గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!
తూరుపు తెలవారుతున్నా
మనసుకేది వేకువ అంటూ
విడిచిన ఆ నిట్టూర్పులలో
జాలువారు కన్నీటిలో
కుసుమించిన కిరణమై నేస్తమా!
ఓదార్పువు నువ్వే స్నేహమా!
చినబోయిన పెదవులపైన
చిన్ని నవ్వు చూడాలని
ప్రతి పువ్వును కుశలమడుగుతూ
కమ్మని ఆ మధువులు తెచ్చి
తేనె చినుకు నువ్వై నేస్తమా!
పలకరించు నవ్వువు స్నేహమా!
గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!


