Search This Blog

Monday, May 30, 2011

గులక రాళ్ళు

గుండె చెరువులో గులక రాళ్ళు ఈ ఆలోచనలు. విసిరే కొద్దీ అలలు అలలుగా కదులుతూనే ఉంటాయవి.
కొన్ని ఎందుకు ఆలోచిస్తామో తెలియదు మనకవి అవసరం లేకపోయినా, కొన్ని ఆలోచించాల్సినవే ఆలోచించం ఎంత అవసరమైనా సరే. ఒక్కొక్కసారి మనసు కోతి లాంటిదట. కొంపలు మునిగిపోయేటంత పనైనా చేయాలనిపించదు ఆ సమయంలో, లేదా అస్సలు అవసరం లేని పనినే చేసేయాలని ఐనా అనిపిస్తుంది.
ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించనట్లే ఉంటుంది. కోరుకున్న ఏకాంతం కంటే అక్కర్లేని ఒంటరితనమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
తనది అని అనుకునేది తనది అవునో, కాదో తెలియకపోయినా వెర్రి ఆరాటం. వద్దని చెప్పి మనసుని నిరాశ పరచడం కంటే, తనదే అని చెప్పి సంతృప్తి పడడమే మేలనిపిస్తుందేమో...
షేక్ స్పియర్ చెప్పినట్టు ప్రపంచం ఒక నాటక రంగం. మనుషులంతా పాత్రధారులు. తరచి చూస్తే జీవిస్తున్నామో,నటిస్తున్నామో తెలియకుండా పోతుంది. నిజ జీవితంలోనే ఎన్నో నాటకాలు.. భారీ సెట్టింగులు, పరిణితి చెందిన కళాకారులు ఇవేవీ వీటికి అవసరం లేదు.
నువ్వేంటో తెలుసుకోవడానికి ఒక జీవితం చాలదు. పైగా మనం ఇంకొకళ్ళ మీద రీసెర్చ్. ఎవడి బ్రతుకు వాడికే ఒక పజిల్. పక్కవాడి జీవితానికి వీడి జీవితం వడ్డించిన విస్తరి.
మానవుడు సంఘ జీవి. తన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని సెన్స్ లెస్ ఫెలో. తన వరకూ వస్తే గాని తెలియని సగటు ప్రాణి. అందుకే విశ్వంలో ఇన్ని అరాచకాలూ, అల్లకల్లోలాలూను...
నిజంగా మనసుని గెలుచుకోవడం ఎవరికీ సాధ్యమవ్వని పని అయ్యుంటుంది. ప్రేమలు-పగలు, సంతోషాలు-దుఃఖాలు అన్నిటికీ ఆరంభం-అంతం అన్నీ ఇక్కడే, ఈ మనసులోనే. ప్రేమించే మనసుకి, ద్వేషించే మనసుకి పెద్దగా తేడా లేదనిపిస్తుంది నాకైతే. ఎంతగా ప్రేమించగలదో, అంతగా ద్వేషించగలదు మరి మనసు. నిజంగా ప్రేమించే వాడికి అన్ని వైపుల నుంచీ ఆలోచించే నేర్పు, ఓర్పు రెండూ ఉంటాయి. వాడికి చెయ్యడం తప్ప, చెప్పడం రాదు. గుండెల్లో గూడు కట్టుకుంటాడేమో కానీ, బయట గూడుపుఠాణీలు చేయడు, చెయ్యలేడు.
 ప్రేమ- ఆది నుంచీ చరిత్రలో నిత్య యవ్వనంగా కనిపించేది ఇది ఒక్కటే అనుకుంటాను. గతించిన చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలో కూడా ఇదొక వాడిపోని పువ్వు. ఒక్కొక్కసారి గుబాళిస్తుంది, ఒక్కొక్కసారి రక్తాశ్రువులు రాలుస్తుంది. అందుకే సలీం-అనార్కలి. లైలా-మఝ్ను, దేవదాస్-పార్వతి... ఇలా నిజంగా ఉన్నా, లేకున్నా వాళ్ళ ప్రేమ కథలతో చిరంజీవులుగా మిగిలిపోయారు.
కవితలు-కథలు, సత్యాలు-స్వప్నాలు, నిజాలు- అబద్దాలు ఎక్కడా పోలికలే లేని వస్తువులు. కథలెంత అందంగా ఉంటాయో, వాస్తవాలంత కఠోరంగా ఉంటాయి.
"కల్పనలను జీవితానికి అన్వయించుకోవడం ఎంత కష్టమో, జీవితాన్ని కలలా ఊహించుకోవడం కూడా అంతే భ్రమ..."
ఆలోచనలకి అంతం లేకుండా పోతే ఇంతగా అల్లకల్లోలంగా ఉంటాయని చెప్పడానికి ఈ రాతలే తార్కాణం.. అందుకే గులకరాళ్ళు ఈ ఆలోచనలు అన్నది.        

No comments:

Post a Comment

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !