Search This Blog

Monday, September 19, 2011

వార్ధక్యం లేని మనసు...

జీవితం ఒక నది లాంటిది. నిరంతరం కదిలిపోతూ, అన్వేషిస్తూ, పరిశోధిస్తూ, ముందుకు త్రోసుకునిపోతూ, గట్లు పొర్లి పారుతూ,ఎక్కడ సందున్నా జొరబడుతూ, నీళ్ళతో నింపుతూ ప్రవహిస్తుంటుంది.
కాని చూసారా, మన మనస్సు తానా విధంగా అంటె నది వలె వుండడం నచ్చదు. శాశ్వతము, స్థిరము, కానట్టి ఏ విధమైన భద్రతా లేనట్టి స్థితిలో జీవించడమంటే మనస్సుకు చాలా ప్రమాదకరంగా తోస్తుంది. అందువల్ల తన చుట్టూ తనొక గోడను నిర్మించుకుంటుంది. అదే సంప్రదాయమనే గోడ. వ్యవస్థీకృతమనే గోడ. సాంఘిక, రాజకీయ సిద్ధాతములనే గోడ.  
కుటుంబం, పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, అలవరుచుకున్న కొన్ని సద్గుణములు, ఇవన్నీ జీవితానికి దూరంగా, ఆ గోడలలో చేరి ఉంటాయి. కాని జీవితమో- కదిలిపోతూ ఉంటుంది. అది శాశ్వతంగా ఒకే చోట అట్లే నిలిచి ఉండదు. అది ఈ గోడ లోనికి ప్రవేశించి, వాటిని కూలద్రోయదం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఆ గోడల వెనుక గందరగోళం, కలవరపాటు, దైన్యం రాజ్యం చేస్తూనే ఉంటాయి. అక్కడి దేవతలు దొంగ దేవతలు. వారి శాస్త్ర గ్రంధాలు, వేదాంతం అర్ధం లేనిది.  
జీవితం వీటన్నిటికంటే అతీతం. ఐతే అటువంటి  అడ్డు గోడలు లేని మనస్సుకు, తానార్జించి కూడబెట్టుకున్న విషయాల చేత, తన జ్ణాన వైదుష్యాల భారం చేత కృంగిపోని మనస్సుకు, కాలానికి అతీతంగా ఉంటూ, తనకు భద్రతను కోరుకోకుండా జీవించే మనస్సునకు జీవితమనేది ఒక అద్భుతమైన
విషయంగా  తోస్తుంది. అసలా మనస్సే జీవితం.
మనస్సు తప్ప జీవితానికి వేరే నీడ లేదు. కాని మనసులో చాలా మందికి నీడ కావాలి, విడిది కావాలి. అది ఒక చిన్న ఇల్లో. పేరు ప్రతిష్టలో, పదవులో ఏదయినా కావచ్చు . అందువల్ల మనకివన్నీ ముఖ్యమైనవిగా తోస్తాయి.
మనం స్థిరంగా, శాశ్వతంగా ఉండటం కోరతాం. దానికనుకూలమైన సంస్కృతినే  అభివృద్దిపరుస్తాం. అందుకోసం దేవతల్ని సృష్టిస్తాం. కాని నిజానికి వారు దేవతలు కానే కారు. వారు మన కోరికలకు మారు రూపాలు- అంత మాత్రమే.
పూర్తిగా జీవిత ప్రవాహంతో పాటే కదులుతూ, కాలగమనంతో సంబంధం లేకుండా, ముందు ముందుకు త్రోసుకుపోతూ, అన్వేషణ గావిస్తూ, భగ్గుమని ప్రజ్వరిల్లుతూ, బ్రద్దలవుతూ ఉండే విశ్రాంతి లేని మనస్సు మాత్రమే ఆనందానికి నిలయమౌతుంది.
అటువంటి మనస్సు సృజనాత్మకము కాబట్టి అది నిత్య నూతనం. దానికి వార్ధక్యమనేది రాదు. _ జిడ్డు కృష్ణమూర్తి. 

సంగ్రహణము : స్వాతి  సపరివార పత్రిక.      

2 comments:

  1. ఈ రోజే చూసాను మీ బ్లాగ్ నెమ్మదిగా మొత్తం చదివి కామెంట్స్ పెడతాను.

    ReplyDelete
  2. thx andi. and welcome 2 my blog

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !