Search This Blog

Thursday, December 20, 2012

శుభాకాంక్షలు

ఈ రోజు కళ్యాణ్ గారి ( నాలోమాట బ్లాగర్  ) పుట్టినరోజు. మరి క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పేద్దామా.. రండి రండి.. వచ్చేయండి త్వరగా :)
నా బ్లాగులో మీది రెండో పుట్టినరోజు కళ్యాణ్.. అందుకే మీకు రెండు అంతస్థుల కేకన్నమ్మాట ;) ( ఇక నుంచీ ప్రతీ పుట్టినరోజుకి ఇలాగే ఉంటుంది అనుకునేరు కాక.. గూగుల్ లో దొరకడం కష్టం. మళ్ళీ నేను చేయాల్సొస్తుంది. కాబట్టి ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ;) )  

ఏదేమైనా మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎన్నో విజయాలు సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను..
అసలు విషయం చెప్పడమే మర్చిపోయా చూసారా.. అదేనండీ
హృదయపూర్వక జన్మదిన 'సుభా' కాంక్షలు. :)  


Sunday, November 18, 2012

మనసే పాడినది...



                                                                                                                                                            

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది


నీలాకాశపు పందిరి కింద
చక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ


ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై
విచ్చిన పువ్వుల నవ్వులు నాకై
విరిసే వయసుల మధుమాసంలో
వలపుల జల్లులు కురిసే వేళ

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది

 


నా పాటల్ని ఇష్టపడుతున్న, ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకు మరియు పెద్దలకు చిన్న విన్నపము. నాకస్సలు సంగీత జ్ఞానం లేదు. నా మనసులో ఏ రాగం మెదిలితే దానికి అలా పదాలను కూరుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పెట్టిన రాగాలన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి.. ఇంకా కాస్త మెరుగైన, హుషారైన బాణీలను కూర్చటానికి ప్రయత్నిస్తున్నా. మామూలుగానే నాకు మెలోడీస్ అంటే ఇష్టం.. ఆ కారణంతోనో మరేమో నాకు అన్ని రాగాలు ఇలానే వస్తున్నాయ్. అన్నీ ఒక మూస లోనే ఉన్నాయి అని అనుకోకుండా నన్నింకా ప్రోత్సహిస్తూ ఉంటారని మనఃస్పూర్తిగా ఆశిస్తున్నాను.   


**పాటకి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టమని ప్రోత్సహించి, ఆ టైటిల్స్ కూడా తనే వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను...

Saturday, November 10, 2012

నువ్వు మిగిల్చిన జ్ఞాపకం ( నేను ) ...

సేకరణ : http://www.exoticindiaart.co.in

నా కోసమే పుట్టావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
కలలే తెలియని కనులకు
ఒక మధురమైన స్వప్నమయ్యావనుకున్నాను
నా కోసమే పుట్టావనుకున్నాను.,
కళనే ఎరుగని ఈ మనసుకు
సృష్టినే సుందర కళాఖండంగా చూపించావనుకున్నాను
నీ కోసమే బ్రతకాలనుకున్నాను.,
మామూలుగా ఉన్న ఈ లోకం
ఉన్నట్టుండి క్రొత్తగా తోచిన వేళ
ఇదేమిటని అడిగితే
ఇది మన ఇరువురి కనులకు మాత్రమే
కనిపించే ప్రపంచము అంటే
నీతోనే నా లోకము అనుకున్నాను.,
కానీ ఇంతలోనే...
నాకందనంత దూరానికి నువ్వెళ్ళిపోయావు
నన్ను ఒంటరిగా వదిలి
నీ దారి నువ్వు చూసుకున్నావు.,
కళ్ళు తెరిచి చూసా ఐనా చీకటి
తెలుస్తున్నది ఒక్కటే.. సన్నటి కన్నీటి పొర
కళ్ళలో ఇమడలేక
చెక్కిలిపై ఏకధాటిగా ప్రవహిస్తోంది.,
తరువాత తెలిసింది...
నన్ను నడిపించిన ఆ అమృత హస్తం
నా మధుర స్వప్నం
ఇక ఎన్నటికీ తిరిగిరాదని
అందరూ అనుకుంటుంటే.,
కానీ వాళ్ళకు తెలియదు
" నేనే నువ్వు " అని... ఎప్పటికీ..!

Friday, November 2, 2012

గుండె గూడు మూగబోయి...



