" చెట్టుకి ప్రాణం పోసి బతికించండి. చెట్టుని బతకనివ్వండి " అన్న నినాదంతో ఇరవై స్కూళ్ళని ప్లాస్టిక్ రహితంగా చేసి, లక్షా ఇరవై వేల మొక్కలు నాటడానికి కారణం అయ్యాడు ఒక వ్యక్తి. వాటిలో ఎనభై వేల మొక్కలు బతికి చక్కగా ఏపుగా పెరిగి పళ్ళూ, పువ్వులూ ఇచ్చి వాతావరణంలో సమతౌల్యాన్ని తీసుకొచ్చాయి.
ఈ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, బంగారు పళ్ళెంలో భోజనం చేసే కోట్లాధిపతి కాదు, స్వంత విమానాలు కల పారిశ్రామికవేత్త కాదు. ఒక మామూలు బస్ డ్రైవర్.
వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదం కార్యాచరణలో పెట్టి, స్కూలు పిల్లల్లో పర్యావరణ రక్షణ పట్ల అవగాహన కలిగించడానికి ఆ బస్ డ్రైవర్ ఇరవై వేల,నాలుగు వందల మంది స్కూలు పిల్లలని చెట్లు పెంచి, కాపాడే కార్యక్రమంలో నిమగ్నమయ్యేటట్ట్లు చేసాడు.
అతనే యోగనాథన్ అతనికి బాల్యం నుంచీ మొక్కలు పెంపకం అంటే శ్రద్ధ,పిచ్చి. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే స్కూలు ఆవరణలో ఎర్రతంగేడు మొక్క నాటి పోషించాడు. ఈనాడు అది ఎర్రని పూలతో " ఫ్లేం ఆఫ్ థి ఫారెస్ట్ " గా చూసేవారిని కట్టి పడేస్తోంది.
తన స్వంత డబ్బుతో చిన్న చిన్న మొక్కలు కొనుక్కుని, స్కూళ్ళకి వెళ్ళి, పిల్లలకి మొక్కల పెంపకం మీద మక్కువ కలగడానికి,స్లైడ్సు వేసి,ఫిల్ములు చూపించి, వాళ్ళని ఉత్సాహ పరిచి,దగ్గర ఉండి,స్వయంగా పిల్లల చేత మొక్కలు నాటించి,సెల్ ఫోన్ ద్వారా వాటికి ఎల ఎప్పుడు నీళ్ళు పొయ్యాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.మధ్య మధ్య ఎలా ఉన్నాయో పర్యవేక్షిస్తుంటాడు.
యోగనాథన్ తీసిన ఫిల్మ్ కి, పర్యావరణ పరిరక్షణవారు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి ఢిల్లీలో అవార్డు ఇవ్వబోతున్నారు. నలభై రెండేళ్ళ యోగనాథన్ సేవని, పర్యావరణ పరిరక్షణ కోసం అతను పడిన తాపత్రయాన్ని, టి.వి.ఛానల్స్ లో ఐదు రోజుల పాటూ ప్రదర్శించారు.
ప్రథమ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళే ముందు అతని స్నేహితులు రెండు కొత్త చొక్కాలు కుట్టించి ఇవ్వబోతే, కొత్త చొక్కాలు వద్దు వాటికి అయ్యే డబ్బుతో మొక్కలు కొని స్కూళ్ళలో నాటిద్దాము అన్న ఈ వృక్ష ప్రేమికుడి లాంటివారు ఊరూరా ఉంటే సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అవుతుంది మన దేశం____మాలతీ చందూర్.
సౌజన్యం: స్వాతి పత్రిక.
ఈ సందర్భంలో అతనికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం.రండి మనం కూడా అతని బాటలో పయనిద్దాం.
నరజాతి మనుగడకు ఆధారం చెట్లు..
నాటండీ వేలవేలుగా నేల ఈనినట్లు..అని అందరం మన వంతు కృషి చేద్దాం.
మంచి విషయాన్ని తీసుకుని వచ్చారు! ఈ చిత్రం బాగా నచ్చింది! వన సంరక్షణే మన సంరక్షణ అన్నట్టుగా ఉంది!
ReplyDeleteఇలాంటి విషయాలు విన్నప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. నిరాశావాదం బదులు ఇలాంటివి పంచుకుంటే మనసు వెలుగు వైపు చూస్తుందేమో..
ReplyDeleteinspiring post thank u Subha gaaru...
ReplyDeleteఇలాంటి వారే నిజమైన జాతిరత్నాలు , స్పూర్తిప్రదాతలు . ఈ టపా ద్వారా ఇలాంటి వారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. అలోచిస్తుంటే అనిపిస్తోంది , భూమి మీద ఉన్న 700 కోట్ల జనాభా , సంవత్సరానికి ఒక్క మొక్క నాటినా చాలు భూమి పచ్చగా కలకాలం ఉంటుంది .
ReplyDeleteIf country is progressing, it is not because of the hyped publicities and full-page advertisements of the political leaders. It is because of crores of silent workers like him going their way without concern for fame or favour. Thanks for sharing this on your blog.
ReplyDelete