భావనలోంచి భాష పుడుతుందో లేక భాష లోంచి భావన జనియిస్తుందో తెలియదు కాని నా
భావనలన్నిటికీ భాషవు మాత్రం నీవే. గుండె గొంతుకలోంచి తొంగి చూసే పలుకలేని
భావాలకు రూపం నీవే. కంటి పాపలో నిదురించే స్వప్నం నీవే. నా ఆశలకు ఊపిరి
నీవే. నా ఊహలలో ఊసులు నీతోనే. నా ఒంటరితనాలకు తోడువు నీవే. నా ఏకాంతాలలో
ఆమని నీవే.
ఇలా నీకు చెప్పాలని చేసే యత్నంలో నా మౌనం నన్ను జయించింది. ఆ ఆత్రం ఆవేదనగా మారింది.
ఒడ్డుకి ఆవల ఉన్న నిన్ను చేరుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోగా, నిశీధిలో నిలబడి వెలుగులో నిన్ను చూస్తున్నాను. ఆ వెలుగును చేరుకోవడం మాత్రం నాకు చేత కావట్లేదు.
అనుకుంటాను ఎపుడైనా, చేయి అందిస్తావని. కానీ నాకు తెలుసు నేనేమిటో తెలియకుండా నా నీడని కూడా నువ్వు తాకవని. నీ కోసమే నేను ఉన్నానని ఎలా తెలుపను? నా ఈ చిన్ని ప్రపంచం నీ చుట్టూ అల్లుకుందని ఎలా చెప్పను?
నేనిలా నీ ఆలోచనల్లోనే ఉన్నాను. నీవు నా ఎదురుగా కదలాడుతూనే ఉన్నావు. కానీ కాలం కదలకుండా ఉంటుందా? ఇంతకీ కాలానికి కూడా నా మీద దయ లేదు అంతే. లేకుంటే నువ్వున్నా నేనిలా ఒంటరిగానే ఉండిపోతానా చెప్పు !
ఇప్పుడిక ఎప్పటికీ నీవు రావు. నేను నా హృదయం విప్పి చెప్పలేను. కాలం కౌగిలిలో శిలగా, జీవితమనే ఎడారిలో ఎండమావిగా ఇలాగే మిగిలిపోయాను.
భావానికి తగిన పేరు. బావుంది సుభ గారూ..
ReplyDeletethx jyothi gaaru.
ReplyDelete