Search This Blog

Monday, May 30, 2011

గులక రాళ్ళు

గుండె చెరువులో గులక రాళ్ళు ఈ ఆలోచనలు. విసిరే కొద్దీ అలలు అలలుగా కదులుతూనే ఉంటాయవి.
కొన్ని ఎందుకు ఆలోచిస్తామో తెలియదు మనకవి అవసరం లేకపోయినా, కొన్ని ఆలోచించాల్సినవే ఆలోచించం ఎంత అవసరమైనా సరే. ఒక్కొక్కసారి మనసు కోతి లాంటిదట. కొంపలు మునిగిపోయేటంత పనైనా చేయాలనిపించదు ఆ సమయంలో, లేదా అస్సలు అవసరం లేని పనినే చేసేయాలని ఐనా అనిపిస్తుంది.
ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించనట్లే ఉంటుంది. కోరుకున్న ఏకాంతం కంటే అక్కర్లేని ఒంటరితనమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
తనది అని అనుకునేది తనది అవునో, కాదో తెలియకపోయినా వెర్రి ఆరాటం. వద్దని చెప్పి మనసుని నిరాశ పరచడం కంటే, తనదే అని చెప్పి సంతృప్తి పడడమే మేలనిపిస్తుందేమో...
షేక్ స్పియర్ చెప్పినట్టు ప్రపంచం ఒక నాటక రంగం. మనుషులంతా పాత్రధారులు. తరచి చూస్తే జీవిస్తున్నామో,నటిస్తున్నామో తెలియకుండా పోతుంది. నిజ జీవితంలోనే ఎన్నో నాటకాలు.. భారీ సెట్టింగులు, పరిణితి చెందిన కళాకారులు ఇవేవీ వీటికి అవసరం లేదు.
నువ్వేంటో తెలుసుకోవడానికి ఒక జీవితం చాలదు. పైగా మనం ఇంకొకళ్ళ మీద రీసెర్చ్. ఎవడి బ్రతుకు వాడికే ఒక పజిల్. పక్కవాడి జీవితానికి వీడి జీవితం వడ్డించిన విస్తరి.
మానవుడు సంఘ జీవి. తన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని సెన్స్ లెస్ ఫెలో. తన వరకూ వస్తే గాని తెలియని సగటు ప్రాణి. అందుకే విశ్వంలో ఇన్ని అరాచకాలూ, అల్లకల్లోలాలూను...
నిజంగా మనసుని గెలుచుకోవడం ఎవరికీ సాధ్యమవ్వని పని అయ్యుంటుంది. ప్రేమలు-పగలు, సంతోషాలు-దుఃఖాలు అన్నిటికీ ఆరంభం-అంతం అన్నీ ఇక్కడే, ఈ మనసులోనే. ప్రేమించే మనసుకి, ద్వేషించే మనసుకి పెద్దగా తేడా లేదనిపిస్తుంది నాకైతే. ఎంతగా ప్రేమించగలదో, అంతగా ద్వేషించగలదు మరి మనసు. నిజంగా ప్రేమించే వాడికి అన్ని వైపుల నుంచీ ఆలోచించే నేర్పు, ఓర్పు రెండూ ఉంటాయి. వాడికి చెయ్యడం తప్ప, చెప్పడం రాదు. గుండెల్లో గూడు కట్టుకుంటాడేమో కానీ, బయట గూడుపుఠాణీలు చేయడు, చెయ్యలేడు.
 ప్రేమ- ఆది నుంచీ చరిత్రలో నిత్య యవ్వనంగా కనిపించేది ఇది ఒక్కటే అనుకుంటాను. గతించిన చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలో కూడా ఇదొక వాడిపోని పువ్వు. ఒక్కొక్కసారి గుబాళిస్తుంది, ఒక్కొక్కసారి రక్తాశ్రువులు రాలుస్తుంది. అందుకే సలీం-అనార్కలి. లైలా-మఝ్ను, దేవదాస్-పార్వతి... ఇలా నిజంగా ఉన్నా, లేకున్నా వాళ్ళ ప్రేమ కథలతో చిరంజీవులుగా మిగిలిపోయారు.
కవితలు-కథలు, సత్యాలు-స్వప్నాలు, నిజాలు- అబద్దాలు ఎక్కడా పోలికలే లేని వస్తువులు. కథలెంత అందంగా ఉంటాయో, వాస్తవాలంత కఠోరంగా ఉంటాయి.
"కల్పనలను జీవితానికి అన్వయించుకోవడం ఎంత కష్టమో, జీవితాన్ని కలలా ఊహించుకోవడం కూడా అంతే భ్రమ..."
ఆలోచనలకి అంతం లేకుండా పోతే ఇంతగా అల్లకల్లోలంగా ఉంటాయని చెప్పడానికి ఈ రాతలే తార్కాణం.. అందుకే గులకరాళ్ళు ఈ ఆలోచనలు అన్నది.        

Sunday, May 15, 2011

నిదురించిన యెదలో ...

గల గల పారే గోదారి పరుగులా
కిల కిల నవ్వే సెలయేటి తరగలా
కుహు కుహూల కోయిలమ్మ పాటలా
తొలి చినుకు నేలని తాకి చేసే సరాగంలా
విరిసీ విరియని పువ్వులోని మృదు హాసంలా
పున్నమి రేయిలోని వెన్నెల వెలుగులా ...
మనసుని తాకుతున్న ఈ పరిమళాల జల్లులు
నిదురించిన యెద నదిలో యెగసిపడుతున్న అలలు
నీ రాకలోని ప్రతి అణువణువును  తెలిపి
నన్ను నాలో నిలువనీయకుండా చేసిన
ఈ తీయని భావనను ఏమంటారు నేస్తం ? ?

Saturday, May 14, 2011

"స్పర్శ..."


 నా ప్రతి పొద్దులోను
నులి వెచ్చని కిరణానివై తాకుతావు.,
నా బుగ్గల్లో సిగ్గులా విరబూసి
నా పెదాలపై నవ్వుల కెంపులద్దుతావు.,
తొలి చినుకు తాకిన నేలలా
గిలిగింతల నీ స్పర్శకి
కనులు తెరుద్దామన్నా తెరుచుకోవు
ఎందుకో తెలుసా ? ?
ఆ మధురానుభూతి ఎక్కడ చెదిరిపోతుందోనని ..!

Tuesday, May 10, 2011

సామెతలు

హలో అండీ
   ఏంటండి ఒక్కళ్ళు కూడా స్పందించలేదు..కాస్త మీకు తెలిసిన సామెతలు ఉంటే చెప్దురూ ప్లీజ్.. నా సందేహం కూడా తీర్చండీ బాబూ!

Saturday, May 7, 2011

మదర్స్ డే సందర్భంగా ...ఉడుతా భక్తితో

 పాపడి నుంచి పండు ముదుసలి వరకు
తలదాచుకునే గుడి నీ ఒడేనమ్మా !
తను నిలువునా కరిగిపోతున్నా
మా జీవితాలలో వెలుగులు నింపే
అనురాగ జ్యోతి నీవేనమ్మా !
మా కంట కన్నీరు తుడిచి
మమ్ములను ఆదుకునే
అమృత మూర్తివమ్మా నీవు !
కష్టాల కడలిలో మునిగిపోతూ
మమ్ములను ఒడ్డున చేర్చే
త్యాగ మూర్తివమ్మా నీవు !
అమ్మా ! ఈ సృష్టికి మూలం నువ్వు
నీవు లేని ఈ జగతి శూన్యం..
కనిపించని ఆ దైవం తనకు మారుగా
ఇలకు పంపిన కరుణా మూర్తివి నీవు !
ఇపుడా దైవమే తల్లడిల్లిపోతోందమ్మా !
నిన్నెందుకు ఇలకు పంపానా అని...
ఒకప్పుడు తనే సృష్టించిన నిన్ను చూసి
ఓర్వలేని ఆ దైవం
ఇప్పుడు తప్పు చేసానని మధనపడిపోతోందమ్మా
నిన్ను అనాథగా వదిలేస్తున్నారని !
కానీ నువ్వు ఎప్పటికీ అనాథవి కాదమ్మా..
నిన్ను భారం అనుకుని
ఏ వృద్ధాశ్రమంలోనో, రహదారి మీదనో
వదిలేస్తున్నామే, మేమమ్మా అసలైన అనాథలు.,
మేమేనమ్మా సర్వం కోల్పోయిన వాళ్ళము...
నువ్వు మమ్ములను భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు
పడిన బాధ మాకు తెలీదమ్మా !
మమ్ములను పెంచడానికి
నువ్వు పడిన కష్టం మాకు తెలీదమ్మా !
నువ్వు ఎప్పుడైనా ఆలోచించావామ్మా
నీకు మేము భారం అని ?
కానీ ఈ ఆధునిక యుగంలో
మేము ఆలోచిస్తున్నామమ్మా నువ్వు భారం అని.,
మమ్మల్ని కనడానికి, పెంచడానికి
ఎన్నో కష్టాల్ని అనుభవించావు, అనుభవిస్తున్నావు..
సహించావు, సహిస్తునావు...
ఇప్పుడు కూడా అలాగే మా ఈ
దుస్సాంప్రదాయాన్ని అనుభవించమ్మా !
మా ఈ ఆలోచనల్నీ, అజ్ఞానాన్నీ సహించమ్మా !
నువ్వు మా కన్నీళ్ళు తుడిచినట్టు
మేము నీ కన్నీళ్ళు తుడవలేమమ్మా !
మాకా శక్తి ఉన్నా చేయలేని అశక్తులం అమ్మా !
దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు
కానీ నువ్వు కారుణ్య మూర్తివమ్మా
భూదేవి కి కూడా అంత సహనం లేదమ్మా
మమ్మల్ని క్షమించమ్మా ! !ఎందరో పిల్లలు (వీళ్ళంతా విద్యావంతులు మళ్ళీ) తమ తల్లుల్ని, తండ్రుల్ని వృద్ధాశ్రమాల్లోనూ, రోడ్ల మీదా వదిలేస్తున్నారు. పెరుగుతున్న వ్రుద్ధాశ్రమాల సంఖ్య, రోడ్ల మీద ముసలి వాళ్ళ సంఖ్యే దీనికి నిదర్శనం.. కాదంటారా?

ఎన్నో కష్టాల కోర్చి తమ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకువచ్చి, తమకంటూ ఏమీ మిగుల్చుకోని, తల దాచుకోను నీడ కూడా లేని తల్లులకు, తండ్రులకు శిరసు వంచి నమస్సుమాంజలులు...శత కోటి కోటి పాదాభి వందనాలు..

                                                   మాతృదేవో భవ
                                                   పితృదేవో భవ..  

Wednesday, May 4, 2011

నీ రాకతో . . .

మనసులో ఏదో నిశ్శబ్దం
మనసులాగే ఈ వనమంతా .,
పిల్లగాలుల ఈల పాటలు లేవు
విరిసిన పువ్వుల నవ్వులు లేవు
పూల పరిమళాలు లేవు
ఎపుడూ పలుకరించుతూ పోయే
తుమ్మెద సరాగాలసలే లేవు...
కళ్ళు తెరవాలని అనిపించని మనసును
చల్లగా తాకిన చిరుగాలి కబురు .,
మనసు విప్పి చూస్తే ..
వేచి వేచి ఇక రావని సోలిపోయిన
పూల బాలలు నీలి నింగితో గుసగుసలు పోతున్నాయి
తుమ్మెదలు ఝుం ఝుం అని రాగాలు తీస్తున్నాయి
మనసులో తీయని భావన
చూడు నేస్తం..
నీ రాకతో ఈ వనం ఎలా వెల్లివిరిసిందోనని . ! !