Search This Blog

Friday, October 5, 2012

నీ కౌగిలిలో...!

నేను గుర్తున్నానా నేస్తం?
అడిగాను అలవోకగా.,
ఒక నవ్వు విరబూసింది
తన పెదవులపై జవాబుగా.,
కోపం వచ్చింది నాకు భలేగా
ఐనా నన్నెందుకు గుర్తుపెట్టుకుంటావులే
అనేసాను నిష్ఠూరంగా.,
బదులుగా నా వైపు ఒక చూపు జాలిగా.,
కరిగానా? ఊహూ!
నా భావాలేం కనిపించకుండా మోము దాచేసానుగా.,
ఇదంతా నన్ను ఆట పట్టించడానికే అని 
మరి నాకు ముందే తెలుసుగా.,
అందుకే ఏమౌతుందా అని చూస్తున్నా ఆశక్తిగా.,
దాచిన ఆ మోమును చేతిలోకి తీసుకొని
నా కళ్ళలోకి చూస్తుంటే.,
తన కళ్ళేదో చెప్తున్నట్టే అనిపిస్తోంది మూగగా.,
చినుకు లేకుంటే 
మేఘం తనని మరిచిందని కాదుగా

పలికాయి తన పెదవులు ఆర్తిగా.,
వింటున్న మనసుకు ఏదో ఇదిగా
తన కౌగిలిలో ఒదిగిపోయాను హాయిగా..!  

Wednesday, September 19, 2012

శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులకు మరియు పెద్దలకు వినాయక చవితి శుభాకాంక్షలు..!

Friday, September 7, 2012

ఆ పువ్వుల వరమిస్తావా!!


ఎందుకూ తనని ముని పంటితో 
అదిమి పట్టి ఉంచుతావు
తనని చూడాలని ఈ మనసుకు
ఎంత తపనో తెలుసా.,
తనని వదిలితే ఎందరి మనసుల్ని
మురిపించేస్తుందో అని నీ భయం కాబోలు.,
అందర్ని మురిపించడం సరే..,
తనతో పాటుగా ఎప్పుడైనా 
నిన్ను నువ్వు చూసుకున్నావా
అలా చూసి ఉంటే., 
యధేఛ్ఛగా తనని వదిలేసేవాడివేమో
కానీ నువ్వా అవకాశమే ఇవ్వవు.,
నీ పెదాలపై విరబూయాలని తను
ఆ పువ్వులన్నీ ఏరుకుని హారాలల్లుదామని నేను
మా ఈ ఎదురు చుపులకు 
అలుపు లేకుండా పోతోంది తెలుసా!
ఇలా తనను, నన్ను 
వేధించడం నీకేమన్నా భావ్యమా చెప్పు.,
నీ నుంచి నేనేమీ కోరుకోను
నువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..! 

Saturday, August 4, 2012

తేనెలూరే నవ్వునై..


రెమ్మ రెమ్మకు నేనే రాగాలు చిలికిస్తానని
మెల్ల మెల్లగా వీచే ఆ పిల్ల గాలులకు 
పరిమళ గంధాలు అద్దుతానని
ఝుమ్మను నాదాల కొంటె తుమ్మెదకు
కమ్మని తేనెల వలపునని
మదిలో ఏవేవో ఆలాపనలు సేయుచుండ.,
చటుక్కున కొమ్మల వెనుక దాగిన
నీ మోముని చూసి అచ్చెరువొంద.,
అరవిరిసిన అందాలతో ఆ రెమ్మ నుండి విడివడి 
గుబాళించిన పువ్వునే.,
ఆ ముద్దొచ్చే పెదవులపై 
నీ నవ్వునైపోయా..!!


ఈ నవ్వుల పువ్వులు మీ పెదవులపై ఎప్పుడూ విరబూయాలని కోరుకుంటూ బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక ఫ్రెండ్ షిప్ డే "సుభా"కాంక్షలు..