Search This Blog

Wednesday, November 9, 2011

గెలుపొందిన సంఘర్షణ


 హాయ్ ఇప్పుడేనా రావడం?

 అవును

 ఏంటి డల్ గా ఉన్నావు?

హ్మ్...(నిట్టూర్పు) ఏం లేదు

చెప్పేసావా?

ఏంటి?

ఏం చెప్పాలనుకున్నావో అది

ఎలా చెప్పమంటావు?

ఏం?

తన మనసులో నేనున్నానో లేదో తెలియకుండా ఎలా చెప్పాలి?

తన మనసులో నువ్వున్నావన్న సంగతి తెలిస్తే ఇంక చెప్పడం దేనికి?

పోనీ తన మనసులో వేరే వాళ్ళెవరన్నా ఉన్నారేమో?!

అది నువ్వు అడిగితే కదా తెలిసేది.

అదే ఎలా అడగను. నా వల్ల కావట్లేదు.

కానీ ఆలస్యమయ్యేకొద్దీ నీలో సంఘర్షణ తప్ప ఇంకేమీ ఉండదేమో?

అడుగుతాను. ఒకవేళ తన మనసులో ఎవరూ లేరంటే పర్వాలేదు. కానీ...

కానీ ? ?

నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తాను, తరువాత కాదంటే ? ?

ఏమవుతుంది? !

ఏమౌతుందా? ఇది మనసు. పనికిరాని వస్తువేమీ కాదు..

నిజమా? కొత్త విషయం తెలుసుకుంటున్నాను. 

వేళాకోళం వద్దు. అదీ ఈ సమయంలో..తను కాదంటే ఏమవుతుందో నాకు ఊహించుకోవడానికే భయమేస్తోంది.

ఐతే ఊహించుకోకు..

చెప్పానా వేళాకోళం వద్దు అని.

సరే ఐతే..మరి ఇప్పుడు ఏం చేస్తావూ?

నాకు చెప్పాలని లేదు. ఇలాగే ఉంటాను. చెప్పవలిసిన అవసరం మాత్రం ఏముంది?

అలాంటప్పుడు ఈ ప్రేమించడం మాత్రం ఎందుకు?

చెప్పలేకపోతే ప్రేమించకూడదా?!

మూగ ఆరాధనా?!... బాగానే ఉంటుంది.ఐనా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అసలెందుకు చెప్పవు? తను కాదంటే ఏమవుతుంది? పిచ్చిదానివైపోతావా?

అనే అనిపిస్తోంది..

ఇప్పుడు మాత్రం అలా  లేవనా నీ ఉద్దేశ్యం?

అంటే ప్రేమించడం పిచ్చితనమా?!

కాదు ప్రేమించి చెప్పకపోవడం పిచ్చితనం. చెప్పిన తరువాత ఏమవౌతుందో అని భయపడడం పిచ్చితనం. అసలు ఇలా ఆలోచించడమే పిచ్చితనం.

నాది భయమా?

కాదా??

కాదు..

మరి ఏమిటి?!

ఏమో నాకు తెలియదు.

తెలియదూ?!

తెలియదు.నిజంగా తెలియదు..

తెలుసు. నీకు అంతా తెలుసు. నీకు ఒక్కటే భయం. తనతో చెప్తే, తను కాదంటే ప్రేమలో ఓడిపోతావని భయం. ఆ తిరస్కారం భరించలేకపోతావని భయం..అంతేనా?

.........

మాట్లాడు..ఒప్పుకోవడానికి ధైర్యం చాలటం లేదు కదూ?!

.......

అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమలో గెలవడం ఏమిటి,ఓడిపోవడం ఏమిటి? ఇదేమీ తెలియక కేవలం చెప్తే ఏమౌతుందోనన్న భయంతో గడిపేస్తున్నావు కదూ? 
అసలు నువ్వన్నది ఏమిటో తనకి తెలియకుండా నువ్వే నీ చేతులారా చేస్కుంటున్నావు. ఒకవేళ తను కాదంటే నీ ప్రేమ ప్రేమ కాకుండా పోతుందా?!
పిచ్చిదానా! ప్రేమించావు చూడూ! ఆ ప్రేమించడమే గెలుపంటే. ఇక ఇందులో ఓడిపోవడానికి అవకాశమేది?
నీ ప్రేమ నిజమైనదే ఐతే తప్పక ఫలిస్తుంది అని నేను చెప్పను. కానీ ఆ ప్రేమలో జీవించడం నేర్చుకుంటావు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
ప్రేమంటే ఇవ్వడమే కాదు,పుచ్చుకోవడం కూడా.. ఆ పుచ్చుకోవడం తిరిగి ప్రేమే కావచ్చు,తిరస్కారం కావచ్చు లేదా ద్వేషం కావచ్చు. ఏదైనా కానీ నువ్వు అంగీకరిస్తావు.అదే ప్రేమించడంలోని గొప్పతనం. అదే ప్రేమించడంలోని ఔన్నత్యం. 
ప్రేమను ప్రేమగానే ప్రేమించు.ప్రతిఫలం దక్కితే సంతోషించు. దక్కకపోతే ఇంకా ప్రేమించడం నేర్చుకో.నువ్వు నేర్చుకోవలిసిన పని కూడా లేదు. ప్రేమించడంలోనే అదంతా అలవడిపోతుంది. ప్రేమకి ప్రేమించడం ఒక్కటే తెలుస్తుంది. దానికింకేమీ తెలియదు. తెలిసినా పట్టించుకోదు. 
ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్పది అంటారు. నిజమే కానీ అసలు నువ్వు ప్రేమించడం అన్నది లేకుండా నిన్ను అవతలివాళ్ళు ప్రేమిస్తారని ఎలా అనుకోవడం? 
ప్రేమని ప్రేమించు...తిరిగి ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది...ఎప్పటికైనా...ఇది తెలుసుకుంటే ఈ ఓడిపోవడం,గెలవడం ఈ మాటలకి అర్ధాలూ ఉండవు,నానార్ధాలూ ఉండవు. 

వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా.. అన్న కవి మాటలు చిరస్మరణీయం..

.............

మళ్ళీ ఎక్కడికీ వెళ్తున్నావు?

ఒక్క క్షణం..ఇప్పుడే వస్తాను..

అదే ఎక్కడికీ అంటున్నాను. 

ప్రేమలో మునిగి 'తేల 'డానికి...  


********
17 comments:

 1. సంగ్దిదం లోనే సగం రోజులు గడిచిపోతాయి కదూ. మొత్తానికి సందేహాలను పటాపంచలు చేసే ధైర్యం చెప్పారు. తరువాత ఏమైనా గొప్ప రిలీఫ్. ఆ ప్రేమలో మునిగితేలే బొమ్మ చాలా బావుంది శుభా..

  ReplyDelete
 2. మీ బొమ్మలూ,రాసిన కవితలు చాలా బావున్నాయి శుభగారూ

  ReplyDelete
 3. బాగుంది చక్కగా చెప్పారు కాని ఈ కాలంలో ఏదో ఒక అవసరానికి జనాలు వేసే అందమయిన ముసుగు ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు చెప్పక్కర్లేదు అన్నది నా అభిప్రాయం. అది వాళ్ళ వాళ్ళ మాటల్లో, చేతల్లో, చూపుల్లో నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది. మన కన్న తల్లికి మనం కాని ఆవిడ మనకి కాని ఐ లవ్ యు అన్న పదం చెప్పక్కర్లేదేమో కదా! మీ బొమ్మ సూపెర్ ఆ మధ్యలో ఉన్న పువ్వులు నాకు ఇవ్వరాదూ!

  ReplyDelete
 4. రసజ్ఞ గారూ , ఆ మధ్యలో ఉన్నవి పువ్వులు కాదు పాదాలనుకుంటాను తలకిందులుగా మనిషి లోపల యిరుక్కుపోయి , పైకి రావాలని పాదాలను అటూ యిటూ కదిలిస్తూన్నట్టు లేదూ - ప్రేమలో మునిగి ' తేల ' డానికంటూ రాసిన దాన్ని సింబాలిక్ గా అలా సూచించారేమో ' చిత్ర లేఖిని ' గారు !!!

  ReplyDelete
 5. @ గీతిక గారూ, లత గారూ నా బ్లాగుకి స్వాగతం. మీ వ్యాఖ్యలకి కి ధన్యవాదాలండీ.

  ReplyDelete
 6. @ జ్యోతి గారూ నిజమే..అందుకే చిన్న ప్రయత్నం.

  ReplyDelete
 7. @ రసజ్ఞ గారూ.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి. అందమైన ముసుగు నిజమే..కొంతమందికి ఆ మాటలు, చేతలు, చూపులు అర్ధం కాకపోవచ్చు. అలాగే అమ్మా,నాన్నలకి మన ప్రేమను వ్యక్తం చేసే అవసరం ఎప్పుడూ ఉండదు.. మీరన్నట్టు ఆ చూపులూ అవీ ఇక్కడ బాగా తెలుస్తాయి.ఆ ప్రేమను మనం చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా ప్రేమే అని నా ఉద్దేశ్యం. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కూడా తమ ప్రేమని కోల్పోతున్నారనిపిస్తుంది. అమ్మా, నాన్నల ఆఫీసు గొడవల్లోనో,సంపాదన మీద ఉన్న శ్రద్ధ లోనో పడి. కాని ఇక్కడ ఇదంతా పిల్లల కోసమే అనుకోండి. ఏదేమైనా ఇక్కడ తల్లితండ్రుల ప్రేమ ను గురించి కాదు.. ఈ రోజుల్లో ప్రేమ గురించి యువత ఎలా ఆలోచిస్తున్నామో అన్న దానికి ఒక చిన్న ఆశా భావంతో చేసిన కల్పన.. అంతే.. ఇక్కడ నేనెవరికీ సందేశాలు ఇవ్వడంలేదు.చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనసుని బట్టి ఉంటుంది ఏదైనా..గమనించగలరు.