  


గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

తూరుపు తెలవారుతున్నా
మనసుకేది వేకువ అంటూ
విడిచిన ఆ నిట్టూర్పులలో
జాలువారు కన్నీటిలో
కుసుమించిన కిరణమై నేస్తమా!
ఓదార్పువు నువ్వే స్నేహమా!

చినబోయిన పెదవులపైన
చిన్ని నవ్వు చూడాలని
ప్రతి పువ్వును కుశలమడుగుతూ
కమ్మని ఆ మధువులు తెచ్చి
తేనె చినుకు నువ్వై నేస్తమా!
పలకరించు నవ్వువు స్నేహమా!

గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

Friday, October 5, 2012

నీ కౌగిలిలో...!

నేను గుర్తున్నానా నేస్తం?
అడిగాను అలవోకగా.,
ఒక నవ్వు విరబూసింది
తన పెదవులపై జవాబుగా.,
కోపం వచ్చింది నాకు భలేగా
ఐనా నన్నెందుకు గుర్తుపెట్టుకుంటావులే
అనేసాను నిష్ఠూరంగా.,
బదులుగా నా వైపు ఒక చూపు జాలిగా.,
కరిగానా? ఊహూ!
నా భావాలేం కనిపించకుండా మోము దాచేసానుగా.,
ఇదంతా నన్ను ఆట పట్టించడానికే అని 
మరి నాకు ముందే తెలుసుగా.,
అందుకే ఏమౌతుందా అని చూస్తున్నా ఆశక్తిగా.,
దాచిన ఆ మోమును చేతిలోకి తీసుకొని
నా కళ్ళలోకి చూస్తుంటే.,
తన కళ్ళేదో చెప్తున్నట్టే అనిపిస్తోంది మూగగా.,
చినుకు లేకుంటే 
మేఘం తనని మరిచిందని కాదుగా

పలికాయి తన పెదవులు ఆర్తిగా.,
వింటున్న మనసుకు ఏదో ఇదిగా
తన కౌగిలిలో ఒదిగిపోయాను హాయిగా..!  

Wednesday, September 19, 2012

శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులకు మరియు పెద్దలకు వినాయక చవితి శుభాకాంక్షలు..!

Friday, September 7, 2012

ఆ పువ్వుల వరమిస్తావా!!


ఎందుకూ తనని ముని పంటితో 
అదిమి పట్టి ఉంచుతావు
తనని చూడాలని ఈ మనసుకు
ఎంత తపనో తెలుసా.,
తనని వదిలితే ఎందరి మనసుల్ని
మురిపించేస్తుందో అని నీ భయం కాబోలు.,
అందర్ని మురిపించడం సరే..,
తనతో పాటుగా ఎప్పుడైనా 
నిన్ను నువ్వు చూసుకున్నావా
అలా చూసి ఉంటే., 
యధేఛ్ఛగా తనని వదిలేసేవాడివేమో
కానీ నువ్వా అవకాశమే ఇవ్వవు.,
నీ పెదాలపై విరబూయాలని తను
ఆ పువ్వులన్నీ ఏరుకుని హారాలల్లుదామని నేను
మా ఈ ఎదురు చుపులకు 
అలుపు లేకుండా పోతోంది తెలుసా!
ఇలా తనను, నన్ను 
వేధించడం నీకేమన్నా భావ్యమా చెప్పు.,
నీ నుంచి నేనేమీ కోరుకోను
నువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..! 

Saturday, August 4, 2012

తేనెలూరే నవ్వునై..


రెమ్మ రెమ్మకు నేనే రాగాలు చిలికిస్తానని
మెల్ల మెల్లగా వీచే ఆ పిల్ల గాలులకు 
పరిమళ గంధాలు అద్దుతానని
ఝుమ్మను నాదాల కొంటె తుమ్మెదకు
కమ్మని తేనెల వలపునని
మదిలో ఏవేవో ఆలాపనలు సేయుచుండ.,
చటుక్కున కొమ్మల వెనుక దాగిన
నీ మోముని చూసి అచ్చెరువొంద.,
అరవిరిసిన అందాలతో ఆ రెమ్మ నుండి విడివడి 
గుబాళించిన పువ్వునే.,
ఆ ముద్దొచ్చే పెదవులపై 
నీ నవ్వునైపోయా..!!


ఈ నవ్వుల పువ్వులు మీ పెదవులపై ఎప్పుడూ విరబూయాలని కోరుకుంటూ బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక ఫ్రెండ్ షిప్ డే "సుభా"కాంక్షలు..    

