న విన్నపము. నాకస్సలు సంగీత జ్ఞానం లేదు. నా మనసులో ఏ రాగం మెదిలితే దానికి అలా పదాలను కూరుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పెట్టిన రాగాలన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి.. ఇంకా కాస్త మెరుగైన, హుషారైన బాణీలను కూర్చటానికి ప్రయత్నిస్తున్నా. మామూలుగానే నాకు మెలోడీస్ అంటే ఇష్టం.. ఆ కారణంతోనో మరేమో నాకు అన్ని రాగాలు ఇలానే వస్తున్నాయ్. అన్నీ ఒక మూస లోనే ఉన్నాయి అని అనుకోకుండా నన్నింకా ప్రోత్సహిస్తూ ఉంటారని మనఃస్పూర్తిగా ఆశిస్తున్నాను.   


**పాటకి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టమని ప్రోత్సహించి, ఆ టైటిల్స్ కూడా తనే వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను...

Saturday, November 10, 2012

నువ్వు మిగిల్చిన జ్ఞాపకం ( నేను ) ...

సేకరణ : http://www.exoticindiaart.co.in

నా కోసమే పుట్టావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
కలలే తెలియని కనులకు
ఒక మధురమైన స్వప్నమయ్యావనుకున్నాను
నా కోసమే పుట్టావనుకున్నాను.,
కళనే ఎరుగని ఈ మనసుకు
సృష్టినే సుందర కళాఖండంగా చూపించావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
మామూలుగా ఉన్న ఈ లోకం
ఉన్నట్టుండి క్రొత్తగా తోచిన వేళ
ఇదేమిటని అడిగితే
ఇది మన ఇరువురి కనులకు మాత్రమే
కనిపించే ప్రపంచము అంటే
నీతోనే నా లోకము అనుకున్నాను.,
కానీ ఇంతలోనే...
నాకందనంత దూరానికి నువ్వెళ్ళిపోయావు
నన్ను ఒంటరిగా వదిలి
నీ దారి నువ్వు చూసుకున్నావు.,
కళ్ళు తెరిచి చూసా ఐనా చీకటి
తెలుస్తున్నది ఒక్కటే.. సన్నటి కన్నీటి పొర
కళ్ళలో ఇమడలేక
చెక్కిలిపై ఏకధాటిగా ప్రవహిస్తోంది.,
తరువాత తెలిసింది...
నన్ను నడిపించిన ఆ అమృత హస్తం
నా మధుర స్వప్నం
ఇక ఎన్నటికీ తిరిగిరాదని
అందరూ అనుకుంటుంటే.,
కానీ వాళ్ళకు తెలియదు
" నేనే నువ్వు " అని... ఎప్పటికీ..!

Friday, November 2, 2012

గుండె గూడు మూగబోయి...



  


గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

తూరుపు తెలవారుతున్నా
మనసుకేది వేకువ అంటూ
విడిచిన ఆ నిట్టూర్పులలో
జాలువారు కన్నీటిలో
కుసుమించిన కిరణమై నేస్తమా!
ఓదార్పువు నువ్వే స్నేహమా!

చినబోయిన పెదవులపైన
చిన్ని నవ్వు చూడాలని
ప్రతి పువ్వును కుశలమడుగుతూ
కమ్మని ఆ మధువులు తెచ్చి
తేనె చినుకు నువ్వై నేస్తమా!
పలకరించు నవ్వువు స్నేహమా!

గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!