  ReplyDelete
 8. @ dr గారూ..నిజమేనేమోనండీ.. మనం ఎలా ఆలోచిస్తే అలానే కనపడుతుంది. ఏమంటారూ? :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

  ReplyDelete
 9. "వలచుట తెలిసిన నా మనసునకు
  మరచుట మాత్రం తెలియనిదా
  మనసిచ్చినదే నిజమైతే
  మన్నించుటయే ఋజువు కదా"
  ప్రేమికులందరూ ఇంత మెచ్యూర్డ్ గా ఉంటే సినిమాలు ఎలా అండీ.???!!(సరదాగా)
  సీరియస్ గా చాలా బాగుంది మీ పోస్టు
  ennela

  ReplyDelete
 10. హ హ హ ఎన్నెల గారూ బాగా చెప్పారు..నిజమేనండోయ్.అవిడియా అదుర్సు.ధన్యవాదాలు.

  ReplyDelete
 11. @సుభ గారు
  మనసును మబ్య పెట్టి పూచేలా చేసేసారు ఇది ఏమైనా ధర్మమా చెప్పండి. ఇంతకు మీ కధ చదివి ఆ హృదయం ఏమైనా తన ప్రేమను వ్యక్త పరుస్తోందోమో మరి. ప్రేమను రెండు మనసుల సంభాషనగా ఎంతో బాగా వివరించారు. అవునండి ప్రేమించడమే ఒక గొప్ప విజయం దానిని తెలిపిన తెలుపకున్నా అది అనంతం.

  నేను రాసిన పాటలోని కొన్ని వాక్యాలను పంచుకుందాం అనుకుంటున్నా ఇది చదివాక

  జాబిలమ్మ చందమామ ఏకమై ఉంటారు
  మనసు లేకనే వారికి మనసు లేకనే
  వయసు మీద ఇద్దరం మనసుతో ఉన్నాము
  ప్రేమ లేకనే మనలో ప్రేమ లేకనే

  మనసు మాత్రం ఉంటే సరిపోదు ప్రేమని కూడా నింపాలి అందులో.

  ReplyDelete
 12. @ కల్యాణ్ గారూ బాగుంది మీ పాట. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

  ReplyDelete
 13. "ప్రేమను ప్రేమగానే ప్రేమించు.ప్రతిఫలం దక్కితే సంతోషించు. దక్కకపోతే ఇంకా ప్రేమించు"

  ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. అలాగే ప్రేమిచే మనసున్న ప్రతీఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం.

  రసఙ్ఞ గారూ,
  మొదటిసారి మీతో విభేదిస్తున్నాను. మనం ప్రేమించేది ప్రాణం ఉన్న ఒక జీవిని. అసలు చెప్పలేని ధైర్యం లేనివారు ప్రేమించటం అనవసరం అని నా అభిప్రాయం. ప్రేమించినప్పుడు మనం ప్రేమించిన వ్యక్తికి చెప్పాల్సిందే స్పందనను గురించి పట్టించుకోకుండా. అలాగే అవతలి వ్యక్తికీ ఉద్వేగాలుంటాయిని ప్రేమించేవారు గుర్తుంచుకుంటే అసలు సమస్యే ఉండదు. మన హావభావాలద్వారా ఎంత ప్రేమను కురిపించినా 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని మనం చెప్పే ఒక్కమాట అవతలి వ్యక్తికి మనపై ప్రేముంటే రెట్టింపు అవుతుంది అప్పటికి ప్రేమ లేకుంటే మనపై ఒక సానుకూల భావన పుడుతుంది. ఎందుకంటే ప్రేమించబడటం గొప్ప వరం.

  ReplyDelete
 14. ఆచంగ గారూ నా బ్లాగుకి స్వాగతం. అలాగే మీ స్పందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 15. మీరు ప్రేమ ను గురించి రాసిన అభిప్రాయం చదివిన తరువాత నాకు software కంపేనిలో year end PMP 360డిగ్రి feedback గుర్తొచ్చింది. Feedback లో అందరు మన పనితీరును మెచ్చుకొంటే మంచిదే, feedback బాగా లేకపోతే అది జీతాన్ని తగ్గించదు కనుక పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు.అలాగే ప్రేమ ఓడీనా గెలిచినా బాధ పడనవసరం లేదు. విన్ విన్ సిట్యువేషన్ అని చెప్పటం బాగుంది.

  నిక్కి ఇంద్రసేన

  ReplyDelete
 16. నిక్కి గారూ..బాగుంది మీ థియరీ. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే అంతే కదండీ మరి. మర్చేపోయాను నా బ్లాగుకి స్వాగతం అండీ. మీ స్పందనకి ధన్యవాదాలు కూడా.

  ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !