Search This Blog

Sunday, October 20, 2013

"యువరాజ"కీయం

"స్వామీ!"

"ఏమీ!"

"యువరాజా వారు తమ దర్శనం కోరుతున్నారు"

"అని నీవు సందేశం తీసుకు వచ్చావా మూర్ఖ శిష్యా? పొమ్ము.. తక్షణమే తోడ్కొని రమ్ము"
(వీడి దుంప తెగ! వచ్చిన వాడిని వెంట తీసుకురాకుండా మళ్ళీ నాకు కబురొకటి. వాడి మూడ్ ఎలా ఉందో, వెయిట్ చేయించినందుకు నా గతి ఏమిటో, హతవిధీ!)

"భక్తులారా! ఈ రోజుకిక సత్సంగం సమాప్తం. స్వామీజీ వారి కాంత సేవకు సారీ ఏకాంత సేవకు వేళ ఐనది"

" బాబా అల్లకల్లోల స్వామీజీకి జై..
బాబా అల్లకల్లోల స్వామీజీకి జై.."

" హా! వీళ్ళ పిలుపు మండిపోనూ! అల్లకల్లోల ఏమిట్రా మూర్ఖ శిష్యా?"

"క్షమించాలి స్వామీ! అలక్ లాల్ స్వామీ అనే అంటున్నారు స్వామీ! మీకలా వినిపిస్తున్నట్టోంది" 

" స్వామీ! యువరాజా వారు వేంచేస్తున్నారు"

" స్వామీ మీరు లేచి వెళ్ళి స్వాగతం పలకడం ఏమిటి స్వామీ?"

" నోరు ముయ్యరా అర్భకా! యువరాజు వింటాడు" 

" చిత్తం స్వామీ!"

" మా ఆశ్రమం పావనం అయ్యింది యువరాజా! కబురు చేస్తే మేమే..."

" ప్రణామములు స్వామీజీ"

" సకల సంపదా ప్రాప్తిరస్తు" 

" యువరాజా వారెందుకో చింతిత మనస్కులై ఉన్నట్టున్నారు!"

" చింత కాకుంటే మరేముంటుంది స్వామీ? రాజమాత ఆరోగ్యమా అంతంత మాత్రంగా ఉంటోంది. నలభై దాటిపోయినా నేనింకా యువరాజులాగే ఉన్నాను.యువరాజు, యువరాజు అని అనడమే గానీ నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది స్వామీ"

(హమ్మయ్యా! బయట నిలబెట్టినందుకు నేను స్వామిని కాకుండా పోతానేమో అనుకున్నాను. ముందరి కాళ్ళకు బంధం వేయడం మంచిదైంది.ఐనా పెళ్ళి ఒక్కటే చేస్కోలేదు కానీ నువ్వేమన్నా తక్కువ ఎంజాయ్ చేస్తున్నావా నాయనా?)
" అదేమిటి నాయనా! ఇప్పుడు నీ మనశ్శాంతికి వచ్చిన ఆపదేమిటి?"

" ఏం చెప్పమనటారు? ఐనా మీకు తెలియనివి ఏమున్నాయి చెప్పండి? ఆలోచించకో, చించో రాజమాత ముందు అన్నీ చేసేస్తుంది.తర్వాత నన్ను చంపుతుంది. మొన్నటికి మొన్న అవినీతి పరులైనా, రౌడీలైనా, దగాకోరులైనా, ఖూనీకోరులైనా ప్రతీ అడ్డమైనవాడికీ రాజ సభలో చోటు ఉంటుంది అని చట్టం తీసుకొచ్చి నా నెత్తికి చుట్టారు. ఇక నా జోక్యం తప్పలేదు.ఇది మొన్న జరిగిందే., అంతకుముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు, ఎన్ని సర్దిపుచ్చలేదు చెప్పండి. ఐనా నేనెన్ని హీరో వేషాలేసినా  జనాల దృష్టిలో మన విలనిజం పోవట్లేదు లెండి...అది వేరే విషయం. సరే ఈ రాజ తంత్రాలన్నీ ఒక ఎత్తు. అరే నేనెప్పటి నుంచో పెళ్ళి చేయండి మొర్రో అని మొత్తుకుంటుంటే నన్ను కానట్టే ఉంటుంది మా అమ్మ. అసలు ఆవిడ ఉద్దేశ్యం ఏమిటో చెప్తే నేను ఇంక ఆ సంగతి ఏమీ అడక్కుండా వేరే దారులేమన్నాచూస్కుంటా కద స్వామీ! ఆ మాత్రం సెన్స్ కూడా లేదా?"