Friday, July 20, 2012

పిట్ట కొంచెం


అన్నీ ఆలోచింపచేసే టపాలే.అసలు తను స్పృశించని అంశం అంటూ ఉండదు నన్ను అడిగితే. ఎంతో చక్కని శైలితో వ్రాసే తన వ్యాసాలను కానీ మరే అంశాలని కానీ ఇంకొకరి వ్రాతలతో పోల్చి చూడలేం. అంత అందంగా అల్లుకుపోతూ ఉంటుంది ఆమె అక్షరాలతో.  "వన్నె చిన్నెల కాశ్మీరం" నుంచి మొన్నటి "గుర్తుకొస్తున్నాయి" టపా వరకూ అన్నీ అలాంటి టపాలే..
ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి  చెబుతున్నానో..ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి..
తనే నవరసజ్ఞభరితం బ్లాగరు రసజ్ఞ.తన పుట్టిన రోజు ఈ రోజు.
ఇప్పటికే తాత గారు (కష్టేఫలే శర్మ గారు)ఆయన బ్లాగులో వేద వచనాలతో తనకి బోలెడు ఆశీస్సులు అందించారనుకోండి.అది తెలుగు తిథుల ప్రకారం అని చెప్పారు. ఇంగ్లీషు కాలెండరు ప్రకారం ఐతే ఈ రోజు అంటే 20వ తారీకున.
ఇక టైటిల్ పిట్ట కొంచెం అని ఎందుకు పెట్టానా అనుకుంటున్నారు కదండీ..చిన్నదైనా అన్ని విషయాలను అలా అలవోకగా చర్చిస్తుంది మరి అందుకే నాకు అలా అనిపించింది.పిట్ట కొంచెమైనా కూత ఘనం అని.. ఘనం కాదేమో ఘనం స్క్వేర్ అనాలేమో మరి మీరు కూడా కొంచెం సాయం చేద్దురూ ఈ మాటకి.



హృదయపూర్వక జన్మదిన "సుభా"కాంక్షలు రసజ్ఞ.

Thursday, March 22, 2012

స్వాగత సుమాంజలులు


చిగురాకుల కొమ్మలపై
కోయిలమ్మ కుహు కుహులే 
విరిసినవి వసంత గీతాలై.,
మత్తిల్లిన మల్లియల 
పరిమళాల గాలులలో
మైమరిచిన నా మనోవనం
జాలువారినది మధుర మకరందమై.,
అరమోడ్పుల కన్నులతో
సుందర స్వప్న మనోజ్ఞ సీమలలో
తేలియాడుతున్న ఈ మనస్సును
తట్టి లేపినది మరియొక యుగాది...
హా! అని కనులు తెరచినంతనే
క్రొంగొత్త సొబగులతో, సుగంధ మాలినీ మాలలతో 
ప్రకృతి కాంత ఆ యుగాదిని అలంకరించుచుండ., 
తిలకించిన నా మది నందనమై
ఉత్సాహము చివురులు తొడిగినదై
తానే ఎదురేగి స్వాగత సుమాంజలులు 
సమర్పించె సంతసము తోడై !!!   


బ్లాగు లోకపు పెద్దలకు మరియు మిత్రులకు అందరికీ నందన నామ సంవత్సర ఉగాది 'సుభా' కాంక్షలు.. ఈ ఉగాది అందరికీ సర్వ శుభములనూ కలుగజేయాలని కోరుకుంటూ..

Thursday, March 1, 2012

ఈ వయసేమిటో..


వసంత గీతమై
విరబూసిన ఆమనిలో.,
వనమంతా పులకరించి
తీవెలుగా పలుకరించి
ప్రతి పువ్వునీ స్పృశించి
మధు మరందాలు గ్రోలి.,
మత్తెక్కిన తెమ్మెరలో
ప్రణయ ఝూంకారాలు చేసే తుమ్మెదలా.,
నా మనసేమిటో ఊహలనేలుతోంది..
నా వయసెందుకో ఊయలలూగుతోంది..
నీ కన్నా ముందు నీ వలపు చేరిందా
లేక నా మనసే నిన్ను చేరుకుందా.,
ఏమో నీకేమైనా తెలుసా ప్రియా?! 

Wednesday, February 22, 2012

కురవని మేఘం..



ఏ దారిలో మేఘం నీవో
నా దారికి వచ్చావు
నా మనసున స్నేహం నింపి
కనులకు చినుకులు చేర్చావు

చేతలకు అందలేదు
మాటలకూ అందలేదు
చూపులకు తోస్తున్నావు
చేరాలని రెక్కలు నే కట్టినా
అంత దూరం రాలేకున్నా

నే తప్పులు చేస్తే
మెరుపులతో బెదిరించు
ఉరుములతో దాడిచేయించు
నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు
చినుకులైనా కురిపించు
మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!


ఈ కవితను నా నేస్తం వ్రాసాడు ఇంకో నేస్తం కోసం..నాకు చాలా నచ్చి ఇక్కడ ప్రచురించుకుంటున్నాను.

మౌనం ఒక్కోసారి ఎంత నరకమో కదా..అదీ ఆత్మీయులనుకున్నవారు పలకరించకపోతే ఇంక ఆ బాధ కన్నా విపరీతమైనది సృష్టిలో లేనే లేదు.నా వరకు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది.

నిశ్శబ్ధం ఆవరించిన నల్లని మేఘం.. నిజమే అది కురవాలి..కురవాలంటే చల్ల గాలి తోడవ్వాలి..ఆ గాలి తోడు లేకుంటే ఆ మేఘం ఎందుకు?

స్నేహమూ అంతే.. మనసుకు వేరొక మనసే సాంత్వన అందించాలి.లేకుంటే మనసు మనుగడేది? ఒంటరిగా కుమిలిపోవడం తప్ప.అప్పటివరకు కురవని మేఘంలా స్తబ్ధుగా ఉన్న మనసు ఒక చిన్న ఆత్మీయ స్పర్శతో పులకించి కురిసిపోతుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మనసుకు మనసు చేదోడుగా ఉంటే ఆ స్నేహంలో తీయదనం చెప్పేదేముంది! ఇలాంటి ఒక స్నేహం ఉంటే జీవితమే మధురం కదూ..మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలమీ స్నేహం.అందుకే కొన్ని సార్లు రక్తబంధం కన్నా స్నేహబంధం గొప్పది అంటారు పెద్దలు.ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే కదండీ.ఐనా నేను చెప్పేదేముందీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఈ స్నేహమాధుర్యం..

Sunday, February 19, 2012

మందుబాబులు




ఈనాడు వైద్యుడు నేలబారు నుంచి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఆపరేషన్ మొదలుపెట్టేముందు, డాక్టరు ఏ మతానికి చెందినవాడైనా ఆ మత దైవాన్ని ప్రార్థించి మరీ ఆపరేషన్ కత్తి చేపడతాడు. 
అంతటి నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో తమ వృత్తికి అంకితమయ్యే డాక్టర్లు కొందరు ఈనాడు తాగి ఆపరేషన్ థియేటర్ కి వస్తున్నారంటే మనం ఎక్కడికెళుతున్నాము? వైద్యవృత్తి దైవికము కాదు మందువికము అన్న స్థితికి పడిపోతున్నాము. 


వైద్యుడు రోగి ప్రాణాలు కాపాడతాడు. న్యాయవాది తనని నమ్మి వచ్చిన క్లయింటు ఆస్తిపాస్తులను న్యాయబద్ధంగా కాపాడతాడు. ఈ రెండు వృత్తులూ ప్రాణాలనూ, ఆస్తులనూ కాపాడే వృత్తులు.వైద్యుడు వృత్తి చేపట్టేముందు రోగి ప్రాణాలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం,ఆశయం, శాయశక్తులా అందుకు పోరాడతానని శపథం చేస్తాడు. అలాగే న్యాయవాది న్యాయదేవత ముందు తాను స్వపరబేధం, ధన లోభం లేకుండా, ఆఖరి క్షణం వరకూ న్యాయ పరిరక్షణ కోసం పోరాడతానని శపథం చేస్తాడు. ఐతే ఇవి కొందరి విషయంలో హిపోక్రటిక్ శపథాలవుతున్నాయి.  


