Search This Blog

Showing posts with label నా పాటలు. Show all posts
Showing posts with label నా పాటలు. Show all posts

Sunday, December 28, 2014

Madilo Edo Edo (మదిలో ఏదో ఏదో)



మదిలో ఏదో ఏదో 
అలజడి మొదలయ్యింది
కనులను కలిసిన కల ఏదో
నీ కబురే తెలిపింది

నిను చూసిన ఆ క్షణమే
నను మరిచే మరి మనసే
నిను కలిసిన ప్రతి కలలో 
కలిగిందీ కలవరమే


ఆశలు ఆకాశపు అంచులు తాకి ఎగసినవో
ఆమని ఆనందపు చిగురులు తొడిగి మురిసినదో
వయసుకు తొలిసారి గుండెలో చప్పుడు తెలిసినదో
వేకువ తలపుల్లో వలపుకు తలుపును తెరిచినదో
ఏమో ఏమైందో
నా ఊహ నిన్ను చేరే వేళ

మనసుల తోటల్లో నీ రాకే తుమ్మెద పిలుపో
విరిసిన పువ్వుల్లో నీ నవ్వే తేనెల చినుకో
అడుగులు నీ వైపే పదపదమంటూ తరిమినవో
అలుపన్నది లేని తలపుకు నీవే ఎద సడివో
ఏమో ఏమౌనో
నా ఊపిరే నువు రాకుంటే

మదిలో ఏదో ఏదో 
అలజడి మొదలయ్యింది
కనులను కలిసిన కల ఏదో
నీ కబురే తెలిపింది

Sunday, April 7, 2013

స్వరాల వీణ మీటి..



పల్లవి:
స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా
 

చరణం :
ఏ చిలిపి ఊహో ఉప్పొంగి నాలో
వసంతమాడే వనాలలోన
వయారి ప్రాయం వరించినాక
మరులెన్నొ పూచే మనస్సులోన
ఈ సందె వేళ లోన
ఈ చిలిపి చిందులోన
చిన్నారి కోయిలమ్మ కుహుకుహూల పాట కానా

 

చరణం :
హరివిల్లి వంగీ నా సిగ్గు తుంచీ
నా లేత పెదవే ముద్దాడుతుంటే
నా చెంపపైనే చిటికేసిపోయే
వరాల పిలుపై చిగురంత చినుకే
ఆ ముద్దుగుమ్మ నేనై
ఆ సొగసు రెమ్మ నేనై
వర్ణాల వానలోన తడిసి తడిసి మురిసిపోనా

స్వరాల వీణ మీటి
పదాలు పాడనా
సుమాల తోట లోన
సరాగ మాడనా
ఆ నింగి దారిలోన
ఆ చందమామ చెంత
అల్లారు ముద్దు ముద్దు వెన్నెలంత చల్లుకోనా

Sunday, November 18, 2012

మనసే పాడినది...



                                                                                                                                                            

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది


నీలాకాశపు పందిరి కింద
చక్కని చుక్కల పానుపు పైన
ముసిరే తలపుల మిసమిసలేవో
గుసగుసలాడే కమ్మని వేళ


ప్రకృతి కాంతకు నెచ్చెలి నేనై
విచ్చిన పువ్వుల నవ్వులు నాకై
విరిసే వయసుల మధుమాసంలో
వలపుల జల్లులు కురిసే వేళ

మనసే పాడినది
మరులై పూచినది
సుమ గంధాల అందాలు చిలికినది

 


నా పాటల్ని ఇష్టపడుతున్న, ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకు మరియు పెద్దలకు చిన్న విన్నపము. నాకస్సలు సంగీత జ్ఞానం లేదు. నా మనసులో ఏ రాగం మెదిలితే దానికి అలా పదాలను కూరుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పెట్టిన రాగాలన్నీ చాలా నెమ్మదిగా ఉన్నాయి.. ఇంకా కాస్త మెరుగైన, హుషారైన బాణీలను కూర్చటానికి ప్రయత్నిస్తున్నా. మామూలుగానే నాకు మెలోడీస్ అంటే ఇష్టం.. ఆ కారణంతోనో మరేమో నాకు అన్ని రాగాలు ఇలానే వస్తున్నాయ్. అన్నీ ఒక మూస లోనే ఉన్నాయి అని అనుకోకుండా నన్నింకా ప్రోత్సహిస్తూ ఉంటారని మనఃస్పూర్తిగా ఆశిస్తున్నాను.   


**పాటకి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పెట్టమని ప్రోత్సహించి, ఆ టైటిల్స్ కూడా తనే వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను...

Friday, November 2, 2012

గుండె గూడు మూగబోయి...



  


గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!

తూరుపు తెలవారుతున్నా
మనసుకేది వేకువ అంటూ
విడిచిన ఆ నిట్టూర్పులలో
జాలువారు కన్నీటిలో
కుసుమించిన కిరణమై నేస్తమా!
ఓదార్పువు నువ్వే స్నేహమా!

చినబోయిన పెదవులపైన
చిన్ని నవ్వు చూడాలని
ప్రతి పువ్వును కుశలమడుగుతూ
కమ్మని ఆ మధువులు తెచ్చి
తేనె చినుకు నువ్వై నేస్తమా!
పలకరించు నవ్వువు స్నేహమా!

గుండె గూడు మూగబోయి
గుబులుకొన్న చీకటిలోన
దారి చూపు దీపము నీవే
అడియాశల జీవితాన
అడుగడుగున నువ్వే నేస్తమా!
చిగురించిన ఆశవు స్నేహమా!