( ఇండైరెక్టుగా ఇప్పుడేమీ లేవని చెప్తున్నావా నాయనా నాకు? పిట్ట కథలు ఇంకెన్ని వినాల్సి వస్తుందో కానీయ్!)
" అవును నాయనా! అవును" 

" అంతేనా స్వామీ! ఇప్పుడు ఈవిడ సృష్టించిన సమస్యలు చూస్తే ఉండగా ఉండగా నా గతి ఏమఒతుందా అని భయంగా ఉంది స్వామీ! రాజ్యంలో ఎక్కడ చూసినా మా మీద కినుక వహించని ప్రజలు లేరంటే నమ్మండి. అసలు మా అమ్మ సిద్ధాంతం చెప్పమంటారా? విభజించి పాలించమంటుంది, మనకి ఎదురు చెప్పని వాళ్ళే అధికార పీఠంలో ఉండాలంటుంది, మన మీద ఎంత బురద ఉన్నా దున్నపోతులా దులిపేసుకోవాలంటుంది. పక్కోడు ఎంత మేధావైనా ఆడ్ని తొక్కేసి, నొక్కేసి అది మనం ఉపయోగించుకోవాలంటుంది. అసలు ఇదంతా మా రాజ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అంటుంది. ఇదంతా తప్పని నేను అనడం లేదు స్వామీ! కానీ..."

"(వార్నీ! ఇదంతా తప్పు కాదా? మరెందుకు నాయనా ఈ గోడు)"  

" కానీ.. ఇదంతా చేయడానికి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది కదా!మీరే చెప్పండి స్వామీ! వాళ్ళేమన్నా వెర్రోళ్ళా? జనాల దగ్గర ఊరికే విలన్లు ఐపోవడానికి?"

( ఇంతకీ ఈయన గారి అంతరార్ధం ఏమిటి చెప్మా?)
అవును నాయనా! నిజమే కానీ మీ అంతరార్ధం ఏమిటో..."

" అదే స్వామీ చెప్తున్నాను. ఖజానా చూస్తే అంతంత మాత్రంగా ఉంది.మేం దోచుకున్నది ఖర్చు పెడదామంటే, ఆ తర్వాత్తర్వాత అడుక్కు తినడానికి కూడా పనికిరాకుండా పోతాం. అందుకని..."

(వారి పిడుగా! నన్నే ఇరికిస్తున్నావూ.. నీ దుంప తెగ!)
"ఆ.. అందుకని..ఏమిటో చెప్పండి యువరాజా?"

" ఆ.. ఏముంది స్వామీ! ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకి వచ్చే విరాళాల కన్నా, స్వామీజీలకు వచ్చే కలెక్షన్లే ఎక్కువ.."

( అందుకని నాకే ఎసరు పెడతావురా కుంకా!)

" అలా అని మీ సంపద కొల్లగొట్టాలని మా అభిమతం కాదు స్వామీ!"

(మరేమిటిట?)

" పార్టీకి విరాళాలు బాగానే వస్తున్నాయి.. కాదనటం లేదు.కానీ ఎవడన్నా విరాళం ఇస్తే ఊరికే ఇవ్వడు కదా!  నీకది- నాకది పద్ధతి ఇక్కడ.."

( ఒకడిది ఒకడు నాక్కునే పరిస్థితి అని చెప్పరాదూ శుంఠా!)

" మరి మన ప్రజలనే వారు అలా కాదే..వాళ్ళలో మన పరపతి పోకుండా ఉండాలంటే వాళ్ళని కూడా కొనుక్కోవాల్సిందే కదా స్వామీ? "

" వాళ్ళేమన్నా వస్తువులా నాయనా కొనుక్కోవడానికి?"  

" మీరు అలా లాజిక్ తీసారనుకోండి, మేము కూడా తీయాల్సి వస్తుంది. ఈ విభూదిలోనూ, తాయెత్తు లోనూ యెంత మహిమ ఉందో మీకూ తెలుసు, మాకూ తెలుసు.."

