Search This Blog

Thursday, January 5, 2012

అడగాలని ఉన్నా అడగలేను..!



తను అనుకుని ఉండదు నువ్విలా చేస్తావని..
నువ్వు లేకున్నా
బ్రతకడం నేర్చుకుంది ఎలాగో జీవఛ్ఛవంలా.,
నాకు బాధంటే ఏమిటో తెలియకుండా చేసింది
తను మాత్రం తీరని వేదనను అనుభవించింది
నాకు తనని అడగడం రాదు.,ఎందుకంటే..
బాధను భరిస్తూనే నాకు జన్మనిచ్చింది
గుండెలోని ఉప్పెనను గుప్పెటలో అదిమిపట్టి
పెదవుల్లో మాత్రం చెరగని చిరునవ్వు నింపుకుని
నాకు పూలబాట పరచిన జీవితాన్నిచ్చింది.,
ఊహ తెలియకముందు నాకు తెలియదు
తెలిసిన తర్వాత తెలిసింది నువ్వంటే ఏమిటో
లోకులు కాకులై అరుస్తుంటే.,
అదే సమయంలో నువ్వంటే
పెరిగిన ఏహ్యభావం చిగురులు తొడగటం మొదలుపెట్టింది..
నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం 
నేర్పించని తన వల్ల అది మొగ్గ వరకు కూడా ఎదగలేదు.,
నాకు నిన్ను అలా పిలవాలని ఎప్పుడూ అనిపించలేదు
ఏ మూలో ఇంకా నాలో ఆ చివురుల తాలూకు 
ఆనవాలు మిగిలిపోయుంటుంది..
నాకు జన్మనివ్వడంలో నీ ప్రాధాన్యత ఎంతో ఉంది
అందుకే ఆ ఛాయలు అప్పుడప్పుడూ నాలో 
నీకు గౌరవం ఇవ్వడంలో ప్రస్ఫుటమౌతుంటుంది..
నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వదిలిపెట్టి
నీ దారి నువ్వు చూసుకున్నప్పుడే 
అర్ధం అయింది నాకు, నీకు "నాన్న" అంటే అర్ధం తెలియదని 
నిన్ను అడగాలనే ఉంటుంది నాకు ఎందుకిలా చేసావు అని
కాని అది వ్యర్ధం అని తెలిసి
తిరిగి అమ్మలోనే నాన్నను నింపుకుంటున్నా..! 



ఏ తోడూ లేకున్నా,ఎవరి సహకారం లేకున్నా, లోకులు కాకులై పొడుస్తున్నా లెక్క చేయక తమ రెక్కల కష్టంతో తమ పిల్లల్ని పెంచి, పోషించి వాళ్ళని ఒక మంచి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే ఎంతో మంది  తల్లులకు ఇలా వందనాలు అర్పించుకుంటున్నాను... 

Saturday, December 31, 2011

శుభాకాంక్షలు




వెలుగు చూసా చీకటి చూసా., 
కష్టమెరిగా నష్టమెరిగా., 
కలలు చూసా నిజము చూసా.,
జయాపజయాలను పొంది చూసా., 
నేను కాలాన్నైనా మీలా మనసుతో చూసాను...   
సరి కొత్త సమయానికై ఎదురుచూస్తూ., 
గతాన్ని స్మరించుకుంటూ.,  
అనుభవాలనే చిరు నగవులుగా చిందిస్తూ.,
కొత్త రంగులను చూడబోయె పసిపాపలా  
వేచి వున్నా నూతన సంవత్సరానికై.,
మీ అందరికీ స్వాగత సుమాంజలి పలుకుతూ!!

బ్లాగ్ మిత్రులందరికీ నా తరపున మరియు నాలోమాట బ్లాగర్ కళ్యాణ్ గారి తరపునా నూతన సంవత్సర 'సుభా ' కాంక్షలు. 
  
నా బొమ్మకి కవిత వ్రాయండి అని అడగగానే ఒక చక్కని కవితను వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను:)

Wednesday, December 28, 2011

ఊహల ఊయలలో...

నీ తలపులు
నాలో వలపులై పొంగెను., 
నీ పిలుపులు
నాలో స్వరములై పలికెను., 
నా యెదలో 
నీ రూపమే చిత్తరువై నిలిచెను., 
నా కనులలో 
నీ కలలే వెలుగులై విరబూసెను., 
నీ స్నేహాన్ని మరచి 
నా ఒంటరితనాన్ని గెలవలేను., 
నా ఏకాంతంలో 
నీవు లేని నన్ను ఊహించలేను., 
ఇలా అందీ అందని నిన్ను ఎప్పటికి కలిసేను 
నా మనసు సంగతి నీతో ఎలా చెప్పేను !!!

Tuesday, December 20, 2011

శుభాకాంక్షలు

 అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నది ఒక మహా కవి మాట.. ఆ మాటలనే నాలో మాట గా చేసి, నిత్య జీవితంలో తారసపడే ఎన్నో ఘటనలే తన స్పందనలకు మూలం అని చెప్పే "నాలో మాట" బ్లాగరు కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేద్దామా... రండి మరి ఆలశ్యమెందుకు?



కళ్యాణ్ గారూ మీ కోసం ఈ చిన్ని గ్రీటింగ్ కార్డ్. 
    


Thursday, December 1, 2011

నీ చెలిమి నన్ను స్పృశించే వేళ...

 తొలి చినుకు తాకే వేళ
వింత పరిమళాలు చిందే పుడమి.,
భానుని లేలేత కిరణాలు సోకి
పరవశించి విరిసే పూల బాలలు.,
అమ్మ చేయి స్పర్శతో
బోసి నవ్వులు చిందించే బుజ్జాయి.,
గుండె చెరువైన వేళ
నేనున్నానని చేయి అందించే నేస్తం.,
కానరాని కన్నులకు సహితం
ఏదో స్పూర్తినిచ్చే స్పర్శ..
అదే ఆత్మీయతలోని ఆనందం
విడదీయలేని తీయని అనుబంధం !!!