Search This Blog

Thursday, January 5, 2012

అడగాలని ఉన్నా అడగలేను..!



తను అనుకుని ఉండదు నువ్విలా చేస్తావని..
నువ్వు లేకున్నా
బ్రతకడం నేర్చుకుంది ఎలాగో జీవఛ్ఛవంలా.,
నాకు బాధంటే ఏమిటో తెలియకుండా చేసింది
తను మాత్రం తీరని వేదనను అనుభవించింది
నాకు తనని అడగడం రాదు.,ఎందుకంటే..
బాధను భరిస్తూనే నాకు జన్మనిచ్చింది
గుండెలోని ఉప్పెనను గుప్పెటలో అదిమిపట్టి
పెదవుల్లో మాత్రం చెరగని చిరునవ్వు నింపుకుని
నాకు పూలబాట పరచిన జీవితాన్నిచ్చింది.,
ఊహ తెలియకముందు నాకు తెలియదు
తెలిసిన తర్వాత తెలిసింది నువ్వంటే ఏమిటో
లోకులు కాకులై అరుస్తుంటే.,
అదే సమయంలో నువ్వంటే
పెరిగిన ఏహ్యభావం చిగురులు తొడగటం మొదలుపెట్టింది..
నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం 
నేర్పించని తన వల్ల అది మొగ్గ వరకు కూడా ఎదగలేదు.,
నాకు నిన్ను అలా పిలవాలని ఎప్పుడూ అనిపించలేదు
ఏ మూలో ఇంకా నాలో ఆ చివురుల తాలూకు 
ఆనవాలు మిగిలిపోయుంటుంది..
నాకు జన్మనివ్వడంలో నీ ప్రాధాన్యత ఎంతో ఉంది
అందుకే ఆ ఛాయలు అప్పుడప్పుడూ నాలో 
నీకు గౌరవం ఇవ్వడంలో ప్రస్ఫుటమౌతుంటుంది..
నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వదిలిపెట్టి
నీ దారి నువ్వు చూసుకున్నప్పుడే 
అర్ధం అయింది నాకు, నీకు "నాన్న" అంటే అర్ధం తెలియదని 
నిన్ను అడగాలనే ఉంటుంది నాకు ఎందుకిలా చేసావు అని
కాని అది వ్యర్ధం అని తెలిసి
తిరిగి అమ్మలోనే నాన్నను నింపుకుంటున్నా..! 



ఏ తోడూ లేకున్నా,ఎవరి సహకారం లేకున్నా, లోకులు కాకులై పొడుస్తున్నా లెక్క చేయక తమ రెక్కల కష్టంతో తమ పిల్లల్ని పెంచి, పోషించి వాళ్ళని ఒక మంచి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే ఎంతో మంది  తల్లులకు ఇలా వందనాలు అర్పించుకుంటున్నాను... 

23 comments:

  1. సుభ గారు అమ్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే!
    అందులోనూ ఎలాంటి అసాధారణమైన పరిస్థితుల్లోనైనా
    బిడ్డల్ని కాపాడుకునే అమ్మల ఔన్నత్యాన్ని
    గురించి చాలా గొప్పగా చెప్పారు..

    ReplyDelete
  2. మీ చిత్రం గురించి చెప్పటం మరచిపోయాను.
    బొమ్మలో ఈలోకం గురించి మాకెందుకు అన్నంత గుండె నిబ్బరంతో అమ్మ, అమ్మ గుండెలో నిశ్చింతగా నవ్వుతూ వున్న బాబు ఇద్దరూ బాగున్నారు!

    ReplyDelete
  3. బొమ్మ పెన్సిల్‌తోనే వేశారా? బాగుంది.

    ReplyDelete
  4. అమ్మ. స్త్రీ. శక్తి స్వరూపిణి. సర్వాంత్ర్యామి. ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగుంది చాలా ఆలస్యంగా చూసా, మంచిపోస్టు

    ReplyDelete
  5. అద్భుతం అండి బాగా వ్రాశారు...

    ReplyDelete
  6. యెంత చక్కని భావాల కూర్పు....బాగా వ్రాశారు...అంకితం కూడా బాగుంది

    ReplyDelete
  7. @ రాజీ గారూ బొమ్మని ఎంత చక్కగా వర్ణించారండి... నిజమే అండీ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.ధన్యవాదాలు.

    @ ధన్యవాదాలు raf raafsun భాయీ

    @ ప్రవీణ్ గారూ అవునండీ.. ధన్యవాదాలు.

    ReplyDelete
  8. @ kastephale: తాత గారూ.. అమ్మ శక్తి స్వరూపిణియే కాదు సహనానికి మారు పేరు అని మీ బ్లాగులోనే చదివాను.. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

    @ తెలుగు పాటలు గారూ ధన్యవాదాలండీ..

    @ శశి కళ గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  9. తన రెక్కలపై మోస్తూ బిడ్డలని అత్యున్నత శిఖరాలకి చేర్చే వాహకం అమ్మ.అందలం పై అమ్మని చేర్చే అవగాహన బిడ్డలకి రాకున్నా,లేకున్నా.. అమ్మ అమ్మే కదా!

    అమ్మ గురించి ఇంత గొప్పగా చెప్పాక ఇక మాటలుంటాయా ?

    ReplyDelete
  10. బాగా వ్రాశారు...

    ReplyDelete
  11. సుభా బొమ్మ చాలా చక్కగా ఉంది..ఎంత బావుందో రాజిగారు మాటల్లో చెప్పేశారు..అమ్మ ఔన్నత్యం గురించి, ధైర్యం గురించి నీవైన పదాలలో భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేశావు..అంకితం అర్ధవంతంగా ఉంది...

    ReplyDelete
  12. @ వనజ వనమాలి గారూ అందలం పై అమ్మని చేర్చే అవగాహన బిడ్డలకి రాకున్నా,లేకున్నా.. అమ్మ అమ్మే కదా!
    అమెని మనం అందలం ఎక్కించకున్నా అమ్మ అమ్మే., మనం విదిలించి పారేసినా అమ్మ అమ్మే,తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలేసినా అమ్మ అమ్మే., ఎంతలా తీసి పారేసినా మనల్ని మాత్రం తను అలా చేయదు. మాటలు లేవు అంటూనే రెండు మాటల్లో ఎంతో చక్కగా చెప్పేసారు. ధన్యవాదాలండీ.

    @'Padmarpita' గారూ ధన్యవాదాలండీ..

    @ జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ.. అమ్మ ఔన్నత్యం గురించి, ధైర్యం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి మిగిలి ఉంటూనే ఉంటాయండి..

    ReplyDelete
  13. సుభ గారూ!
    అమ్మలోనే నాన్న ను నింపుకుంటున్నా...అంటూ ఓ పసి హృదయం వేదనా, అలాంటి మాతృమూర్తిపైన ఉన్న ప్రేమా కవితలో ప్రతి పంక్తి లోనూ మూర్తీభవించింది...
    ఇకపోతే బొమ్మ: ఆ ప్రేమ స్పర్శ పాప, తల్లీ కనురెప్పల్లోనూ, వారిద్దరి స్పర్శలోనూ ప్రస్ఫుటంగా చూపించారు...
    చాలా బాగుంది.

    ReplyDelete
  14. తల్లులు ఎంతటి బాధనయినా తట్టుకునేది మర్చిపోయేది కేవలం పిల్లల ఎదుగుదల, ఆనందం చూసే! చాలా బాగా చెప్పారు. మాటలు లేవు ఈ టపాకి!

    ReplyDelete
  15. భావం అసామాన్యం. బొమ్మ అతీతం. ఇంత బాగా బొమ్మలేయటం ఎక్కడ నేర్చుకున్నారండి.

    ReplyDelete
  16. చిత్రం లోనే మీ భావాలన్నీ చెప్పేసారు . బాగుంది .

    ReplyDelete
  17. సుభ గారు,

    'పెన్సిల్లు' బాగా చెక్కారు !

    జిలేబి.

    ReplyDelete
  18. @సుభ గారు

    అమ్మ అనే ఈ రెండక్షరాలకు వేయి నామాల జపము కోటి యుగాలా తప్పోబలము కూడా సాటిరాదు . మీరు ఇచ్చిన రూపము బిడ్డకు అన్ని తానై తన కురులతో గాలిని అందిస్తూ , ఎదనే ఊయల చేసి, చేతులతో తన బిడ్డకు ఓ విశాలమైన భవిష్యత్తును అందించినట్టు ఉంది, ఎంతో సుఖంగా ఇక ఈ స్థలము కంటే మించిన స్వర్గము లేదు అన్నట్టు ఉంది అ పాపడి నిదుర... మీ అమ్మ కూడా ఇలానే ఉండుంటారు అ తల్లిని కచ్చితంగా కలిసి తీరాలి ....

    ReplyDelete
  19. @ "చిన్ని ఆశ" : చిట్టి పండు గారూ ధన్యవాదాలండీ.. మీ లాంటి చిత్రకారుల ప్రోత్సాహం ఉంది. అంతే చాలు. చిత్రం మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

    @ రసజ్ఞ : రసగుల్లా మాటల్లేవంటూనే అమ్మ ఔన్నత్యం ఒక్క ముక్కలో చెప్పేసారు. ధన్యవాదాలు.

    @ జయ: జయ గారూ బోలెడు థాంకులండీ.. నాకింకా సరిగా రావట్లేదనే నా బాధ. ఇంకా బాగా వెయ్యాలనుంటుంది.మీ అభిమానానికి మాత్రం ధన్యురాలిని.

    ReplyDelete
  20. @ మాలా కుమార్ : మాలా కుమార్ గారూ ధన్యవాదాలండీ..

    @ Zilebi: జిలేబీ గారూ మీ ఆశీర్వాదం అంతా..

    @ kalyan: కళ్యాణ్ గారూ చాలా చక్కని వర్ణన అండీ.. మా అమ్మే ఏంటండీ సృష్టిలో ప్రతి తల్లీ అలానే ఉంటుంది నాకు తెలిసి.

    ReplyDelete
  21. chala bagumdi andi, mee visleshaNa

    ReplyDelete
  22. ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలండి మీకు.

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !