Search This Blog

Showing posts with label మనసు మెచ్చినవి. Show all posts
Showing posts with label మనసు మెచ్చినవి. Show all posts

Wednesday, February 22, 2012

కురవని మేఘం..



ఏ దారిలో మేఘం నీవో
నా దారికి వచ్చావు
నా మనసున స్నేహం నింపి
కనులకు చినుకులు చేర్చావు

చేతలకు అందలేదు
మాటలకూ అందలేదు
చూపులకు తోస్తున్నావు
చేరాలని రెక్కలు నే కట్టినా
అంత దూరం రాలేకున్నా

నే తప్పులు చేస్తే
మెరుపులతో బెదిరించు
ఉరుములతో దాడిచేయించు
నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు
చినుకులైనా కురిపించు
మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!


ఈ కవితను నా నేస్తం వ్రాసాడు ఇంకో నేస్తం కోసం..నాకు చాలా నచ్చి ఇక్కడ ప్రచురించుకుంటున్నాను.

మౌనం ఒక్కోసారి ఎంత నరకమో కదా..అదీ ఆత్మీయులనుకున్నవారు పలకరించకపోతే ఇంక ఆ బాధ కన్నా విపరీతమైనది సృష్టిలో లేనే లేదు.నా వరకు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది.

నిశ్శబ్ధం ఆవరించిన నల్లని మేఘం.. నిజమే అది కురవాలి..కురవాలంటే చల్ల గాలి తోడవ్వాలి..ఆ గాలి తోడు లేకుంటే ఆ మేఘం ఎందుకు?

స్నేహమూ అంతే.. మనసుకు వేరొక మనసే సాంత్వన అందించాలి.లేకుంటే మనసు మనుగడేది? ఒంటరిగా కుమిలిపోవడం తప్ప.అప్పటివరకు కురవని మేఘంలా స్తబ్ధుగా ఉన్న మనసు ఒక చిన్న ఆత్మీయ స్పర్శతో పులకించి కురిసిపోతుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మనసుకు మనసు చేదోడుగా ఉంటే ఆ స్నేహంలో తీయదనం చెప్పేదేముంది! ఇలాంటి ఒక స్నేహం ఉంటే జీవితమే మధురం కదూ..మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలమీ స్నేహం.అందుకే కొన్ని సార్లు రక్తబంధం కన్నా స్నేహబంధం గొప్పది అంటారు పెద్దలు.ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే కదండీ.ఐనా నేను చెప్పేదేముందీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఈ స్నేహమాధుర్యం..

Thursday, October 13, 2011

స్మృతి

మరణించినవారు స్వార్థపరులు
మనం వెక్కి వెక్కి ఏడుస్తున్నా
ఒక్కసారైనా ఊరడించరు
వాళ్ళంతే
నడవడానికి కూడా బద్దకమే
భుజాన మోయించుకుంటారు
పిల్లల్లా స్నానం చేయించుకుంటారు
ఎంత దర్పమో
మనకి తెలియని సత్యాలేవొ తెలిసినట్టు
మనం చూడని లోకాలేవో చూసినట్టూ
వెళ్ళేప్పుడు మాటవరసకైనా చెప్పరే
మహా మొండి ఘటాలు
హెచరిస్తున్నట్టో, మనల్ని నిందిస్తున్నట్టో
మొహం మాడ్చుకుని ఉంటారు
తమ మాటే నెగ్గాలన్నట్టు
బిర్ర బిగుసుకుపోతారు
తామే ప్రత్యేకమైనట్టు
కర్రల రథమెక్కి ఊరేగుతారు
మహా మతిమరుపు
ఏదీ గుర్తుంచుకోరు ఎవర్నీ గుర్తుంచుకోరు
మనం మాత్రం గుర్తుంచుకోవాలి ఏడాదికోసారైనా
 ఏంజెల్ గోంజాలేజ్ రచనకు స్వేఛ్ఛానుకరణ ఇది.. ఒకసారెప్పుడో చదివినప్పుడు నాకు బాగా నచ్చి పుస్తకంలో వ్రాసుకున్నాను. ఎందుకో ఈ రోజు ప్రొద్దున్న చూసాను అకస్మాత్తుగా. ఇలా బ్లాగింగ్ చేసాను. ఆయన 20 వ శతాబ్దపు సుప్రసిద్ధ స్పానిష్ కవి.


Tuesday, October 4, 2011

గీతాంజలి..ఒక్కొక్క పాట ఒక్కో పూదోట.

నేను పాడడానికి వచ్చిన పాట
ఈనాటికీ పాడకుండానే మిగిలిపోయింది
నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తూ
వదులు చేస్తూ నా రోజుల్ని గడిపేసాను
తాళం సరిగా సాగలేదు
పదాల కూర్పు కుదరలేదు
నా హృదయంలో కాంక్షా బాధ మాత్రమే మిగిలిపోయింది
 పువ్వు విచ్చుకోలేదు
గాలి మాత్రం నిట్టూర్చుతోంది పక్కన
అతని ముఖాన్ని చూడలేదు నేను
అతని కంఠమూ వినలేదు
నా ఇంటి ముందు నుండి నడిచే
అతని మెత్తని పాద ధ్వనిని మాత్రమే వినగలిగాను
నేలపై అతనికి ఆశనం పరచడంలోనే
దినమంతా గడిచిపోయింది
ఇంకా దీపం వెలిగించలేదు
అతన్ని ఇంట్లోకి ఎలా అహ్వానించను?
అతన్ని కలుసుకోగలననే ఆశతో బ్రతుకుతున్నాను
కానీ ఆ కలయిక ప్రాప్తించింది కాదు...   ----ఠాగోర్ గీతాంజలికి చలం అనువాదం