(అలా వచ్చావా నాయనా? ఇక నువ్ చెప్పేది వినడం తప్ప నేనేం చేయగలనులే)
" అసలు ముందు నీ మనసులో ఉన్న విషయం చెప్పు నాయనా!"

" అదే స్వామీ! ఎలా మొదలు పెడదామా అని... ఇప్పుడూ.. ఈ విరాళాలూ, కుంభకోణాలూ, దోచుకోవాడాలూ, దాదాగిరీలూ అన్నీ పాత పద్ధతులు ఐపోయాయి స్వామీ! నాకెందుకో మన రాజ్య చరిత్రని ఒకసారి తవ్వి తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన్ వచ్చింది స్వామీ!"

( ఏమంటున్నాడబ్బా! నాకంతా అయోమయంగా ఉందేమిటీ? ఇందులో ఏం తిరకాసు పెడుతున్నాడు వీడి దుంపతెగ! మొత్తానికి నన్ను ఇరికించడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు..థూ..నా బతుకు)
" తమరి ఆలోచనలోని అంతరార్ధం నాకు బోధపడలేదు నాయనా!"

" ఇందులో బోధపడ్డానికేముంది స్వామీ! చరిత్రని తవ్వి తీయడమంటే నిధి, నిక్షేపాలని పట్టడం అని.." 


( ఓరి నీ బతుకు బందెల దొడ్డిలో కట్టెయ్యా!ఇదేం ముదనష్ఠపు ఐడియా రా? ఐడియా.. హూ.. నిజంగానే ఇది నా లైఫ్ నే మార్చేసేటట్టుంది. నీ యువరాజాగిరీతో నా స్వామిగిరీకే ఎసరు పెడితివి కదరో నీ... కంట్రోల్.. కంట్రోల్..)

" ఏమిటి స్వామీ! ఆలోచిస్తున్నారు?|"

" అదే నాయనా! ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అని?"

" మీరు ప్రయత్నం, ప్రచారం మొదలుపెట్టండి. దానిని అమలులోకి తెచ్చే బాధ్యత నాది. ఎలా సర్ది చెప్పాలో. ఎలా పక్క దారి పట్టించాలో అదంతా నేను చూసుకుంటా. మీరు మాత్రం మీ కర్తవ్యం నిర్వహించండి. మీ కర్తవ్య నిర్వహణలో తేడాలేమన్నా వస్తే...."

" అమ్మమ్మా! ఎంత మాట నాయనా? ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఈ పాటికి ఒక ప్రభంజనమే మొదలవుతుంది"

" అప్పుడే మీకు ఆలోచన వచ్చినట్టూంది కదూ స్వామీ?"

" రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేమిటి నాయనా"

" ఐతే మరి మాకిక సెలవా స్వామీ!"

" మంచిది నాయనా! త్వరలోనే నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా నాయనా!"

" ప్రణామములు స్వామీ!"

" పాపీ చిరాయువు!"

" స్వామీ!"

" ఆ.. అదే నాయనా! దీర్ఘాయుష్మాన్ భవ!"  


చరిత్ర ఇక ఇప్పుడు పుస్తకాల్లో మాత్రమే చూడాల్సి ఉంటుందేమో.. సారీ చదవాల్సి వస్తుందేమో.. దర్శనీయ స్థలాలు అనేవి కూడా ఇక దేశ పటంలో కనిపించవు. 
ఈ మాట ఎందుకంటున్నానో ఈ పాటికి మీకు అర్ధమైపోయే ఉంటుంది. ఇలా ఎవరికో కలలు, కాకరకాయలు వచ్చాయని వాటిని స్వయంగా ఆర్కియాలజీ వాళ్ళే దగ్గరుండి తవ్వించడం చూస్తుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన కల దేశానికింకేం ఉంటుంది.ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకొకచోట తవ్వేస్తారు. ఉన్నవే ఏవో కొన్ని మచ్చు తునకలు ఉంటే వాటికి కూడా ఏం దుర్గతి పడుతోందో?

ఉత్తరప్రదేశ్ లోని రాజా రావ్ రాం బక్స్ సింగ్ కోటలో జరుగుతున్న తవ్వకాలకి ఇది నా స్పందన.





 




4 comments:

  1. అనంత పద్మనాభ స్వామి ఇష్యూ వేరే !! ఇది వేరే !!