అటువంటి దైవిక శపథాలు చేసిన వైద్యులు, న్యాయవాదులు తమ వృత్తిధర్మం, వృత్తిపట్ల గల శ్రద్ధాభక్తులు మర్చిపోయి, తాగి ఆపరేషన్ చేయ్యాలనుకోవటం, రోగి జీవితంతో ఆటలాడుకోవడమే. అలానే న్యాయవాది తాగిన మైకంలో కోర్టు ఆవరణలోకి వచ్చి అశ్లీలాలతో ఎదుటి న్యాయవాదిని దూషించి,కోర్టు ఆవరణలోనే మిగతా వాళ్ళని తిట్టడం అనాగరికం, అమానుషం. చదువుకుని నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే ఈ ఇద్దరూ పవిత్రమైన  తమ బాధ్యతని మర్చిపోయి, తాగిన మైకంలో వృత్తిని సాగిద్దాం అని అనుకున్నప్పుడు, కఠిన శిక్షలు అనుభవించక తప్పదు. వారిద్దరికీ జరిగిన అవమానం మిగతావారికి ఒక గుణపాఠం కావాలి.-----------మాలతీ చందూర్

సౌజన్యం: స్వాతి పత్రిక.


Saturday, February 4, 2012

నీ ఎడబాటులో...




అంత తేలిక కాదేమో
ఈ ప్రేమని మట్టిలో కలిపేయడం.,

ఈ గుండెకి ఒక తీయని గాయం చేసావు
జీవితంలో ఇక కోలుకోలేనంతగా.,
ఇదిగో ఇప్పుడు చూడు
ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ప్రేమతో చిరునవ్వు చిందిస్తావని 
ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను...

ఎంత వింత!!
నువ్వలా చూస్తుంటే 
నా మనసులో మాట నీ కళ్ళలో కనిపిస్తోంది.,

నీ జ్ఞాపకమే 
నాకు రేయి పగలు తోడుగా ఉంటోంది.,

ఇపుడింక నిన్ను మర్చిపోవడం సాధ్యమేనా
నువ్వు తోడు లేకుండా నేనీ లోకాన మనగలనా!

ఎందుకీ దోబూచులాట
బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..! 

Thursday, January 5, 2012

అడగాలని ఉన్నా అడగలేను..!



తను అనుకుని ఉండదు నువ్విలా చేస్తావని..
నువ్వు లేకున్నా
బ్రతకడం నేర్చుకుంది ఎలాగో జీవఛ్ఛవంలా.,
నాకు బాధంటే ఏమిటో తెలియకుండా చేసింది
తను మాత్రం తీరని వేదనను అనుభవించింది
నాకు తనని అడగడం రాదు.,ఎందుకంటే..
బాధను భరిస్తూనే నాకు జన్మనిచ్చింది
గుండెలోని ఉప్పెనను గుప్పెటలో అదిమిపట్టి
పెదవుల్లో మాత్రం చెరగని చిరునవ్వు నింపుకుని
నాకు పూలబాట పరచిన జీవితాన్నిచ్చింది.,
ఊహ తెలియకముందు నాకు తెలియదు
తెలిసిన తర్వాత తెలిసింది నువ్వంటే ఏమిటో
లోకులు కాకులై అరుస్తుంటే.,
అదే సమయంలో నువ్వంటే
పెరిగిన ఏహ్యభావం చిగురులు తొడగటం మొదలుపెట్టింది..
నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం 
నేర్పించని తన వల్ల అది మొగ్గ వరకు కూడా ఎదగలేదు.,
నాకు నిన్ను అలా పిలవాలని ఎప్పుడూ అనిపించలేదు
ఏ మూలో ఇంకా నాలో ఆ చివురుల తాలూకు 
ఆనవాలు మిగిలిపోయుంటుంది..
నాకు జన్మనివ్వడంలో నీ ప్రాధాన్యత ఎంతో ఉంది
అందుకే ఆ ఛాయలు అప్పుడప్పుడూ నాలో 
నీకు గౌరవం ఇవ్వడంలో ప్రస్ఫుటమౌతుంటుంది..
నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వదిలిపెట్టి
నీ దారి నువ్వు చూసుకున్నప్పుడే 
అర్ధం అయింది నాకు, నీకు "నాన్న" అంటే అర్ధం తెలియదని 
నిన్ను అడగాలనే ఉంటుంది నాకు ఎందుకిలా చేసావు అని
కాని అది వ్యర్ధం అని తెలిసి
తిరిగి అమ్మలోనే నాన్నను నింపుకుంటున్నా..! 



ఏ తోడూ లేకున్నా,ఎవరి సహకారం లేకున్నా, లోకులు కాకులై పొడుస్తున్నా లెక్క చేయక తమ రెక్కల కష్టంతో తమ పిల్లల్ని పెంచి, పోషించి వాళ్ళని ఒక మంచి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే ఎంతో మంది  తల్లులకు ఇలా వందనాలు అర్పించుకుంటున్నాను...