Search This Blog

Saturday, May 7, 2011

మదర్స్ డే సందర్భంగా ...ఉడుతా భక్తితో

 పాపడి నుంచి పండు ముదుసలి వరకు
తలదాచుకునే గుడి నీ ఒడేనమ్మా !
తను నిలువునా కరిగిపోతున్నా
మా జీవితాలలో వెలుగులు నింపే
అనురాగ జ్యోతి నీవేనమ్మా !
మా కంట కన్నీరు తుడిచి
మమ్ములను ఆదుకునే
అమృత మూర్తివమ్మా నీవు !
కష్టాల కడలిలో మునిగిపోతూ
మమ్ములను ఒడ్డున చేర్చే
త్యాగ మూర్తివమ్మా నీవు !
అమ్మా ! ఈ సృష్టికి మూలం నువ్వు
నీవు లేని ఈ జగతి శూన్యం..
కనిపించని ఆ దైవం తనకు మారుగా
ఇలకు పంపిన కరుణా మూర్తివి నీవు !
ఇపుడా దైవమే తల్లడిల్లిపోతోందమ్మా !
నిన్నెందుకు ఇలకు పంపానా అని...
ఒకప్పుడు తనే సృష్టించిన నిన్ను చూసి
ఓర్వలేని ఆ దైవం
ఇప్పుడు తప్పు చేసానని మధనపడిపోతోందమ్మా
నిన్ను అనాథగా వదిలేస్తున్నారని !
కానీ నువ్వు ఎప్పటికీ అనాథవి కాదమ్మా..
నిన్ను భారం అనుకుని
ఏ వృద్ధాశ్రమంలోనో, రహదారి మీదనో
వదిలేస్తున్నామే, మేమమ్మా అసలైన అనాథలు.,
మేమేనమ్మా సర్వం కోల్పోయిన వాళ్ళము...
నువ్వు మమ్ములను భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు
పడిన బాధ మాకు తెలీదమ్మా !
మమ్ములను పెంచడానికి
నువ్వు పడిన కష్టం మాకు తెలీదమ్మా !
నువ్వు ఎప్పుడైనా ఆలోచించావామ్మా
నీకు మేము భారం అని ?
కానీ ఈ ఆధునిక యుగంలో
మేము ఆలోచిస్తున్నామమ్మా నువ్వు భారం అని.,
మమ్మల్ని కనడానికి, పెంచడానికి
ఎన్నో కష్టాల్ని అనుభవించావు, అనుభవిస్తున్నావు..
సహించావు, సహిస్తునావు...
ఇప్పుడు కూడా అలాగే మా ఈ
దుస్సాంప్రదాయాన్ని అనుభవించమ్మా !
మా ఈ ఆలోచనల్నీ, అజ్ఞానాన్నీ సహించమ్మా !
నువ్వు మా కన్నీళ్ళు తుడిచినట్టు
మేము నీ కన్నీళ్ళు తుడవలేమమ్మా !
మాకా శక్తి ఉన్నా చేయలేని అశక్తులం అమ్మా !
దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు
కానీ నువ్వు కారుణ్య మూర్తివమ్మా
భూదేవి కి కూడా అంత సహనం లేదమ్మా
మమ్మల్ని క్షమించమ్మా ! !ఎందరో పిల్లలు (వీళ్ళంతా విద్యావంతులు మళ్ళీ) తమ తల్లుల్ని, తండ్రుల్ని వృద్ధాశ్రమాల్లోనూ, రోడ్ల మీదా వదిలేస్తున్నారు. పెరుగుతున్న వ్రుద్ధాశ్రమాల సంఖ్య, రోడ్ల మీద ముసలి వాళ్ళ సంఖ్యే దీనికి నిదర్శనం.. కాదంటారా?

ఎన్నో కష్టాల కోర్చి తమ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకువచ్చి, తమకంటూ ఏమీ మిగుల్చుకోని, తల దాచుకోను నీడ కూడా లేని తల్లులకు, తండ్రులకు శిరసు వంచి నమస్సుమాంజలులు...శత కోటి కోటి పాదాభి వందనాలు..

                                                   మాతృదేవో భవ
                                                   పితృదేవో భవ..  

No comments:

Post a Comment

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !