Search This Blog

Saturday, September 17, 2011

అనంత పాయ్ : (17 September 1929 – 24 February 2011)

ఈయన అందరికీ అంకుల్ పాయ్ అని తెలుసు. మంచి విద్యావేత్త, మరియు ఇండియన్ కామిక్స్ సృష్టికర్త. ఈయన జన్మస్థలం, కర్ణాటక రష్ట్రన్ లోని కార్కల. తల్లి దండ్రులు సుశీల, వెంకట రాయ. పాయ్ 2 సంవతరాల వయసులో ఉండగా తన తల్లిదండ్రులను కోల్పోయాడు.
బొంబాయి యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ లలో రెండు డిగ్రీలను అందుకున్నాడు.
పాయ్ 1967 లో సృష్టించిన "అమర్ చిత్ర కథ" యెంతో ఖ్యాతి పొందింది. ఈ పుస్తకం ఏటా 3 మిలియన్ల కాపీలు అమ్ముడ్పొతున్నాయి. ఇంగ్లీషు మరియు 20 భారతీయ భాషలలో ఈ పుస్తకం ప్రచురించబడుతోంది.
ఈయన ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. కామిక్స్ లో లైఫ్ టైం అవార్డు, విశ్వ సారస్వత సమ్మాన్, ప్రియదర్శిని అకాడమి అవార్డు, రాజా రామ్మోహన రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అవార్డు ఇలా ఎన్నో...       

Friday, September 16, 2011

భావ వ్యక్తీకరణ

మనందరికీ చాలా రకాలైన హక్కులున్నాయి. అందులో భావాలను వ్యక్తీక్తీకరించడం ఒకటి. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వెల్లడించడం అంటే చాలా ధైర్యం కావాలి. అందుకు సరైన మాటలు కూడా కావాలి. ఇలాంటి భావ వ్యక్తీకరణలో 'విమర్శ ' చాలా ముఖ్యమైనది అని నేననుకుంటాను. విమర్శ చేయడం అన్నది కూడా ఒక కళ. ఎందుకంటే విమర్శలలో కొన్ని స్పూర్తి దాయకం గాను, కొన్ని బాధ పెట్టేవి గాను, కొన్ని సరదాగాను ఇలా పలు రకాలుగా ఉంటాయి.
అసలు ఈ అభిప్రాయాలను వెల్లడించడం అనే అంశాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని బ్లాగులలో విమర్శలు లేదా అభిప్రాయాలు చూస్తుంటే.. ఆయా బ్లాగర్లకి అవి ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కాని నాకెందుకో బాధగా అనిపించింది. ఎందుకంటే ఆ అభిప్రాయాలు చదవడానికి వీల్లేనంతగా ఉంటున్నాయి కాబట్టి.
మేమెవరో తెలియదులే అని అలా చేస్తున్నారో, ఎలా వ్రాసినా పర్వాలేదని అనుకోవడమో తెలియదు. 
మన అభిప్రాయాలను తెలియపరిచేటపుడు మనల్ని ఏంట్రా బాబూ తింటున్నావ్ అని కాస్త సరదాగా తిడుతూ వ్రాసినా పర్వాలేదు కాని, అంత అసభ్య పద జాలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదని నా అబిప్రాయం.  
ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది అని అనుకునే కన్నా సరైన పదజాలం ఉపయోగిస్తే మంచిదేమొ అని అనిపిస్తుంది. చదివేవాళ్ళ మనసుకు కూడ హాయిగా అనిపిస్తుంది.
నేనేమన్నా తప్పుగా వ్రాస్తే బ్లాగర్లు, బ్లాగు చదివేవాళ్ళు మన్నించవలిసిందిగా మనవి. కాని ఒకసారి ఆలోచిస్తే కూడా మంచిదేమో అని నా అభిప్రాయం.

ఆ క్షణం కోసం ...

కలలా కనిపించావు
కలలాగే వెళ్ళిపోయావు
కలలన్నీ కల్లలు చేసి.,
కనికరమే కలగని ఈ కాలాన్ని
నా కలవరపాటు కాసింతైనా కదిలిస్తుందా? ?
నా కనులు కన్న ఆ కలని
తిరిగి కలుసుకోగలనా??
కలవరించే కన్నులకు
ఇక కలత నిదురలేనా??
 నీలో కలిసిపోయే ఆ నిమిషం కోసం
కలిసిరాని కాలాన్ని బ్రతిమాలుతున్నా నేస్తం ! !

Thursday, September 15, 2011

ఊహల ఊయల్లో...

నా ఊహల ఊయల్లో
అలవి కాని ఎన్నో అందాలు.,
నా ఆశల ఊసుల్లో పలుకలేని ఎన్నో భావాలు.,
నా కనుల కొలనుల్లో
కరిగిపోని ఎన్నో కాలాలు.,
నా జీవన వేణువులో
రవళించని ఎన్నో రాగాలు.,
విరి తేనెల మరులు కురిసి
తెలి వలపుల విరులు విరిసి
మది కోయిల పరవశించే
మధుర మకరంద క్షణాలకై
నా ఈ నిరీక్షణా వీక్షణలు . . !

Wednesday, September 14, 2011

నెచ్చెలినై...

క్షణం క్షణం
నా మనసుకు దగ్గరగా వస్తావు..
అనుక్షణం
నా తలపులలో విహరిస్తావు..
నేను పీల్చే శ్వాసల్లో
నీ పరిమళాలే వెదజల్లుతావు..
నడి రాతిరిలో
స్వప్నానివై మరలిపోతావు..
తొలి పొద్దులో
సూర్యునివై వెచ్చని మేల్కొలుపువౌతావు..
కలవో, "కల"వో.,
చెలిగా నిన్ను చేరే రోజు కోసం
"కల"వరిస్తూనే ఉంటాను నేస్తం !!