    Most పాపులర్ max ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆశారాం బాపు వంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో చూశారు కదా!! అలాంటిది మరి ఎవరో ఒక అనామక సాధువు స్వప్న సువర్ణ సౌధం ఇలలో అదీ నేలలో ఉందని నమ్మటానికి ఎవ్వరూ వెర్రి వాళ్ళు కాదు !!

    కల లో వచ్చింది ఎప్పుడైనా నిజం అవుతుందా?

    కలలో సాధువు కి రాజు చెప్పినట్టు నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయా? అనే ప్రశ్నలకంటే ముందు

    పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా? సాధువు కు ఇలాంటి కల వస్తుందా? అని ప్రశ్నించు కుంటే

    అయినా కలలు కనేవాడు సాధువు ఎలా అవుతాడు ? పొరపాటున కల వచ్చిన ఏ బ్రహ్మానుభవం కలిగినట్టో , జీవన్ముక్తుడైట్టో రావాలికాని ''బంగారం'' కలలోకి రావటం ఏమిటి? వచ్చిన దానిని బుల్ షట్ అని మరచిపోక జనబాహుళ్యానికి తెలిసేలా బహిరంగ పరచటం ఏమిటి?
    ఒక సాధువు - 1000 టన్నుల బంగారం జాడ ద్వారా లోకానికి మేలు జరుగుతోంది అనుకోవటం భ్రమ kaadaa ?!
    ప్రతీ అంశం లోను sync మిస్ అయ్యిన్ది.

    ఒక వేళ ఆయన అలాంటి ''సాధువు'' కాకుంటే అయన చెప్పిన అంశానికి విలువ ఇవ్వాల్సిన పనిలెదు.
    .....

    కానీ why this బంగారం వెర్రి ? అనే ప్రపంచానికి ఇది ''సాధువు కల'' గా project అయ్యింది ....

    కారణం ఏమై ఉంటుంది?

    కొన్ని పరిస్థితులలో కొన్ని అంశాల నుంచి కొందరి దృష్టి మల్లించటానికో, లేదా ఒక దాని ముసుగులో మరేదేదో చేయటానికో వేసే ఎత్తుగడలలో ఇది ఒకటి అయ్యి ఉంటుందని నా అభిప్రాయం !!

    జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉన్నదో, అది అంతర్గతంగా ఉన్న వాస్తవానికి వక్రీకరణయే !!

    ఒక వేళ సాధువు కల గా చెప్తున్న ఈ ఘటన భవిష్యత్తులో +ve result వస్తే మటుకు మీ ఈ పోస్ట్ అక్షర సత్యమౌతుంది !!

    it is new kind of political business promotion. *(with free publicity)

    ఆర్ఖియాలజీ వాళ్లకు వాళ్ళ reason ఉంది అక్కడి అయస్కాంత తరంగాల తీరు తెన్నులలో తేడా !!

    ఇంతకు ఈ అంశం కి +ve result వస్తే క్రెడిట్ ఎవరి ఖాతా లో చేరుతుంది ??
    కలలో రహస్యం చెప్పిన మహారాజు కా?
    నిస్వార్థం గా ప్రజా హితం కోసం ఆ రహస్యాన్ని బయట పెట్టిన సాధువు కా?
    లేక సాధువు మాటకు విలువనిచ్చి పనులను వేగవంతం చేసిన యవరాజు కా?


    ?!

    ReplyDelete
  2. ఏంటీ ఉరుములేని పిడుగు. ఇంతకాలమేమయితివి బాలా! కుశలమా!! దర్శనీయ స్థలాలు కొత్తగా పుడుతున్నాయి కదు బాలా విచారమేల :)

    ReplyDelete
  3. ముష్కరుల దాడి నుంచి దేశ సంపదని అలా దాచారని ఇప్పటికీ చాలా చారిత్రిక ఆధారాలు వున్నాయి కదా, ఆ సంపదని అలాగీ దాస్తే మనకు ఒరిగేది ఏమీ వుండదు, ఇక్కడ కల ఆధారంగా తవ్వకాలు చేపట్టడం విచారించదగ్గ విషయమే, అయితే ఇప్పుడున్న టెక్నాలజీ వనరులను ఉపయోగించుకొని పురావస్తు, చారిత్రిక కట్టడాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఆ తవ్వకాలు చేపడితే సంతోషమే :)

    ReplyDelete
  4. కడలి చాలా రోజులకి కనిపించారు కుశలమేనా....

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !